తెలంగాణలో పరిఢవిల్లిన పాట

Sat,November 9, 2019 01:44 AM

-మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
-రాష్ట్ర సాధన ఉద్యమానికి మూలాధారం
-దరువు సంప్రదాయమయం ఈ నేల
-తెలంగాణ ప్రజల్లో పెనవేసుకుపోయిన పాట
-తెలంగాణ పాట- సమగ్ర సమాలోచన
-జాతీయసదస్సు ముగింపులో పలువురు ప్రముఖులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పరిణామక్రమంలో తెలంగాణ ప్రాంతంలో ఒక్క పాట మాత్రమే పరిఢవిల్లిందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ నూరు వసంతాల సందర్భంగా నిజాం కళాశాల, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అసోసియేషన్, తెలంగాణ సంయుక్త నిర్వహణలో తెలంగాణ పాట- సమగ్ర సమాలోచన రెండురోజుల జాతీయసదస్సు ముగింపు సమావేశం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నిజాం కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ పాటే అగ్రస్థానంలో నిలిచిందని, ఉద్యమాల్లో ప్రజలను చైతన్యపరిచి ఒక ఉధృతస్థాయికి తెచ్చిందని చెప్పారు. సుద్దాల హనుమంతు, అల్లం వీరయ్య, గద్దర్, గోరటి వెంకన్న తెలంగాణ పాటను మరింత పరిపుష్టం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమానికి మూలాధారం పాట అని తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ అన్నారు. రజాకార్ల సమయంలో పాట అప్పుడప్పుడే వస్తున్నదని, తెలంగాణ ఉద్యమానికి జీవం పోసిన పాటకు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మరింత ప్రాభవం వచ్చిందని చెప్పారు. ప్రముఖ సాహితీవేత్త, కవి గోరటి వెంకన్న మాట్లాడుతూ.. జీవిత సౌందర్యం, జీవితంపై ఆశ చిగురించాలన్న తపన, మనోవికాసం అన్నీ పాటతోనే ముడిపడి ఉన్నాయన్నారు. పాట తెలంగాణ ప్రజల బతుకుల్లో పెనవేసుకుపోయిందని, శ్రమజీవుల గొంతులోంచి పుట్టి, వారి బతుకుల్లోనే ఎదిగిందని సదస్సు సంచాలకులు డాక్టర్ కసప నరేందర్ అన్నారు. కార్యక్రమంలో నిజాం కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్, ఉప ప్రధానాచార్యులు డాక్టర్ అవినాశ్ జైస్వాల్, డాక్టర్ పీ వారిజరాణి, డాక్టర్ ఎస్ రఘు, ఆచార్య పీ కనకయ్య, డాక్టర్ పీ నాగేందర్ పాల్గొన్నారు.

221
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles