కవ్వాల్‌లో కనిపించిన పెద్దపులి


Sun,December 16, 2018 01:23 AM

tiger in cc tv kawwal forest officers of telangana expressed happiness

-తెలంగాణలోని అభయారణ్యానికి పులుల వలస
-కడెం రేంజ్‌లో కెమెరాకు చిక్కిన పులి కదలికలు
-ఏడాది తర్వాత పెద్దపులిని గుర్తించిన అధికారులు

ప్రత్యేక ప్రతినిధి / మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కవ్వాల్ అభయారణ్యంలో పెద్దపులి కనిపించింది. అటవీశాఖ ఏర్పాటుచేసిన కెమెరాలకు దాదాపు ఏడాది విరామం తర్వాత పులి చిక్కింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ డివిజన్ పరిధిలోని కడెం రేంజ్‌లో ఏర్పాటుచేసిన కెమెరాల కంటికి పులి కదలికలు చిక్కాయి. మహారాష్ట్రలోని తడోబా నుంచి వలస వచ్చిన మగపులిగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. కొన్నాళ్లుగా అడపాదడపా పులి సంచరిస్తున్న జాడలు ఉన్నాయి. పులి జాడ అటవీశాఖ అధికారులు, సిబ్బందిలో సంతోషాన్ని నింపింది. ప్రస్తుతం కనిపించిన మగపులి ఆరోగ్యంగా ఉన్నదని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ సీ శరవణ్ తెలిపారు. కవ్వాల్ ప్రాంతం పులులకు శాశ్వత ఆవాసంగా ఉండేలా మరిన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, స్థానిక గ్రామాల ప్రజలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ.. పెంపుడు జంతువులు, మనుషుల సంచారాన్ని పూర్తిస్థాయిలో నివారించాలని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) పీకే ఝా ఆదేశించారు.

సత్ఫలితాలిస్తున్న చర్యలు


కవ్వాల్ రిజర్వ్ పులుల శాశ్వత ఆవాసానికి అనువుగా పరిస్థితులు లేకపోవడంతో కొంతకాలంగా అటవీశాఖ తీసుకొంటున్న చర్యలు సత్ఫలితాలినిస్తున్నాయి. మానవ సంచారం జరుగకుండా చూడటం, చెట్లు కొట్టడం, పెంపుడు జంతువులను మేపటాన్ని అటవీశాఖ నిషేధించడంతోపాటు గడ్డిక్షేత్రాల పెంపునకు ఇచ్చిన ప్రాధాన్యం కారణంగా మహారాష్ట్ర నుంచి పులులు వలస వస్తున్నట్టు గుర్తించారు. తాగునీటి వసతి ఏర్పాటుచేయడంతో శాఖాహార జంతువుల సంఖ్య కూడా పెరిగింది. వీటిపై ఆధారపడే మాంసాహార జంతువుల సంఖ్య కూడా కొంతకాలంగా పెరుగుతూ వస్తున్నది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కోర్ ఏరియాలోని రాంపూర్, మైసంపేట గ్రామాల తరలింపునకు స్థానికులు అంగీకరించడంతో.. రూ.8.52 కోట్ల నిధుల విడుదలకు జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఆమోదం తెలిపింది. కాగా, వలస వచ్చిన పెద్దపులులు తిరిగి పొరుగు రాష్ర్టాలకు వెళ్లకుండా అటవీ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

కదంబలో ఫల్గుణ


నాలుగేండ్ల క్రితం కాగజ్‌నగర్ కదంబకు వచ్చిన ఫల్గుణ.. పలు కూనలకు జన్మనిచ్చింది. నాలుగు పిల్లలు సంచరిస్తున్న దృశ్యాలు గతంలో కెమెరాలకు చిక్కాయి. వేటగాళ్ల ఉచ్చుకు చిక్కుకొని కే4 గాయపడింది. కాగజ్‌నగర్‌లో తాజాగా ఫల్గుణ మూడు పిల్లలకు జన్మనిచ్చినట్టు అధికారులు గుర్తించారు. ఏప్రిల్‌లో కెమెరాకు చిక్కిన కూనలు తర్వాతి కాలంలో మళ్లీ కనిపించలేదు. అయితే ఇటీవల కెమెరాట్రాప్‌లలో వాటి దృశ్యాలు నమోదవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

2147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles