ప్రైవేటుకు దీటుగా టెస్కో షోరూమ్‌లు


Tue,October 18, 2016 12:49 AM

Tesco to be offered to private showrooms

-30 జిల్లా కేంద్రాల్లో సొంత భవనాల్లో షోరూమ్‌ల ఏర్పాటు
-నిర్మాణానికి స్థలాలు కోరుతూ త్వరలో జిల్లా కలెక్టర్లకు లేఖ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం(టెస్కో) కార్యాలయాల ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రైవేటు షాపుల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని మార్కెట్లో నిలదొక్కుకునేందుకు వీలుగా దీర్ఘకాలిక వ్యూహంతో టెస్కో కార్యాలయాలు, షోరూమ్‌లను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ప్రైవేటు షాపులకు దీటుగా టెస్కో షోరూమ్‌లను అందంగా రూపొందించనున్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో చేనేత వస్ర్తాలకు ఆదరణ బాగా లభిస్తుందని ఆశిస్తున్నారు.

టెస్కో విక్రయాలు పెంచ డం ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుచనున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో సొంత భవనంలో షోరూమ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం టెస్కోకు హైదరాబాద్ మిన హా ఇతర జిల్లాల్లో ఎక్కడా సొంత భవనాలు లేవు. అద్దె భవనాల్లోనే షోరూమ్‌లు కొనసాగుతున్నాయి. కాబట్టి వాటికి సొంత భవనాల కోసం జిల్లా కేంద్రంలోని వాణిజ్య ప్రాంతంలో 200 గజాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ 30 జిల్లాల కలెక్టర్లకు టెస్కో పర్సన్ ఇన్‌చార్జ్ శైలజా రామయ్యర్ ఈ వారంలో లేఖ రాయనున్నారు. గత నెల 26, 27 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర టెక్స్‌టైల్ కార్యదర్శి రష్మి వర్మ ఈ మేరకు హామీ ఇచ్చారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(ఎన్‌హెచ్‌డీపీ) కింద నిధులను విడుదల చేయనున్నారు.

ఒక్కో షోరూమ్ నిర్మాణానికి రూ.30 లక్షల నుంచి 40లక్షల వరకు నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులు సరిపోకుంటే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) ద్వారా రుణం తీసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. గతంలో ఎన్సీడీసీ నుంచి తీసుకున్న రుణంలో చాలామటుకు ఇప్పటికే చెల్లించినందున తిరిగి రుణాలు ఇవ్వడానికి ఆ సంస్థ సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయి. టెస్కోకు హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఆరు ఎకరాలు, కరీంనగర్ జిల్లా కేంద్రంలో 3వేల గజాల స్థలం ఉంది. ఈ రెండు చోట్ల గోడౌన్లు నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేశారు. లోయర్ ట్యాంక్ బండ్‌లో ఉన్న ప్రస్తుత గోడౌన్ స్థానంలో కొత్తది నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. వీటికి కూడా కేంద్రం నుంచి నిధులు పొందనున్నారు. చేనేత సంఘాల నుంచి కొనుగోలు చేసే వస్ర్తాలను నిలువ చేసుకోవడానికి వీటిని వినియోగించుకోనున్నారు. వీటికి డిజైన్లు తయారు చేసే బాధ్యతను భారత మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక సహాయ సంస్థ(ఐఎల్‌ఎఫ్‌ఎస్)కు అప్పగించారు.

514
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS