పల్లెల్లో ఓటు చైతన్యం


Thu,May 16, 2019 02:53 AM

Third Phase of Local Polls record 77 46 Percentage

-ఓటు హక్కు వినియోగంలో మూడు విడుతల్లోనూ మహిళలే మేటి
-పరిషత్‌పోరులో మొత్తం 77.46% పోలింగ్
-మూడు విడుతల్లో మహిళల ఓటింగ్ 77.68%
-పోలింగ్‌లో యాదాద్రి భువనగిరి జిల్లానే టాప్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అత్యంత కీలకమైన ప్రాథమిక హక్కుల్లో ఒకటైన ఓటు హక్కును వినియోగించుకోవడంలో పల్లె ప్రాంతాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇటీవలి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతోపాటు తాజాగా ముగిసిన పరిషత్ పోరులోనూ గ్రామాల ఓటర్లు అగ్రభాగాన నిలిచారు. ఇందులోనూ పురుషులతో పోల్చితే మహిళలు ఓటింగ్‌కు పోటెత్తారు. రాష్ట్రంలో మూడు విడుతల్లో నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మొత్తంగా 77.46% ఓటింగ్ నమోదైంది. మొత్తం 1,56,02,845 మంది ఓటర్లకుగాను 1,20,86,385 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. మహిళలు, పురుషులవారీగా చూసినప్పుడు.. 61,18,745 మంది మహిళలు (77.68%), 59,67,616 మంది పురుషులు (77.24%) ఓటేశారు. ఇతరుల ఓట్లు 24 పోలయ్యాయి. అత్యధికంగా పోలింగ్‌శాతం రికార్డును మళ్లీ యాదాద్రి భువనగిరి జిల్లానే దక్కించుకున్నది. పంచాయతీతోపాటు, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లోనూ ముందంజలో నిలిచింది. పరిషత్ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లా 87.02% సగటుతో మొదటిస్థానంలో నిలువగా.. 70.40 శాతంతో వికారాబాద్ జిల్లా ఆఖరుస్థానంలో ఉన్నది. పరిషత్ ఎన్నికల్లో అనేక గ్రామాల్లో సగటున 80 నుంచి 90 శాతం మధ్య ఓట్లేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది.

స్థానిక పోరులో ముందున్న పల్లె ఓటర్లు

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ 87.30% ఓటింగ్ జరిగింది. ఇందులో మహిళలు ఎక్కువగా 87.97%, పురుషులు 86.62%, ఇతరులు 8.57% ఓట్లేశారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 94.60%, అత్యల్పంగా వికారాబాద్ జిల్లాలో 77.04% ఓటింగ్ జరిగింది.

టీఆర్‌ఎస్ ఖాతాలో ఏకగ్రీవాలు

ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లో ఏకగ్రీవమైన స్థానాల్లో అత్యధికంగా టీఆర్‌ఎస్ ఖాతాలో వేసుకున్నది. ఏకగ్రీవమైన నాలుగు జెడ్పీటీసీలను టీఆర్‌ఎస్ అభ్యర్థులే దక్కించుకోగా.. 158 ఎంపీటీసీ స్థానాల్లో 152 గులాబీ నేతలే ఎన్నికయ్యారు. మిగిలిన ఏకగ్రీవాల్లో మూడుస్థానాలను స్వతంత్రులు దక్కించుకున్నారు. జిల్లాలవారీగా పరిశీలిస్తే కామారెడ్డిలో 19, మహబూబాబాద్‌లో 15, సిద్దిపేట, నిజామాబాద్‌లో 13 చొప్పున, రంగారెడ్డిలో 9, జగిత్యాలలో 8, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ రూరల్‌లో 7 చొప్పున, జనగామ, ఖమ్మం, నల్లగొండ, వరంగల్ అర్బన్‌లో 6, నిర్మల్‌లో 5, మంచిర్యాల, సిరిసిల్ల, నారాయణపేటలో 4, భద్రాద్రి కొత్తగూడెం, జోగుళాంబ గద్వాల, సూర్యాపేట, వికారాబాద్‌లో 3, నాగర్ కర్నూల్, కరీంనగర్‌లో 2, మహబూబ్‌నగర్, వనపర్తి. సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లిలో 1 చొప్పున ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

876
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles