ట్రీ-2019 డైరీ ఆవిష్కరణలో విశ్రాంత ఇంజినీర్ల స్పష్టీకరణ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రతి ఎకరాకు సాగునీరు అందించినప్పుడే రాష్ట్రప్రభుత్వం చేపట్టిన భగీరథ యత్నానికి సార్థకత లభిస్తుందని.. ఇందుకు నీటిపారుదలశాఖ ఇంజినీర్లు కృషిచేయాలని విశ్రాంత ఇంజినీర్ సానా మారుతి అన్నారు. ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ స్టేట్సెంటర్ కార్యాలయంలో గురువారం తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల అసోసియేషన్ (ట్రీ) 2019 డైరీని ఓయూ ప్రొఫెసర్ బాబూరావు, విశ్రాంత ఈఎన్సీ కే ప్రకాశ్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ట్రీ ప్రధానకార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, ఇంజినీర్లు అండగా నిలిచి స్వప్నం సాకారమయ్యేందుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో ట్రీ అధ్యక్షుడు చంద్రమౌళి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ స్టేట్సెంటర్ చైర్మన్ రామేశ్వరరావు, పర్యావరణవేత్త వేదకుమార్, విశ్రాంత ఇంజినీర్లు రాంరెడ్డి, రమణనాయక్, దామోదర్‌రెడ్డి, తెలంగాణ ఇంజినీర్స్ జేఏసీ చైర్మన్ వెంకటేశం పాల్గొన్నారు.