ప్రేమపెండ్లి నచ్చక ముగ్గురి దారుణహత్య

Sun,October 13, 2019 02:34 AM

-క్రిమిసంహారక మందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించి.. ఆపై బ్లేడ్‌తో గొంతు కోసి..
-తోడబుట్టిన అన్న,అన్నకూతురు, సొంత బిడ్డనూ చంపిన వైనం
-కామారెడ్డి జిల్లా దోమకొండలో కలకలం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: అన్న కూతురు ప్రేమవివాహం చేసుకోవడం నచ్చక ఓ వ్యక్తి తన అన్న, అన్న మరోకూతురితోపాటు కడుపున పుట్టిన బిడ్డను అతికిరాతకంగా కడతేర్చాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలకేంద్రంలో శనివారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన బందెల బాలయ్య-మణెమ్మకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు దీప కొన్నిరోజుల క్రితం అదే గ్రామానికి చెందిన నర్సింహులును ప్రేమవివాహం చేసుకుంది. అది ఇష్టం లేని బాలయ్య సోదరుడు బందెల రవి ఎలాగైనా వారిని హతమార్చాలని నిర్ణయించుకొన్నాడు.

కుటుంబంలోని అందరిని చంపి, తానూ చస్తానని గ్రామంలో పలువురికి చెప్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సోదరుడు బాలయ్య(42), బాలయ్య చిన్న కూతురు లత(15)తోపాటు తన ఆరేండ్ల కూతురు చందనను ద్విచక్ర వాహనంపై ఊరి చివరకు తీసుకెళ్లాడు. దోమకొండ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మల్లన్న ఆలయం సమీపంలో పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ను వారికి తాగించాడు. వాళ్లు మత్తులోకి జారుకుంటున్న సమయంలో వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో కిరాతకంగా గొంతుకోసి చంపేశాడు.
Latha1
అనంతరం బైక్‌ను పక్కనే ఉన్న గుండ్ల చెరువు వద్ద నిలిపి నడుచుకుంటూ ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హత్యల విషయం వెలుగుచూడడంతో నిందితుడు రవి గ్రామం నుంచి పరారయ్యాడు. ముగ్గురిని దారుణంగా హతమార్చిన రవి కోసం పోలీసులు, ప్రజలు ఊరంతా గాలించారు. కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ మృతదేహాలను పరిశీలించారు. నిందితుడికి కఠినశిక్ష పడేలా చూస్తామని డీఎస్పీ తెలిపారు. అన్న కూతురి ప్రేమవివాహాన్ని వ్యతిరేకించిన రవి.. ఏడేండ్ల క్రితం నర్సింహులు కుటుంబానికి చెందిన ఓ యువతిని ప్రేమవివాహం చేసుకోవడం గమనార్హం.

7317
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles