గర్భాశయ క్యాన్సర్‌పై సమరం

Thu,November 14, 2019 04:24 AM

-హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను సూచించిన ప్రపంచ ఆరోగ్యసంస్థ
-ప్రపంచ దేశాలను అప్రమత్తంచేస్తున్న డబ్ల్యూహెచ్‌వో
-క్యాన్సర్‌పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
-రాష్ట్రంలో మహిళలకు ముందస్తుగా నిర్ధారణ పరీక్షలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో).. గర్భాశయ క్యాన్సర్‌పై సమరానికి సిద్ధమైంది. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్‌ పాపిలోమ వైరస్‌ (హెచ్‌పీవీ) బారినపడకుండా ప్రపంచదేశాలను అప్రమత్తం చేస్తున్నది. గర్భాశయ క్యాన్సర్‌, ఇతర హెచ్‌పీవీ సంబంధిత వ్యాధులను ప్రపంచ ప్రజారోగ్య సమస్యలుగా గుర్తించిన డబ్ల్యూహెచ్‌వో.. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను నివారించవచ్చునని పేర్కొన్నది. వ్యాక్సినేషన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని, ముందస్తు జాగ్రత్తలో భాగంగా 9 నుంచి 15 ఏండ్ల వయసుగల అమ్మాయిలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఇవ్వాలని సూచించింది. జాతీయ రోగనిరోధక కార్యక్రమాల్లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను చేర్చాలని ప్రతిపాదించింది. దేశవ్యాప్తంగా క్యాన్సర్‌ వ్యాధి బారినపడుతున్న మహిళల్లో 1/4 వంతు మందికి గర్భాశయ క్యాన్సర్‌ ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.

గర్భాశయ క్యాన్సర్‌కు హెచ్‌పీవీ ప్రధాన కారణం

గర్భాశయ క్యాన్సర్‌కు హెచ్‌పీవీ ప్రధాన కారణం. హెచ్‌పీవీ.. జననేంద్రియాల ద్వారా సంక్రమించడం వల్ల 99 శాతం గర్భాశయ క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నట్టు వైద్య నిపుణులు చెప్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రాంతీయ క్యాన్సర్‌ దవాఖానకు వచ్చే మహిళల నుంచి సేకరించిన గర్భాశయ క్యాన్సర్‌ నమూనాల్లో (ఎన్‌-41) హెచ్‌పీవీ జన్యురూపం ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్‌ శివారు మేడ్చల్‌ మండలంలోని గ్రామాల్లో నిర్వహించిన గర్భాశయ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షల్లో భాగంగా మహిళల నుంచి సేకరించిన గర్భాశయ క్యాన్సర్‌ నమూనాల్లో (ఎన్‌-185) హెచ్‌పీవీ జన్యురూపం ఉన్నట్టు తేల్చారు.

రాష్ట్రంలో క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు

క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడంవల్ల కొందరి ప్రాణాలనైనా కాపాడుకోగలమన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం.. గ్రామీణప్రాంతాల్లో క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నది. మహిళల్లో సాధారణంగా వచ్చే బ్రెస్ట్‌, గర్భాశయ క్యాన్సర్‌ను ముందే గుర్తించి.. వారిని ఆరోగ్యవంతులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర వైద్యశాఖ కృషిచేస్తున్నది. వ్యాధి ముదిరిన తర్వాత కాకుండా ప్రాథమికదశలో గుర్తించగలిగితే ప్రాణాలను కాపాడుకోగలుగుతామని వైద్యులు చెప్తున్నారు. ఇందుకు 30 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలు తరచూ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

బ్రెస్ట్‌, గర్భాశయ క్యాన్సర్‌ కేసులే ఎక్కువ

మహిళల్లో బ్రెస్ట్‌, గర్భాశయ క్యాన్సర్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మా దవాఖానకు వచ్చే 10 వేల మంది క్యాన్సర్‌ వ్యాధిగ్రస్థ మహిళల్లో.. 6 వేల మందివరకు బ్రెస్ట్‌, గర్భాశయ క్యాన్సర్‌ వచ్చినవారే ఉన్నారు. ఏ క్యాన్సర్‌కు లేనివిధంగా.. గర్భాశయ క్యాన్సర్‌ రాకుండా ముందస్తుగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ చేసేందుకు అవకాశం ఉన్నది. దీన్ని ఆడపిల్లలు వరంగా భావించాలి. 9 నుంచి 15 ఏండ్ల బాలికలకు స్వచ్ఛందంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ చేయించడం ఎంతో అవసరం. వీలైతే 18 ఏండ్లలోపు ఆడపిల్లలు కూడా ఈ వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు.
- జయలత, ఎంఎన్‌జే క్యాన్సర్‌ దవాఖాన డైరెక్టర్‌

1103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles