పలుచోట్ల అకాల వర్షం


Sat,May 25, 2019 02:46 AM

Three cattle killed after a Thunderbolt in Vikarabad district

-పిడుగుపాటుకు ఆదిలాబాద్‌లో ఇద్దరు, మంచిర్యాలలో ఒకరు మృతి
-వికారాబాద్ జిల్లాలో మూడు పశువుల మృత్యువాత
-పెద్దపల్లి జిల్లా ధర్మారంలో గాలివాన బీభత్సం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షం పడింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతోపాటు అక్కడక్కడ పిడుగులుపడ్డాయి. పిడుగుపాటుకు ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు, మంచిర్యాలలో ఒక రు మృతిచెందారు. వికారాబాద్ జిల్లాలో మూడు పశువులు మృత్యువాత పడ్డాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో గాలివాన బీభత్సం సృష్టించింది. వివరాలు ఇలా.. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం తేజాపూర్‌లో గురువారం సాయంత్రం వర్షంతోపాటు పిడుగుపడింది. గ్రామ శివారులో పల్లెరి నారాయణరెడ్డికి చెందిన వ్యవసాయ పొలంలో అదే గ్రామానికి చెందిన గంగన్న(35)తోపాటు బోథ్ మండలం రేండ్లపల్లికి చెందిన మారుతి (30) పని చేస్తున్నారు. వర్షం కురుస్తున్న సమయంలో వీరిద్దరూ సమీపంలో ఉన్న చెట్టు కిందకు వెళ్లగా.. చెట్టుపై పిడుగు పడింది. దీంతో వీరు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

మంచిర్యాల జిల్లాలో ఉపాధ్యాయుడు..

మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లికి చెందిన మిరియాల రాజేందర్ (33) అనే ఉపాధ్యాయుడు పిడుగుపాటుకు మృతి చెందారు. మందమర్రి ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజేందర్ పోలంపల్లిలో మూడెకరాల పొలం ఉం డగా తండ్రి సాయంతో వరి పండించారు. శుక్రవారం ఉదయం చిరుజల్లులు పడటంతో సమీపంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పి అక్కడే ఉన్న పందిరి కిందికి వెళ్లాడు. కొద్దిసేపటికి బయటికి రాగా పిడుగుపడి స్పృహ కోల్పోయాడు. అక్కడున్న హమాలీలు గమనించి అతడిని మంచిర్యాల దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

మూడు పశువులు మృత్యువాత..

పిడుగుపాటుకు వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లిలో గురువారం రాత్రి మూడు ఎద్దులు మృత్యువాత పడ్డాయి. రైతు కొత్తబాయి అంజిలప్ప గురువారం సాయం త్రం పొలం వద్ద పశువులను కట్టేసి ఇంటికి వెళ్లి శుక్రవారం ఉదయం వచ్చి చూసేసరికి అవి మృతిచెంది ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.2లక్షల వరకు విలువ ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మారంలో గాలివాన..

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో గురువా రం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. నందిమేడారం, గోపాల్‌రావుపేట, సాయంపేట, బొట్లవనపర్తి గ్రామాల్లో గాలివానతో తీవ్రమైన నష్టం జరిగింది. ఆయా గ్రామాల్లో పదికిపైగా విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి పడిపోగా, మామిడి కాయలు రాలిపోయాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు శుక్రవారం రెవెన్యూ, ఉద్యాన, ట్రాన్స్‌కో సిబ్బంది ఆయా గ్రామాల్లో పర్యటించి నష్టం అంచనా వేశారు. దాదాపు 120 ఎకరాల్లో మామిడికి నష్టం వాటిల్లిందని ఉద్యాన శాఖ విస్తీర్ణ అధికారి మహేశ్ తెలిపారు.

2855
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles