అన్ని రంగాల్లో.. ముస్లింలకు వాటాMon,June 19, 2017 03:03 AM

-త్వరలో అంతర్జాతీయ ఇస్లామిక్ సెంటర్‌కు శంకుస్థాపన
-దేశంలో ఎక్కడా లేని విధంగా 204 గురుకులాల ఏర్పాటు
-100 మంది విద్యార్థులకు సివిల్స్ శిక్షణ
-12 శాతం రిజర్వేషన్ పోరాడి సాధిస్తాం
-ప్రభుత్వ ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
-మైనార్టీ విద్యకు ప్రాధాన్యం
-అనీస్ ఉల్ గుర్బాకు శంకుస్థాపన చేసిన సీఎం
-రూ. 20 కోట్లు.. 4,151 గజాల స్థలం కేటాయింపు
-సకల సౌకర్యాలతో అందుబాటులోకి రానున్న ఆశ్రమం

Chandrasekharrao
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సబ్సిడీలతో ముస్లింల అభివృద్ధి జరుగదని, ప్రతి రం గంలో జనాభా ప్రకారం వారి వాటా వారికి దక్కాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఆ దిశగా ఇప్పటికే తమ ప్రభుత్వం పలు చర్యలను ప్రారంభించిందని, వివిధ రంగాల్లో ముస్లింల ప్రాతినిధ్యం పెంచడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముస్లింలకు ఒక డిప్యూటీ సీఎం, ఐదు కార్పొరేషన్ చైర్మన్ పదవులు, నాలుగు ఎమ్మెల్సీలు, రెండు డిప్యూటీ మేయర్ పదవులు ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు. ఇక ముందు ప్రతిరంగంలో వారి వాటా పెరుగుతుందని స్పష్టం చేశారు. రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదివారం సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అంతకుముందు ముస్లిం అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించేందుకు హైదరాబాద్‌లోని నాంపల్లిలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన అనీస్ ఉల్ గుర్బా భవన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ముస్లిం మైనార్టీల విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, దీన్ని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ ఉర్దూలో ప్రసంగిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల్లో నిర్లక్ష్యం, నిరాదరణకు గురైన ముస్లింల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టామని అన్నారు.
KCR-Speach
ఆ వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లే విధంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా 204 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసి కాన్వెంట్ తరహా విద్యను అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ఇంకా అనేక మంది తెలంగాణ ఎందుకు కావాలి? ప్రత్యేక రాష్ర్టాన్ని ఎందుకు అడుగుతున్నారు? అని నన్ను ప్రశ్నించేవారని, సమైక్య పాలనలో తాము దోపిడీకి గురవుతుమని, తెలంగాణ ప్రాంత పరిస్థితి దారుణంగా తయారైందని వారికి చెప్పేవాడినని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాంతం వారు, ఇక్కడి పిల్లలు మంచిగా వృద్ధి సాధిస్తారని వివరించే వాడినని చెప్పారు. మన పోరాటంలో న్యాయం ఉండటంతో అల్లా కనికరించాడని, న్యాయమైన పోరాటంలో ఎప్పటికీ విజయం ఉంటుందని వివరించారు. ఉర్దూలో అస్సాలాము అలైకుమ్ అంటూ ప్రారంభించిన సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. మనకు రాష్ట్రం దొరికింది. ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను. దేశంలో ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 17.18 శాతంగా ఉన్నది. ఈ హోదాను ఇక ముందు కూడా అలాగే కొనసాగిస్తాం. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ముస్లిం వర్గం నుంచే ఉన్నారు.
Ghurba
అలాగే తెలంగాణ శాసన మండలిలో నలుగురు ముస్లిం ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇక్కడ ఆ వర్గానికి 10 శాతం వాటా కల్పించాం. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఐదు కార్పొరేషన్ల చైర్మన్లుగా ముస్లింలు ఉన్నారు. తెలంగాణలో యూనివర్సిటీలకు ముస్లింలను వైస్‌చాన్స్‌లర్లను చేస్తున్నాం. నేను ఢిల్లీలో ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించే తీర్మానాన్ని ఆమోదించి మీ వద్దకు పంపిస్తున్నాం అని చెప్పాను. అందుకు ప్రధాని తప్పకుండా పంపండి.. దానిపై సానుకూలంగా స్పందిస్తాం అని నాతో చెప్పారు. మేము ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని రిజర్వేషన్లు అడుగుతాం. లేకుంటే తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండదు. రిజర్వేషన్ల కోసం న్యాయ పోరాటం కొనసాగిస్తాం. సమైక్య రాష్ట్రంలో ముస్లింలు అందరికంటే ఎక్కువగా బేజారైపోయారు. నేను గర్వంగా, సంతోషంగా చెప్తున్నా.. దేశంలో ఎక్కడాలేని విధంగా 204 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించాం. ఇందులో మన పిల్లలు నాణ్యమైన విద్యను ఉచితంగా పొందుతారు. రిటైర్డ్ డీజీ ఏకే ఖాన్ నేడు ప్రభుత్వ సలహాదారునిగా సేవలు అందిస్తున్నారు. ఆయన అధ్యక్షతన ఈ మైనారిటీ గురుకులాల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా మంచిగా ఈ కార్యక్రమాలు జరిగి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నా. 2022 నాటికి ఈ 204 గురుకులాల ద్వారా 1,33,000 మంది విద్యార్థులు చదువు పూర్తిచేసుకోనున్నారు.
Muslims-dinner
కాన్వెంట్ స్కూళ్లలో బోధించే విధంగానే మైనారిటీ గురుకులాలలో విద్యాబోధన ఉంటుంది. ఒక్కొక్క విద్యార్థిపై ప్రభుత్వం తరఫున రూ.లక్షా 25 వేలు ఖర్చు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలతో సమానంగా స్కాలర్‌షిప్‌లు, రిజర్వేషన్లు ముస్లిం విద్యార్థులకు తెలంగాణలో ఇస్తున్నాం. మైనారిటీ వర్గాల పిల్లలు విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లేందుకు రూ.20 లక్షల స్కాలర్‌షిప్ అందజేస్తున్నాం. ఇప్పటి వరకు 595 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. 100 మంది ముస్లిం విద్యార్థులకు ఉచితంగా ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ ఇస్తున్నాం. ఇందు కోసం హైదరాబాద్‌లో మైనారిటీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశాం. నాంపల్లిలో అనీస్ ఉల్ గుర్బా ముస్లిం అనాథాశ్రమ భవనానికి ఈ రోజే శంకుస్థాపన చేశాను. సాధ్యమైనంత త్వరగా దాని నిర్మాణం పూర్తవుతుంది. దేశ రాజధానిలో ఢిల్లీలో ఇస్లామిక్ సెంటర్ ఉంది. హైదరాబాద్‌లో కూడా అంతర్జాతీయ ఇస్లామిక్ సెంటర్‌కు సాధ్యమైనంత త్వరగా శంకుస్థాపన చేస్తా. స్థలం ఎంపిక పూర్తయింది. దీంతో మన షాన్ ఇంకా పెరుగుతుంది. కొత్త ఆలోచనలతో ప్రణాళికలు రూపొందించేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. ప్రముఖులు, విద్యావేత్తలు, మేధావులు, వృద్ధుల నుంచి రాష్ట్ర ప్రగతి, అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నాం.
Muslims
మీ వద్ద కొత్త ఆలోచనలు ఉంటే డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి, వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీమ్‌కు, ఇతర చైర్మన్లకు చెప్పండి. లేదా నేరుగా నాకు లేఖను రాసి పంపించండి. మంచి రాష్ట్రంగా ఎదగడానికి, నాటి పెద్దలు కొనసాగించిన గంగా, జమునా సంస్కృతి, సంప్రదాయం కొనసాగేలా సలహాలు ఇవ్వండి. యావత్ దేశం, ప్రపంచానికి తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదాం. ముందుకు నడుద్దాం. చివరగా ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అని సీఎం తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, కే కేశవరావు, డీ శ్రీనివాస్, ముస్లిం మత ప్రముఖులు ముఫ్తీ ఖలీల్ అహ్మద్, మౌలానా ఖుబుల్ పాషా షుత్తారి, ఆగా నిస్సార్ అహ్మద్, ఎమ్మెల్సీలు ఫారుక్‌హుస్సేన్, మహ్మద్ ఫరీదుద్దీన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీమ్, సియాసత్ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ ఆమెర్ అలీఖాన్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ సలహాదారుడు ఏకేఖాన్, మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్, హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఎస్‌ఏ షుకూర్ తదితరులు పాల్గొన్నారు.

సాహెబా మసీదును సందర్శించిన సీఎం


punjagutta
సీఎం కేసీఆర్ ఆదివారం పంజాగుట్టలోని సాహెబా మసీదును సందర్శించారు. మసీదు ప్రాంగణంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద ముస్లింలకు రంజాన్ కానుకగా దుస్తులు, పండుగ సరుకులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఉందని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకుపోతున్నామని అన్నారు. ఈ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, రంజాన్ సందర్భంగా ముస్లింలు సంతోషంగా ఉండాలని, పేదలు వేడుకలను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కానుకలు అందజేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్‌శర్మ, ఏకే ఖాన్, ఎంపీ కే కేశవరావు, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మసీదు కమిటీ చైర్మన్ ఖాజా పాషా, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి పాల్గొన్నారు.
LB-Stadium

సకల సౌకర్యాల ఆశ్రమం


నాంపల్లిలోని అనీస్ ఉల్ గుర్బా శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భవన నమూనాను ఆసాంతం పరిశీలించారు. నూతన భవనాన్ని గొప్పగా రూపొందించాలని సూచించారు. ఈ ఆశ్రమంలో ఆశ్రయం పొంది ఇంజినీర్, డాక్టర్ లాంటి అత్యున్నతమైన కోర్సులు చేసే విద్యార్థులు మరింత మంచి వాతావరణంలో చదువుకోవడానికి వీలుగా భవనంలోని చివరి అంతస్తులో ఏర్పాట్లు చేయాలని, ఈ మేరకు డిజైన్ ఉండాలని భవన నమూనాను రూపొందించిన ఆర్కిటెక్చర్‌కు, అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు చేశారు. నమూనా బాగుందని అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.

4,151 గజాల స్థలం కేటాయింపు


అనీస్ ఉల్ గుర్బా 1920 నుంచి ప్రతి యేటా 60 మందికి ఆశ్రయం కల్పిస్తున్నది. దీన్ని మరింత విస్తరించాలన్న ఆలోచనతో ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి పూనుకున్నది. ఏడు అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 20కోట్లు కేటాయించింది. రోడ్డు వెడల్పులో 191 గజాల స్థలాన్ని అనీస్ ఉల్ గుర్బా కోల్పోగా.. అందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం దేవాదాయ శాఖకు చెందిన 4,151 గజాల స్థలాన్ని ఇచ్చింది. ఏడాదిలోగా నిర్మాణం పూర్తికావాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. నిర్మాణం పకడ్బందీగా చేస్తామని.. 18 నెలల నుంచి రెండేండ్ల వరకు సమయం ఇవ్వాలని నిర్మాణ సంస్థలు కోరినట్లు సమాచారం.

అనీస్ ఉల్ గుర్బా ప్రత్యేకతలు..


anee-ul-gulbha
-అనీస్ ఉల్ గుర్బా నిర్వహణ కోసం ఎవరి దయాదాక్షిణ్యాలతో ఆధారపడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం డిజైన్ రూపొందించింది.
-హైదరాబాద్ పాత నగర సంస్కృతి ప్రతిబింబించేలా డిజైన్ చేశామని ఆర్కిటెక్ట్ నవీన్ తెలిపారు.
-నూతన భవనంలో 318 మంది బాలికలు, 168 మందికి పైగా బాలురు వేర్వేరుగా ఆశ్రయం పొందేందుకు వీలుంటుంది.
-ఈ భవనం 1,53,340 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాలో ఉంటుంది.
-రెండతస్తులలో 28,667 చదరపు అడుగుల సెల్లార్ నిర్మాణం చేపడుతున్నారు. మొత్తంగా 164 కార్లు, ద్విచక్రవాహనాలు పార్క్ చేసుకోవవచ్చు.
-గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు మొత్తం పాషింగ్ కాంప్లెక్స్ కోసం నిర్మిస్తున్నారు. ఒక్కో షాప్ 800 ఎస్‌ఎఫ్‌టీ ఉండే విధంగా జీ+1 అంతస్తుతో నిర్మిస్తారు. మొత్తం షాప్‌లకు 1300 చదరపు గజాలు కేటాయించారు. ఇందులో దాదాపు 13 షాపులకు పైగా వస్తాయి. ఈ షాపుల ద్వారా వచ్చే ఆదాయంతో అనీస్ ఉల్ గుర్బా నడిచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈషాప్‌ల చుట్టూ వాకింగ్ బెల్ట్ ఉంటుంది. షాప్‌ల్లోకి వచ్చేవాళ్లు కానీ, ఈ షాప్‌వాళ్లు కానీ కాంప్లెక్స్‌లోకి రావడానికి ఏ మాత్రం అవకాశం ఉండదు.

-గ్రౌండ్‌ఫ్లోర్ లోపలిభాగంలో 300 మంది కూర్చునే విధంగా ఆడిటోరియం ఉంటుంది. రెండో అంతస్తులో బాల బాలికలకు విడివిడిగా ప్రార్థనాలయాలు ఉంటాయి. ఆడుకోవడానికి వేర్వేరుగా ప్లే గ్రౌండ్లు ఉంటాయి. వేర్వేరుగా కిచెన్‌లు, డైనింగ్ హాళ్లు కూడా నిర్మించనున్నారు.
-మూడో అంతస్తులో ఏడు క్లాస్‌రూములు నిర్మించనున్నారు. మిగతాది ఓపెన్‌హాల్.
-4వ అంతస్తు నుంచి 6వ అంతస్తు వరకు వసతిగదులు ఉంటాయి. ఒక్కో గదిలో ఇద్దరు ఉండేవిధంగా డిజైన్ చేశారు.
-1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివే అనాథ విద్యార్థులు ఇందులో ఆశ్రయం పొందొచ్చు. జీవితంలో స్థిరపడే వరకు విద్యార్థులు ఇక్కడే ఉండొచ్చు.

2730

More News

VIRAL NEWS