రైతుకు మద్దతు.. సంస్థకు ఆర్థిక దన్ను

Tue,February 19, 2019 03:24 AM

- ద్విముఖ వ్యూహంతో పౌరసరఫరాల బిజినెస్ వింగ్
- వివిధరంగాల ప్రముఖులతో చైర్మన్, అధికారుల భేటీ
- ప్రముఖుల సూచనలపై లోతైన అధ్యయనానికి నిర్ణయం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించడంతోపాటు పౌరసరఫరాల సంస్థ ఆదాయాన్ని పెంచే.. ద్విముఖ వ్యూహంతో బిజినెస్ వింగ్ ఏర్పాటుకు పౌరసరఫరాల సంస్థ ముమ్మర కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా సోమవారం పౌరసరఫరాల భవన్‌లో సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వేగంగా పూర్తవుతున్న సాగునీటి ప్రాజెక్టులతోపాటు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరంటు వంటి రైతు సంక్షేమచర్యలతో రాష్ట్రంలో సాగువిస్తీర్ణం పెరిగి, ప్రజాపంపిణీ అవసరాలకు మించి ధాన్యం దిగుబడి అవుతున్నది. ఈ నేపథ్యంలో రైతులకు కనీస మద్దతు ధర అందించడంతోపాటు పౌరసరఫరాల సంస్థ ఆదాయాన్ని పెంచడానికి బిజినెస్ వింగ్‌ను ఏర్పాటు చేయనుంది. గత ఏడాది వానకాలం పంట సీజన్‌లో పౌరసరఫరాల సంస్థ 4.5 లక్షల రైతుల నుంచి 18.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ ఏడాది అదే సీజన్‌కు 3297 కొనుగోలు కేంద్రాల ద్వారా 8.09 లక్షల రైతుల నుంచి 40.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. అదనంగా ఉత్పత్తి అయిన ధాన్యాన్ని, బియ్యాన్ని ఎలా వాడుకోవాలి? ఇతర రాష్ర్టాలు, దేశాలకు ఎగుమతికి అవకాశాలేంటి? అనే అంశాలతోపాటు రైతులకు కనీస మద్దతు ధర, పౌరసరఫరాల సంస్థ ఆదాయం పెంపుపై సమావేశంలో చర్చించారు.

సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు, వివిధరంగాల నిపుణులు చేసిన సూచనలు, సలహాలపై మరింత అధ్యయనం చేయాలని సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కమిషనర్ అకున్‌సబర్వాల్ నిర్ణయించారు. ఇలాంటి సమావేశాలను మరిన్ని నిర్వహించాలన్న సూచనలు వచ్చాయి. సమావేశంలో ఎమ్మెల్యే ఎస్ నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, భానుప్రసాదరావు, జలవనరుల అభివృద్ధిసంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, మార్కెటింగ్, వ్యవసాయరంగ నిపుణులు నూకల నరేశ్‌రెడ్డి, క్రాంతి, దయాకర్, సీనియర్ జర్నలిస్టులు హరికృష్ణ, వీ సతీశ్, పీవీ శ్రీనివాస్, మార్క్‌ఫెడ్ మాజీ జనరల్ మేనేజర్ రాములు, పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారులు పాల్గొన్నారు. అనంతరం పౌరసరఫరాల భవన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించారు. రేషన్ వాహనాల కదలికలు, గోదాముల్లో సీసీ కెమెరాలు, టీ రేషన్ యాప్ పనితీరు, ఈ-పాస్, ఐరిస్ ద్వారా రేషన్ పంపిణీ పనితీరును పరిశీలించారు.

సమావేశంలో వచ్చిన సూచనలు

- గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల అహార అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా ఉత్పత్తులపై దృష్టిసారించాలి. ఏ ప్రాంతంలో ఏ రకమైన పంట పండుతుంది? ఏ రకమైన పంటలను ప్రోత్సహించాలో పరిశీలించాలి.
- సహజ పద్ధతుల్లో సాగే వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. దీన్ని ప్రజలు భారీ కోరుకుంటున్నారు.
- నిజామాబాద్ జిల్లాలో పసుపు, ఖమ్మం జిల్లాలో మిర్చి, వికారాబాద్ జిల్లాలో కందిపప్పును రైతులు అధికంగా పండిస్తారు. ఇలాంటి పంటలను సంస్థ కొనుగోలు చేసి, తెలంగాణ బ్రాండ్ పేరుతో ప్రజలకు అందించాలి.
- ప్రస్తుతం చిరుధాన్యాలకు డిమాండ్ పెరుగుతున్నది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో చిరు ధాన్యాలను ఎక్కువ పండిస్తున్నారు. ఇలాంటి పంటలను ప్రభుత్వం ప్రోత్సహించడమే కాకుండా వాటిని సేకరించి, సంస్థ ద్వారా మార్కెట్‌లో విక్రయించాలి.
- రాష్ట్రంలో ధాన్యం భారీగా దిగుబడి అవుతున్నది. నాణ్యమైన బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థ స్వయంగా ఉత్పత్తిచేసి రేషన్ షాపులు, రైతుబజార్లు వంటి ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించాలి.
- తెలంగాణ బ్రాండ్ పేరుతో పౌరసరఫరాల సంస్థ ఉత్పత్తి చేసే సరుకుల్లో ఎలాంటి కల్తీ లేకుండా చూడాలి. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాలి.
- గతంలో పౌరసరఫరాల శాఖ వివిధ సరుకులను రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకు కార్డుదారులకు అందించింది. దాన్ని ఎందుకు కొనసాగించలేకపోయామో పరిశీలించాలి.
- సరైన మార్కెటింగ్ విధానాన్ని రూపొందించుకోవాలి. బియ్యం ఉప ఉత్పత్తులపై దృష్టిసారించాలి. ముందుగా మార్కెట్‌లోఏ రకమైన వస్తువులకు, ఆహారానికి డిమాండు ఉందనే దానిని పరిశీలించాలి.
- రాష్ట్రంలో 33 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలకు సమీపంలో పెట్రోల్ బంక్‌ల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలి.
- పౌరసరఫరాల సంస్థ గోదాములు ఉన్న ప్రాంతాల్లో వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే అంశాలను కూడా పరిశీలించాలి.

2343
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles