- ప్రతి వాహనానికి రేడియం స్టిక్కర్
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: దిశ వంటి ఘటనలు పునరావృతంకాకుండా నగర రవాణాశాఖ తన వంతు ప్రయత్నం చేస్తున్నది. నగరంలోని అన్ని రకాల వాహనాలపై డయల్ 100 పేరుతో రేడియం స్టిక్కర్లను అతికించే కార్యక్రమానికి హైదరాబాద్ జేటీసీ పాండురంగనాయక్ శ్రీకారం చుట్టారు. ఆటోలు, వ్యాన్లు, స్కూల్ బస్సులు, లారీలు, ట్రాలీలు ఇలా ఏ వాహనానికైనా డయల్ 100 స్టిక్కర్ల ను అధికారులు దగ్గరుండి అతికిస్తున్నారు. అధికారులే సొంత ఖర్చులతో వీటిని రూపొందించి అతికిస్తుండటం విశేషం. ఆపదలో ఉన్న వ్యక్తికి వెంటనే గుర్తుకువచ్చేలా ప్రతి వాహనంపై 100 నంబర్ కనబడాలనేది తమ ఉద్దేశమని జేటీసీ తెలిపారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఆర్టీవోలు రాం చందర్, దుర్గప్రసాద్, ఏఎంవీఐలు వాసు, శృతి తదితరులు పాల్గొన్నారు.