రాష్ట్రంలో ఈ-నామ్ అమలు అద్భుతం


Sat,September 14, 2019 02:03 AM

The implementation of E-Nam in the state is amazing

- కేంద్ర మార్కెటింగ్‌శాఖ సంయుక్త కార్యదర్శి పీకే స్వైన్ కితాబు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఈ-నామ్ అమలులో తెలంగాణ రాష్ట్రం సాధించిన పురోగతి అద్భుతమని కేంద్ర మార్కెటింగ్‌శాఖ సంయుక్త కార్యదర్శి పీకే స్వైన్ అభినందించారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్‌లో శుక్రవారం రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని తెలంగాణలో ఈ-నామ్ అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా స్వైన్ మాట్లాడుతూ.. రైతులకు కొత్త మార్కెట్లను అందుబాటులోకి తెస్తున్న తెలంగాణ మార్కెటింగ్‌శాఖను అభినందించారు. మహారాష్ట్రలోని పసుపు వ్యాపారస్థులు తెలంగాణ మార్కెట్లలో కొనుగోళ్లు జరిపేలా చట్టాన్ని సరళీకృతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు విధివిధానాలను రూపొందించాలని, రైతులకు వడ్డీలేని రుణాలను అందించే గోదాముల్లో కూడా ఈ-నామ్‌ను అమలుచేసి, ఆ సరుకులను పోటీధరలకు అమ్ముకొనేలా రైతులకు వీలుకల్పించాలని మార్కెటింగ్ సంచాలకులను ఆదేశించారు.

ఈ-నామ్ అమలులో తెలంగాణ రాష్ట్ర పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లి దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతామని పార్థసారథి పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 189 మార్కెట్ కమిటీలకుగాను 47 కమిటీల్లో ఈ-నామ్ అమలవుతున్నదని, ఇప్పటివరకు రూ.8,584 కోట్ల విలువైన 27.51 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఈ-నామ్ ద్వారా విక్రయించామని మార్కెటింగ్ డైరెక్టర్ జీ లక్ష్మీబాయి తెలిపారు. త్వరలో మరో 11 మార్కెట్లను ఈ-నామ్‌కు అనుసంధానించనున్నట్టు చెప్పారు. సమావేశంలో మార్కెటింగ్‌శాఖ అదనపు సంచాలకులు ఆర్ లక్ష్మణుడు, పీ రవికుమార్ కూడా పాల్గొన్నారు.

350
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles