ముందు 57 ఊళ్లకు నీళ్లు!Fri,February 23, 2018 01:56 AM

అర్బన్ భగీరథ పథకం అమలులో కీలక నిర్ణయం
ట్యాంకర్లు, బోర్లపై ఆధారపడిన గ్రామాలకు తొలి ప్రాధాన్యం
మే నెలలో సరఫరాచేయాలి: జలమండలి ఎండీ దానకిశోర్

water
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఔటర్ రింగు రోడ్డుకు లోపలున్న గ్రామాలకు తాగునీరు అందించే పట్టణ మిషన్ భగీరథ పథకం అమలులో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓఆర్‌ఆర్ లోపలి 190 గ్రామాల్లో భగీరథ పనులు పరుగులు పెడుతున్నాయి. ఆగస్టునాటికి ఇంటింటికీ నల్లాల ద్వారా సమృద్ధిగా తాగునీరు అందించేందుకు రూ.628 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి ఈ పనులకు శ్రీకారం చుట్టింది. 12 మండలాల పరిధిలోని 190 గ్రామాలకు చెందిన 30లక్షల మందికి తాగునీరు అందించేలా యాన్యుటీ విధానంలో చేపడుతున్నారు. ఈ పథకం పురోగతిపై గురువారం జలమండలి కార్యాలయంలో సమీక్షించిన ఎండీ దానకిశోర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ట్యాంకర్లు, బోర్లు, చేతిపంపులపైనే ఆధారపడుతున్న 57 గ్రామాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. 190 గ్రామాల స్థితిగతులను అధ్యయనం చేసిన తర్వాత 57 గ్రామాలను ఎంపిక చేశామని, భగీరథ ఫలాలు ముందుగా వాటికే అందించాలని ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు.
water1

ప్రత్యేక బృందాలతో..


ఎంపిక చేసిన 57 గ్రామాలకు మే నెలాఖరు నాటికి మిషన్ భగీరథ నీళ్లు అందించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి. ఇప్పటికే ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం, పైపులైన్ విస్తరణ పనులకు సంబంధించిన మెటీరియల్‌ను కాంట్రాక్ట్ సంస్థ దిగుమతి చేసింది. నిర్వహణ సంస్థలు, ప్రాజెక్టు విభాగం అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలని ఎండీ దానకిశోర్ ఆదేశించారు. ఔటర్‌కు లోపలున్న గ్రామాలకు నీటి సరఫరా బాధ్యతలను ప్రభుత్వం ఏడాది కిందట గ్రామీణ నీటి సరఫరా విభాగం నుంచి బదలాయించి జలమండలికి అప్పగించింది. ఈ మేరకు ఔటర్ లోపలి 12 మండలాల పరిధిలోని 190 గ్రామాలకు మంచినీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 174 ఓవర్‌హెడ్ ట్యాంకులను నిర్మించి నిత్యం 44,700 కిలోలీటర్ల నీటిని నిల్వ చేయనున్నారు. ఈ ట్యాంకుల నుంచి 1,733 కి.మీ మేర పైపులైన్లు ఏర్పాటుచేసి నీటిని సరఫరా చేయనున్నారు.

2329

More News

VIRAL NEWS