శిథిలావస్థ నుంచి.. చైతన్యం దిశగా..మన గ్రంథాలయాల ప్రస్థానం

Thu,November 14, 2019 03:28 AM

-సొంత భవనాలు.. కొత్త పుస్తకాలతో సామాన్యులకు దగ్గరవుతున్న లైబ్రరీలు
-అందుబాటులో టెక్నాలజీ.. వేల పుస్తకాల డిజిటలైజేషన్
-నేటినుంచి గ్రంథాలయ వారోత్సవాలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణకు గ్రంథాలయాలకు మధ్య అనుబంధం విడదీయరానిది. జాతీయోద్యమానికి ప్రేరణగా గ్రంథాలయోద్యమం కొనసాగింది. శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయం, రాజరాజ నరేంద్ర భాషానిలయం వంటివి 20వ శతాబ్దం తొలినాళ్లలోనే పురుడుపోసుకొన్నాయి. తెలంగాణ ఆధునిక చరిత్రలో గ్రంథాలయాలు ఉద్యమస్థానాలైనాయి. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత గ్రంథాలయ వ్యవస్థలో సంస్కరణలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం పకడ్బందీగా చర్య లు తీసుకోవడంతో మూణ్నాలుగేండ్లుగా తెలంగాణ వ్యాప్తంగా గ్రంథాలయాలు ఆధునిక పోకడలను సంతరించుకొన్నాయి. సొంతభవనాల నిర్మాణం, డిజిటలైజేషన్ వంటి చర్యలతో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. గురువారం (14 నవంబర్) నుంచి వారం పాటు గ్రంథాలయ వారోత్సవాలు జరుగనున్న సందర్భంగా రాష్ట్రంలో గ్రంథాలయాల పరిణామవికాసాలపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.
siricill

చారిత్రక నేపథ్యం

రాష్ట్రంలో గ్రంథాలయాలది దాదాపు 135 ఏండ్ల చరిత్ర. వ్యక్తిగత గ్రంథాలయాల మాటె లా ఉన్నప్పటికీ.. 1885లో కవాడిగూడలో ఏర్పాటైన శంకరారాధ్య గ్రంథాలయం మొద టి గ్రంథాలయంగా చెప్పుకోవచ్చు. అదే ఏడా ది వరంగల్‌లోని మట్టెవాడలో శాఖా గ్రంథాలయం ప్రారంభమైంది. 1901లో సుల్తాన్‌బజార్‌లో శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిల యం, 1904లో వరంగల్‌లోని పింగళి వెంకటరమణారెడ్డి బంగళాపై రాజరాజనరేంద్ర భాషానిలయం ప్రారంభమయ్యాయి. తెలంగాణలో తొలితరం గ్రంథాలయాలివి. ఇక్కడ స్థిరపడ్డ మార్వాడీలు, కన్నడిగులు రాష్ట్రంలోని పలుచోట్ల గ్రంథాలయాల స్థాపనకు ఇతోధికంగా సహకరించారు. ఇలా ప్రారంభమైన శాలిబండ గ్రంథాలయం ఇవాల్టికీ కొనసాగుతున్నది. 1930లో నిజాం రాజు అఫ్జల్‌గంజ్‌లో ఏర్పాటుచేసిన గ్రంథాలయం రాష్ట్రంలోనే అతి పెద్దది. వట్టికోట ఆళ్వార్‌స్వామి, భాగ్యరెడ్డివర్మ లాంటి వారి చొరవతో చాదర్‌ఘాట్‌లో ఆది హిందూభవన్, కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయంతోపాటు, సురవరం ప్రతాపరెడ్డి సారథ్యంలో రెడ్డి హాస్టల్‌లో ఏర్పాటుచేసిన గ్రంథాలయాలు సామాజిక సంస్కరణల కేంద్రాలుగా విలసిల్లాయి. రాజకీయోద్యమాలకు కేంద్రస్థానాలుగా నిలిచాయి. సూర్యాపేటలోని గ్రంథాలయం.. ఆనాటి రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకంచేయడంలో ప్రధానభూమిక నిర్వహించింది. ఉమ్మడి ఏపీలో గ్రంథాలయ వ్యవస్థ నిర్వీర్య మయింది. రాష్ట్రం ఆవిర్భావం నాటికి తెలంగాణలో 571 గ్రంథాలయాలుండగా 96 అద్దె భవనాల్లో కొనసాగాయి. పదుల సంఖ్యలో ఎలాంటి అద్దె లేకుండానే ఇండ్ల యజమానుల దయతో కొనసాగుతున్నాయి.

సీఎం మార్గదర్శకత్వంలో సంస్కరణలు

పాఠకుల అవసరాలకు అనుగుణంగా గ్రంథాలయాలని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 2017లో డాక్టర్ అయాచితం శ్రీధర్‌ను గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమించి మార్గదర్శనంచేశారు. సీఏం సూచనలు, సహకారంతో మూ డేండ్లలోనే పలు గ్రంథాలయాలను తీర్చిదిద్దారు. గ్రంథాలయాలకు సొంత భవనాలు సమకూర్చడమేకాకుండా.. వాటిలో పుస్తకాల కొనుగోలుకు కూడా కార్యాచరణ అమలుచేస్తున్నారు. సిరిసిల్లలో రూ.3 కోట్లతో రాష్ర్టానికే తలమానికంగా గ్రంథాలయాన్ని నిర్మించారు. సికింద్రాబాద్‌లో రూ.3 కోట్లతో గ్రంథాలయం నిర్మాణమయింది. మహబూబ్‌నగర్‌లోనూ గ్రంథాలయానికి సొంతభవనం సమకూరింది. మేడ్చల్, సిద్దిపేట, మహబూబాబాద్, మంచిర్యాలల్లో నిర్మాణాలు కొనసాగుతున్నా యి. పుస్తకాల కొనుగోలుకు రూ.1.5కోట్లు ఖర్చుచేశారు.ఈ డిసెంబరులో మరో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.

డిజిటలైజేషన్

డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్‌తో చేసుకొన్న ఒప్పందంలో భాగంగా గ్రంథాలయాలను డిజిటల్ లైబ్రరీలుగా మారుస్తున్నారు. పాత పది జిల్లాల్లోని ఒక్కో గ్రంథాలయంలో 5 కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, కొన్ని చోట్ల ట్యాబ్‌లను కూడా సమకూర్చారు. లైబ్రేరియన్లకు టెక్నాలజీ ఉపయోగంపై వర్క్‌షాప్ లు నిర్వహించి శిక్షణ కూడా ఇచ్చారు. ఖమ్మం లాంటి ప్రాంతాల్లో యువతను పోటీపరీక్షలకు సిద్ధంచేసే శిక్షణ కేంద్రాలుగా గ్రంథాలయాలు రూపాంతరం చెందుతున్నాయి. లెక్చరర్లకు గౌరవవేతనం ఇచ్చి విద్యార్థులకు ఆయా విషయాల్లో తర్ఫీదునిస్తున్నారు. సామాన్యులు కూడా గ్రంథాలయాల్లోని ఆయా సబ్జెక్టు పుస్తకాలను చదివి పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలుస్తున్నారని డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్ రీజనల్ మేనేజర్ మణికంఠ సంతోషంతో చెప్పుకొచ్చారు. అఫ్జల్‌గంజ్ స్టేట్ లైబ్రరీలోని 46వేల పుస్తకాలను డిజిటలైజేషన్ చేశారు. సంస్కృతం, అరబిక్, పార్శీ, ఉర్దూ, తెలుగు, కన్నడ భాషల్లోని దాదాపు 200 నుంచి 250 ఏండ్ల నాటి అమూల్యమైన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. రాష్ట్రంలోని గ్రంథాలయాలన్నింటినీ కంప్యూటరీకరించడం ద్వారా ఎక్కడి నుంచైనా ఇక్కడి పుస్తకాలను చదివే వెసులుబాటును కల్పించాలనే ఆలోచన ఉన్నా.. ఇందుకు కొంత సమయం పట్టవచ్చు. కామారెడ్డి, ఖమ్మం లైబ్రరీల్లో దాతల సహకారంతో శిక్షణతోపాటు ఉచితంగా మధ్యాహ్న భోజనం పెట్టడం అభినందనలు అందుకుంటున్నది.
Sridhar

రానున్న 50 ఏండ్ల అవసరాలు తీరేలా తీర్చిదిద్దుతాం..

-డాక్టర్ అయాచితం శ్రీధర్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, మార్గదర్శకాలు, అందించిన సహకారంతో సొంత భవనాలు, మౌలిక వసతుల కల్పన, మారుతున్న కాలానికి, అవసరాలకు అనుగుణంగా ఆధునిక హంగులు కల్పించడం, డిజిటలైజేషన్ లాంటి చర్యలను చేపట్టాం. పలుచోట్ల నిర్మించిన, నిర్మిస్తున్న గ్రంథాలయ భవనాలు, అక్కడ ఏర్పాటుచేసిన మౌలిక వసతులు, ప్రభుత్వం, దాతల సహకారంతో అక్కడ అందిస్తున్న సేవలు సంతృప్తి కలిగిస్తున్నాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు, దాతలు ముందుకు వస్తే.. శిథిలమైన గ్రంథాలయాలను వైభవోపేతంగా తీర్చిదిద్దవచ్చు. వచ్చే 50 ఏండ్లపాటు ప్రజల అవసరాలను తీర్చేలా గ్రంథాలయాలను తీర్చిదిద్దుతున్నాం.

వారోత్సవాలు..

గ్రంథాలయ వారోత్సవాలను గురు వారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సరూర్‌నగర్ గ్రంథాలయంలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయాల్లో వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. 2020 జనవరిలో హైస్కూల్ స్థాయిలో విద్యార్థులకు సాంస్కృతిక, భాషాకార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. జిల్లాగ్రంథాలయాల్లో భాగ్యరెడ్డివర్మ జయంతి (మే 20,2020) నుంచి సురవరం ప్రతాపరెడ్డి జయంతి (మే 28, 2020) వరకు సమావేశాలు నిర్వహించనున్నారు.

355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles