ప్రగతిబాటలో.. జనజాతర!


Mon,September 3, 2018 07:09 AM

Thousands gather at Kongara Kalan for TRS meeting

సెప్టెంబర్ 2.. ఆదివారం..! ప్రపంచ చరిత్రలో మరో సువర్ణాధ్యాయంగా మిగిలిన రోజు! రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో దాదాపు 25 లక్షల మందితో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో భారీ బహిరంగసభ జరిగిన రోజు! ఈ బహిరంగ సభకు రావాలని.. ప్రత్యక్షంగా వీక్షించాలని.. సీఎం కేసీఆర్ ప్రసంగం చెవులారా వినాలనీ స్వచ్ఛందంగా కదిలినవారి సంఖ్య అశేషం! వేలాది వాహనాలు సమకూర్చుకుని, లక్షలాది మంది హాజరైన రోజు! శనివారం బహిరంగసభకు వెళ్లి.. ఆదివారం సభను వీక్షించి, సోమవారం తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లుచేసుకున్నారు. ఈ మూడు రోజులకు కావాల్సిన సరంజామా సిద్ధం చేసుకుని బయలుదేరారు. వంటసామగ్రితో పాటు మేకలు, గొర్రెలు, కోళ్లు, బియ్యం తదితరాలు ఏర్పాటుచేసుకుని సమ్మక్క-సారలమ్మ జాతరను తలపించారు. వాహనాలు సరిపోకపోవడంతో పక్క రాష్ర్టాల వాహనాలను అద్దెకు తీసుకుని మరీ ప్రగతి నివేదనకు హాజరయ్యారు. కేవలం తెలంగాణకు చెందిన ప్రజలేకాదు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అభిమానులు సైతం భారీగా ఈ సభకు హాజరుకావడం విశేషం. సభ విజయవంతంగా ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యారు.
- నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్


pragathi-baata4

వంట సామగ్రితో ప్రగతి సభకు!

-బియ్యం, గొర్రెలు, మేకలు, కోళ్లు..
-దారిలోనే వంటలు.. భోజనాలు

జయశంకర్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రగతి నివేదన సభ నేపథ్యంలో పల్లెల్లో పండుగ వాతావరణం దర్శనమిచ్చింది. సభను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పల్లెలు, పట్నాలనుంచి అన్నివర్గాలు ప్రజలు భారీగా తరలివెళ్లారు. స్వచ్ఛందంగా వాహనాలను సమకూర్చుకున్నారు. వంట సామగ్రితో బయలుదేరారు. శనివారమే గ్రామాలనుంచి బయలుదేరి సోమవారం తిరిగివచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. మూడురోజుల ప్రయాణం దృష్ట్యా వంటపాత్రలు, గ్యాస్ సిలిండర్లు, స్టౌలు, బియ్యం, నూనె, ఇతర సరుకులను వెంట తీసుకెళ్లారు. వీటితోపాటు గొర్రెలు, మేకలు, కోళ్లను కూడా పట్టుకెళ్లారు. అనువైనచోట స్వయంగా వంట చేసుకునేవిధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసుకున్నారు. గొర్రెలు, మేకలు, కోళ్లతో జనం వెళ్లిన తీరుచూస్తుంటే సమక్మ-సారలమ్మ జాతరను గుర్తుచేసింది. మార్గమధ్యంలో గ్రామస్థులు వంట చేసుకునే తీరును చూసి పలువురు టీఆర్‌ఎస్ నేతలు సంతోషం వ్యక్తంచేశారు. పండుగ వాతావరణం ఆవిష్కృతం కావడంతో హర్షం వ్యక్తంచేశారు. ప్రజలు సభకు స్వచ్ఛందంగా కదలడం, వంట చేసుకోవడం గురించి అడగ్గా ప్రభుత్వం మీద ఉన్న గౌరవాన్ని, సీఎం కేసీఆర్ మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని స్వయంగా వినాలనే ఇలా బయలుదేరామని సంతోషంగా తెలిపారు.

pragathi-baata5

ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా..

-కిక్కిరిసిన ఆంధ్రానుంచి వచ్చిన పలు రైళ్లు..
-ఏపీ దారులు సైతం కొంగరకలాన్ వైపే

ప్రగతి నివేదన సభకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఏపీ నుంచి వివిధ మార్గాల ద్వారా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం, కడప తదితర జిల్లాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు ప్లకార్డులు చేత పట్టుకొని హైదరాబాద్ చేరుకొన్నారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన పలు రైళ్లలో అధిక శాతం మంది కొంగరకలాన్ ప్రగతి నివేదన ప్రాంగణంవైపే తరలుతున్నట్టుగా తెలిపారు. ఆంధ్ర నుంచి తెలంగాణ మీదుగా వెళ్లే శాతవాహన, కోణార్క్, గోల్కొండ, నర్సాపూర్, మచిలీపట్నం, గోదావరి, గరీబ్ రథ్, విశాఖ, గౌతమి, నారాయణాద్రి, పద్మావతి, చార్మినార్, సింహపురి ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ కిక్కిరిసిపోయి కనిపించాయి. వీరిలో అధికశాతం మంది టీఆర్‌ఎస్ సభకు తరలివెళ్లారు. తెలంగాణ నుంచి భాగ్యనగర్, కాగజ్‌నగర్ ప్రాంతాల నుంచి ప్రత్యేక కోచ్‌లను బుక్ చేసుకుని జనం తండోపతండాలుగా వచ్చారు. పలు రైళ్ల బోగీలకు టీఆర్‌ఎస్ జెండాలు, బ్యానర్లు కట్టారు.
pragathi-baata2

pragathi-baata3

pragathi-baata6

1456
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles