సీపీఎస్ విధానం వద్దే వద్దు


Fri,February 22, 2019 10:41 AM

TNGO president Karam Ravinder Reddy fires on CM KCR over Employees Bifurcation Problems

-రద్దుపై అధికారం రాష్ర్టాలకు ఇవ్వాలి
-ఉద్యోగుల సమస్యలపై సానుకూల దృక్పథంతో సీఎం కేసీఆర్
-15 ఏండ్లుగా ఉద్యోగ వ్యతిరేక విధానాల్లో యూపీఏ, ఎన్డీయే
-చలో పార్లమెంట్ ధర్నాలో టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని రద్దుచేసి.. పాత విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ఎన్జీవోల కేంద్ర సంఘ అధ్యక్షుడు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి డిమాండుచేశారు. సీపీఎస్ రద్దుకు రాష్ర్టాలు సానుకూలంగా ఉన్నా.. కేంద్రం పట్టించుకోవడంలేదని, సీపీఎస్ రద్దు అధికారాలు రాష్ర్టాలకు ఇవ్వాలని కోరారు. కేంద్రప్రభుత్వ ఉద్యో గ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ గురువారం అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కంట్రిబ్యూటరీ పింఛన్ విధానం రద్దుకోసం 19 సార్లు ఢిల్లీ వేదికగా ఉద్యమించామన్నారు. యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు పదిహేనేండ్లుగా ఉద్యోగులకు నష్టంచేశాయని విమర్శించారు. సీపీఎస్ రద్దుకోసం దేశవ్యాప్త ఉద్యమాలకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. ఆరు ప్రధాన డి మాండ్ల సాధనకోసం ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు మూడునెలల జీతాన్ని ఇన్‌కంట్యాక్స్ కింద చెల్లించాల్సిరావడం విచారకరమని, రూ.పదిలక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇవ్వాలని కో రారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. ఉద్యోగుల వ్యవస్థను, సంస్థలను బలహీనపరిచే విధానాలను కేంద్ర ప్రభుత్వం చేపట్టవద్దని, ముప్పైఏండ్లు ఉద్యోగంచేస్తే కనీసం రూ. మూడువేల పింఛన్ వచ్చే పరిస్థితి కూడా సీపీఎస్ విధానంలో లేదన్నారు.

దీనివల్ల తెలంగాణలో 1.23 లక్షల మంది ఉద్యోగులు, దేశవ్యాప్తంగా 40 లక్షల మంది నష్టపోతున్నారని వివరించారు. సీపీఎస్‌ను రద్దుచేసే పార్టీలకే రాబోయే ఎన్నికల్లో ఉద్యోగుల మద్దతు ఉంటుందని స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న నష్టంపై సీఎం కేసీఆర్ సానుకూల దృక్పథంతో ఉద్యోగసంఘాలతో చర్చించడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు రవీందర్‌రెడ్డి చెప్పారు. ధర్నాలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, టీఎన్జీవో సహ అధ్యక్షురాలు బండారు రేచల్, జిల్లా సంఘాల నేతలు ముజీబ్, ప్రభాకర్, ప్రతాప్, నిరంజన్‌రెడ్డి, రామయ్య, బాలకృష్ణ, కిషన్, అమృత్‌కుమార్, లక్ష్మణ్, బుచ్చిరెడ్డి, నరేందర్, శ్రీహరి, రవిప్రకాశ్, కేంద్ర సంఘ నేతలు కస్తూరి వెంకటేశ్వర్లు, చందు, యాదగిరిరెడ్డి, పంచాయతీ కార్యదర్శుల ఫోరం నుంచి పర్వతాలు, ఏఈవోల ఫోరం నుంచి శ్రీనివాస్‌గౌడ్ తదితరులతోపాటు 400మంది టీఎన్జీవోలు, 29 రాష్ర్టాల ఉద్యోగులు పాల్గొన్నారు.

1231
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles