దుష్ప్రచారం తగదు

Sun,October 13, 2019 02:24 AM

-సమస్యల పరిష్కారానికే సీఎం కేసీఆర్‌ను కలిశాం
-తెలంగాణ ఉద్యోగుల జేఏసీ స్పష్టీకరణ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, టీఎన్జీవో, టీజీవో సంఘాలపై కొంతమంది ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వీ మమత ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసమే సీఎం కేసీఆర్‌ను కలిశామని స్పష్టంచేశారు. ఏదైనా సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రిని కలిస్తే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్టు ఎలా అవుతుందని వారు ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు కూడా ఏదో ఒక రూపంలో సీఎం తో జరిగే చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.

ఈ మేరకు శనివారం జేఏసీ తరఫున ఒక ప్రకటన విడుదల చేశా రు. గత ఏడాది ఉద్యోగుల జేఏసీతో నిర్వహించిన సమావేశంలో, గత అసెంబ్లీ సమావేశాల్లో ఇచ్చిన హామీలను అమలుచేయాలని సీఎం కేసీఆర్‌ను కలిసి కోరామని వారు తెలిపారు. కొన్ని సంఘాలు, వాటి రాజకీయ పార్టీల నేతలు ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ, టీఎన్జీవో, టీజీవో ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల పేరిట సోషల్‌మీడియాలో ఇష్టారీతిన కామెంట్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగులు, టీచర్లు, కార్మికుల మధ్య అగాధాన్ని సృష్టించేలా వ్యాఖ్యలు చేయడం సమంజసంకాదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చిన తర్వాతే ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వంలో పీఆర్సీ ఇచ్చారని, అందరికంటే ఎక్కువగా ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని గుర్తుచేశారు.

బెదిరింపులకు పాల్పడితే నష్టమే

ఇక ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలకు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఎలాంటి సంబంధంలేదని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ మమత స్పష్టంచేశారు. అయినప్పటికీ తోటి కార్మికులుగా రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సకలజనుల సమ్మెలో పనిచేశామని, అదే స్ఫూర్తితో ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఆర్టీసీని ప్రజలకు సేవలందించే ఒక రవాణా సంస్థగా పరిగణిస్తున్నామని, అందుకే ప్రభుత్వంతో జరిగే చర్చల్లో ఉద్యోగుల సమస్యలతోపాటు ఆర్టీసీ సమస్యలపై కూడా చర్చిస్తామని ప్రకటించారు.

ఉద్యమంలో ఉద్యోగసంఘాల మద్దతు కోరడంలో తప్పులేదని కానీ, బెదిరింపులకు పాల్పడితే అది నష్టపరుస్తుందని హెచ్చరించారు. టీఎన్జీవో, టీజీవోల పట్ల కొన్ని సంఘాలు అవలంబిస్తున్న వైఖరినే.. ఆయా సంఘాల పట్ల తామూ అవలంబిస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆరేండ్లుగా అనేక సమస్యలను పరిష్కరించిందని, ఈ విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ఆందోళన చెందవద్దని రవీందర్‌రెడ్డి, మమత భరోసా ఇచ్చారు.

641
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles