వృద్ధ దంపతుల దారుణ హత్య


Mon,June 17, 2019 02:08 AM

The brutal murder of an elderly couple

-డబ్బుకోసం స్నేహితుడితో కలిసి కారు డ్రైవర్ ఘాతుకం
-బంగారు నగలు, 30 వేల నగదుతో పరార్
-కర్ణాటక సరిహద్దులో ఘటన.. డ్రైవర్ అరెస్టు
-నాలుగురోజుల్లో కేసును ఛేదించిన వికారాబాద్, కర్ణాటక పోలీసులు

వికారాబాద్ రూరల్: డబ్బుల కోసం కారు డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. ఉద్యోగమిచ్చిన వృద్ధ దంపతులనే దారుణంగా హతమార్చాడు. స్నేహితుడితో కలిసి రన్నింగ్‌లో కారులోనే మెడకు తువ్వాల బిగించి చంపేశాడు. వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి అడవుల్లో నాలుగు రోజుల క్రితం జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును వికారాబాద్, కర్ణాటక పోలీసులు సమన్వయంతో ఛేదించారు. ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం నందిగామకు చెందిన స్నేహలతారెడ్డి (75), నవరత్నారెడ్డి (77) హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌లో నివాసం ఉంటున్నారు. నవరత్నారెడ్డి హైదరాబాద్-కర్ణాటకలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. వీరివద్ద నెల రోజుల క్రితం తాత్కాలికంగా కారు డ్రైవర్‌గా హుస్నాబాద్ మండలానికి చెందిన సతీశ్ చేరాడు. ఈ నెల 12న దంపతులిద్దరూ హైదరాబాద్ నుంచి కర్ణాటక సరిహద్దులో ఆ రాష్ర్టానికి చెందిన రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ వెంచర్ చూసేందుకు తమ సొంతకారులో డ్రైవర్ సతీశ్‌తో బయలుదేరారు.

నాటినుంచి దంపతులిద్దరూ కనిపించకుండా పోయారు. దీనిపై వారి బంధువులు అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. అదేరోజు నుంచి కారు డ్రైవర్ సతీశ్ కూడా కనిపించకపోవడంతో బంధువులకు అనుమానం వచ్చింది. స్థానిక పోలీసుల సహకారంతో కర్ణాటక పోలీసులు సతీశ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా అతడు ఘటన వివరాలు వెల్లడించాడు. తనకున్న రూ.30 వేల అప్పును తీర్చేందుకు స్నేహితుడు రాహుల్‌తో కలిసి వృద్ధ దంపతుల హత్యకు పథకం వేశాడు. 12న వెంచర్‌చూసిన అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చే క్రమంలో సతీశ్ హుస్నాబాద్ వద్ద రాహుల్‌ను కారులోకి ఎక్కించుకున్నాడు. స్నేహలతారెడ్డి గాఢనిద్రలో ఉండగా తొలుత నవరత్నారెడ్డి మెడకు తువ్వాల బిగించి హత్యచేశాడు. అనంతరం స్నేహలతారెడ్డిని కూడా అలాగే చంపేశాడు. కారు రన్నింగ్‌లో ఉండగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మృతదేహాలు గుర్తుపట్టకుండా ఉండేందుకు అనంతగిరి అడవిలో కిరోసిన్, పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. ఐదు తులాల బంగారు నగలతోపాటు, రూ.30 వేల నగదుతో పరారయ్యాడు. ఆదివారం మృతదేహాలను పరిశీలించగా నాలుగురోజుల క్రితమే హత్యకు గురైనట్టు పోలీసుల విచారణలో తేలింది. దంపతుల మృతదేహాలను, నిందితుడిని కర్ణాటక పోలీసులకు అప్పగించినట్టు వికారాబాద్ రూరల్ సీఐ వీ దాసు తెలిపారు.

3657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles