దేవుడి మాన్యంపై నిఘా!


Thu,May 16, 2019 02:32 AM

The Divine Authorities have started a special drive to protect the lands of God

-భద్రాద్రి నుంచి స్పెషల్ డ్రైవ్
-జిల్లాలో ఆలయ భూములపై ఆరా తీస్తున్న దేవాదాయశాఖ

భద్రాచలం, నమస్తే తెలంగాణ: దేవుడి మాన్యం భూములను కాపాడేందుకు దేవాదాయశాఖ అడుగులు వేస్తున్నది. రామాలయ భూఆక్రమణదారుల భరతం పట్టేందుకు రంగం సిద్ధమవుతున్నది. ఆక్రమణదారులను గుర్తించి వారి కబ్జాలోని భూముల్ని తిరిగి దేవస్థానానికి అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేవస్థానం భూములను గుర్తించి వాటికి సైన్‌బోర్డులు పెట్టడం, ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు మొదలయ్యాయి. దేవుడి మాన్యం భూముల్ని సంరక్షించేందుకు దేవాదాయశాఖ అధికారులు బుధవారం భద్రాచలం నుంచి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. త్వరలోనే పూర్తి నివేదిక దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు అందనున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 1,984 ఎకరాల 7 గుంటల దేవుడి మాన్యం ఆక్రమణలో ఉన్నట్టు తెలిసింది. ఖమ్మం జిల్లాలో దేవాదాయశాఖకు చెందిన 187 ఆలయాల పరిధిలో 2,093 ఎకరాల 23 గుంటల వ్యవసాయ యోగ్యత మాన్యం, 2,626 ఎకరాల 15 గుంటల వ్యవసాయేతర భూమి.. మొత్తంగా వివిధ ఆలయాల దేవుడి మాన్యం 4,719 ఎకరాలు 38 గుంటలుగా ఉన్నది. ఇందులో 1,324 ఎకరాల 27 గుంటల భూమి అర్చకుల ఆధ్వర్యంలో ఉండగా.. 2,269 ఎకరాల 3 గుంటలు వ్యవసాయ లీజ్‌లో ఉన్నాయి. లీజ్‌లో ఉన్న వ్యవసాయ భూమి ద్వారా దేవాదాయశాఖకు రూ.1.34 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. కాగా, ఖమ్మం జిల్లాలో 833 ఎకరాల 2 గుంటల దేవుడి మాన్యం ఆక్రమణలో ఉన్నట్టు గుర్తించారు.

అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దేవాదాయశాఖకు చెందిన 32 ఆలయాలు ఉండగా, 407 ఎకరాల 16 గుంటల వ్యవసాయ భూమి, 9,228 ఎకరాల 26 గుంటల వ్యవసాయేతర భూమి.. మొత్తంగా 9,636 ఎకరాల 2 గుంటల భూమి ఉన్నది. 234 ఎకరాల 31 గుంటలు అర్చకుల ఆధ్వర్యంలో ఉండగా.. 7,406 ఎకరాల 3 గుంటలు వ్యవసాయ లీజ్‌లో ఉండగా, రూ.54 లక్షలు లీజ్ రూపంలో ఆదాయం సమకూరుతున్నది. కాగా, 1,151 ఎకరాల 5 గుంటల భూమి ఆక్రమణలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆలయ భూములు ఎవరి ఆక్రమణలో ఉన్నాయనే వివరాలను ఫొటోలతోపాటు సమాచారాన్ని ఆలయ సిబ్బంది సేకరించారు. దశలవారీగా పూర్తి వివరాలు సేకరించనున్నారు. భద్రాద్రి రామాలయంకు చెందిన భూములు భద్రాచలం పరిసర ప్రాంతాలతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఉన్నాయి. రామాలయం భూములతోపాటు ఉభయ జిల్లాలోని ఇతర దేవస్థానం భూముల వివరాలను యుద్ధప్రాతిపధికన సేకరించేందుకు దేవాదాయశాఖ సన్నద్ధమవుతున్నది. దేవస్థానం భూములను సంరక్షించేందుకు వాటికి ఫెన్సింగ్‌లు ఏర్పాటుచేయడం, సైన్‌బోర్డులు పెట్టడం వంటి చర్యలు తీసుకొనేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. దేవాదాయశాఖ సూచనలు పాటించని ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

93
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles