తొలి తెలుగు కవయిత్రి కుప్పాంబిక


Fri,December 8, 2017 01:10 PM

The First Telugu Poetry is Kuppambika

telugu-mahasabalu
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఆడబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ కుప్పాంబిక తొలి తెలుగు కవయిత్రి అని, ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై తెలంగాణ సాహిత్య వైభవాన్ని, కుప్పాంబిక ప్రతిభను చాటుతామని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో ఏర్పాటుచేస్తున్న స్వాగత తోరణాల నిర్మాణ పనులను సమీక్షించిన నందిని సిధారెడ్డి.. కోర్ కమిటీ సభ్యులతో కలిసి కుప్పాంబిక పేరుతో ఓ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాహిత్య చరిత్ర పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ వెలుగులోకి తెచ్చిన కుప్పాంబిక కాకతీయుల కాలం నాటి కవయిత్రి. తెలుగులో తొలి రామాయణంగా ప్రసిద్ధికెక్కిన రంగనాథ రామాయణం రాసిన గోన బుద్ధారెడ్డికి ఆమె కుమార్తె అని సంగిశెట్టి గతంలోనే ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని బూదపూర్ (భూత్పూర్)లో క్రీ.శ. 1276లో తన భర్త చనిపోయినప్పుడు వేయించిన శాసనాన్ని బట్టి ఆమె 1230లో జన్మించినట్టు శ్రీనివాస్ నిర్ధారించారు. తండ్రి నుంచి సాహిత్య వారసత్వం పొందారని, భర్త మల్యాల గుండనాథుని ఆస్థానంలోని కవుల స్ఫూర్తితో ఆమె సాహిత్యానికి మెరుగులు దిద్దుకున్నారని సంగిశెట్టి శ్రీనివాస్ నమస్తే తెలంగాణతో అన్నారు. అయ్యలరాజు రామభద్రుడు సంకలనం చేసిన ఓ గ్రంథంలో కుప్పాంబిక పద్యాన్నొకదాన్ని పేర్కొన్నారని ఆయన వివరించారు. బాల్యం నుంచి యవ్వనదశకు చేరుకున్న తనపై మన్మథుడు కురిపించే బాణాలు పెంచే మోహాన్ని తన ప్రియసఖులతో కూడా చెప్పుకోలేకపోవడం గురించి ఆ పద్యంలో కుప్పాంబిక హృద్యంగా రాశారు. పదహారవ శతాబ్దం నాటి మొల్లకు రెండు వందల ఏండ్ల ముందు కవిత్వం రాసిన కుప్పాంబికే తొలి తెలుగు కవయిత్రిగా సంగిశెట్టి నిర్ధారించారు. అయ్యలరాజు సంకలనంలోని కుప్పాంబిక పద్యం ఇలా ఉంది.
వనజాతాంబకుడేయు సాయకములన్ వర్జింపగా రాదు, నూ
తన బాల్యాధిక యౌవనంబు మదికిన్ ధైర్యంబు రానీయద
త్యనురక్తిన్ మిముబోంట్లకున్ దెలుప నాహా! సిగ్గుమైకోదు పా
వన వంశంబు స్వతంత్రమీయదు చెలీ! వాంఛల్ తుదల్ముట్టునే

3657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles