సీఎం కేసీఆర్ సంతకం ఫోర్జరీ


Sun,May 19, 2019 02:31 AM

Three arrested for creating fake TRS letterhead with forged KCR signature

-గచ్చిబౌలిలో 100 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం..మ్యుటేషన్ చేయాలని లేఖ
-రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు
-ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, పరారీలో మరొకరు
శేరిలింగంపల్లి: ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి వంద కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాహా చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌చేసి వీరి నుంచి 10 ఫోర్జరీ లెటర్‌ప్యాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫోర్జరీ వివరాలను శనివారం మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. నగరంలోని దారుస్సలాం వాసి మహ్మద్ ఉస్మాన్ ఖురేషి.. గచ్చిబౌలిలోని సర్వేనంబర్ 44 పార్ట్‌లో 2.2 ఎకరాల స్థలాన్ని గోల్కొండకు చెందిన రఫియా సుల్తానా నుంచి అగ్రిమెంట్ చేసుకొన్నందున తన పేరిట మ్యుటేషన్ చేయాలని రంగారెడ్డి కలెక్టరేట్‌లో ఈ నెల 14వ తేదీన దరఖాస్తు చేశాడు. దరఖాస్తుతోపాటు సీఎం సంతకం చేసిన టీఆర్‌ఎస్ లెటర్‌హెడ్‌ను జతచేశాడు. దరఖాస్తును పరిశీలించిన చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ.. మ్యుటేషన్ కోరిన స్థలాన్ని ప్రభుత్వస్థలంగా గుర్తించి.. సీఎం కేసీఆర్ పేరిట ఉన్న రికమండేషన్ లెటర్‌ను చూసి సీఎం కార్యాలయంతోపాటు టీఆర్‌ఎస్ ఆఫీస్‌లో ఆరాతీసి నకిలీదిగా తేల్చారు. అనంతరం రాయదుర్గం పోలీసులకు ఈ నెల 15న ఫిర్యాదు చేశారు.

ఫోర్జరీ చేసిందిలా..

ఉస్మాన్‌ఖురేషి తన స్నేహితుడైన శాలిబండకు చెందిన సయ్యద్ రషీద్‌హుస్సేన్‌ను సంప్రదించి ఈ మోసానికి తెరలేపాడు. రషీద్‌హుస్సేన్ తన స్నేహితుడైన నిజామాబాద్‌కు చెందిన బాబాఖాన్‌ను సంప్రదించి సీఎం సంతకం, టీఆర్‌ఎస్ పార్టీ ఖాళీ 10 లెటర్‌ప్యాడ్లను రూ.45వేలకు కొనుగోలు చేశాడు. తొమ్మిదింటిని ఉస్మాన్‌ఖురేషికి రూ. 60వేలకు విక్రయించాడు. మూసారాంబాగ్‌లో నివసించే బిప్యాట అమరేంద్రను సంప్రదించి రెవెన్యూశాఖను అదేశిస్తున్నట్టుగా లేఖ సృష్టించాడు. రషీద్‌హుస్సేన్ మెఘల్‌పురా డివిజన్ టీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ సెక్రటరీగా పనిచేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఉస్మాన్‌ఖురేషి నుంచి 9 లెటర్‌ప్యాడ్లను స్వాధీనం చేసుకొన్న పోలీసులు.. చాదర్‌ఘాట్‌లో 200 గజాల స్థలానికి పరిహారం అందించాలని మెట్రో ఎండీకి, చాదర్‌ఘాట్‌లో 300 గజాల స్థలవివాదం పరిష్కరించాలని నగర పోలీసు కమిషనర్‌కు రాసిన లేఖలను గుర్తించారు. కేసును ఛేదించిన రాయదుర్గం సీఐ ఎస్ రవీందర్, ఎస్‌ఐలు మురళీధర్, అన్వేష్‌రెడ్డిని డీసీపీ వెంకటేశ్వరరావు అభినందించారు.
amarendra

3231
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles