జూలై చివర్లోగా పూర్తిస్థాయి బడ్జెట్


Wed,June 12, 2019 01:42 AM

The full scale budget in late July

-తాత్కాలిక బడ్జెట్‌కు స్వల్ప మార్పులతో అసలు పద్దు
-హామీలు నెరవేర్చేలా రూపకల్పన
-విస్తృత కసరత్తు చేస్తున్న రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) కోసం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. జూలై నెలాఖరులోగా, వీలైతే మూడో వారంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని అధికారవర్గాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం జూలై 5న పార్లమెంట్‌లో పూర్తిస్థాయి బడ్జెట్‌లో ప్రవేశపెట్టబోయే పథకాలు, రాష్ర్టాలకు కేటాయించే పన్నుల వాటా, గ్రాంట్-ఇన్-ఎయిడ్‌లను పరిగణనలోకి తీసుకుని ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కొన్ని మార్పులు, చేర్పులతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఇదేవిధంగా మార్చి 22న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్ర శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పేరుకు ఇది తాత్కాలికమే అయినప్పటికీ పెద్దపద్దులతో పూర్తిస్థాయి వివరాలను బడ్జెట్‌లో పొందుపరిచారు. రూ.1,82,017 కోట్లతో ఆరునెలల కోసం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను శాసనసభ ఆమోదించింది. ఈ ఆరునెలల వ్యవధి సెస్టెంబర్‌తో ముగియనున్నది. దీంతో రాష్ట్ర సొంత రాబడులతోపాటు కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా, గ్రాంట్లను పరిగణనలోకి తీసుకుని పూర్తిస్థాయి బడ్జెట్‌కు రూపమిస్తున్నారు.

గత నాలుగేండ్లుగా రాష్ట్ర రాబడులు, పన్నేతర ఆదాయం బాగా పెరుగుతుండటంతో బడ్జెట్ పరిమాణం కూడా భారీగా పెరుగుతున్నది. ఏటా సొంత రాబడి కనీసం 19 శాతం చొప్పున పెరుగుతుండటంతో దాని ప్రభావం బడ్జెట్‌పై ఉంటున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.1.74 లక్షలకోట్లు దాటింది. ఈసారి రాబడి వృద్ధిరేటు 15% దాటడంతో అదేస్థాయిలో బడ్జెట్ కూడా రూ.2 లక్షలకోట్లకు పెరగొచ్చని భావించారు. కానీ దీనిని రూ.1.82 లక్షలకోట్లకు పరిమితం చేశారు. బడ్జెట్ అంచనాలు వాస్తవ ఆర్థికపరిస్థితికి అనుగుణంగా ఉండాలన్న భావనతో ప్రభుత్వం భారీ లెక్కలకు పోలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పూర్తిస్థాయి బడ్జెట్ ఉండబోతున్నది. తాత్కాలిక బడ్జెట్‌లో కూడా కేటాయింపులు జరిగినప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్‌లో స్వల్పమార్పులుంటాయని, కేంద్రం ప్రవేశపెట్టే కొత్త పథకాలు, రాష్ర్టాలకిచ్చే కేటాయింపులు, పన్నుల వాటాకు అనుగుణంగా మరికొన్ని మార్పులు జరుగుతాయని అధికారులంటున్నారు.

637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles