భాషను అవహేళన చేసినందుకే పోరాడాం


Wed,December 20, 2017 02:05 AM

Telugu Authority should be established says jagadish reddy

- భాషాసదస్సులో మంత్రి జగదీశ్‌రెడ్డి
- తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటు చేయాలి
- చర్చాగోష్ఠిలో సామల రమేశ్‌బాబు సూచన
jagadish-reddy
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ భాషను, యాసను అవహేళన చేసినందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం చేయాల్సి వచ్చిందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాల సందర్భంగా మంగళవారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆడిటోరియం బిరుదురాజు రామరాజు ప్రాంగణం.. సామల సదాశివ వేదికలో తెలంగాణాలో తెలుగు - భాషా సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచీకరణ పేరుతో మాతృభాషపై దాడి జరిగిందని అన్నారు. తెలంగాణ భాషను కాపాడుకోవడం కోసమే ఉద్యమాలు చేయాల్సి వచ్చిందని, గత పాలకులు తెలంగాణ భాషపై దురాక్రమణకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కవులను, రచయితలను, కళాకారులను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషిచేస్తున్నారని తెలిపారు. సభాధ్యక్షులు ఎస్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ తెలుగు కవులు, రచయితలను ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించి వారిని గౌరవించటం గొప్ప విషయమన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఆర్‌వీఎస్ సుందరం తెలుగు భాష ప్రాశస్త్యం గురించి వివరించారు. ప్రముఖ పండితుడు, కవి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యను మంత్రి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సుప్రసన్నాచార్య మాట్లాడుతూ తెలుగుభాషకు ఉజ్వలమైన భవిష్యత్తు రావాలంటే పరిపాలనలో విస్తృతంగా వినియోగించాలని అన్నారు. భాషా ప్రాధికార సంఘాన్ని మంత్రిత్వశాఖ కింద ఏర్పాటుచేయాలని, మాతృ భాషాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సాహితవేత్త సామల రమేష్‌బాబు అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చొరవ ప్రశంసనీయమని కొనియాడారు. తెలంగాణ తెలుగు భాష వైశిష్ట్యంపై డాక్టర్ కే ముత్యం ప్రసంగించారు. శ్రామిక గేయాలు - భాషా సౌందర్యం అనే అంశంపై గాయకుడు మాస్టార్జీ పాటలతో సోదాహరణ ప్రసంగం చేశారు. బతుకమ్మ, హోళీ, స్త్రీల పాటలు-భాష అనే అంశంపై బండారు సుజాతశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత మహిళలు పాటలలో అద్భుతమైన సాహిత్యం ఉన్నదని పేర్కొన్నారు. భాష, పత్రికలు - నిఘంటు నిర్మాణ ఆవశ్యకతపై రామోజీ ఫౌండేషన్ ప్రతినిధి జాస్తి విష్ణుచైతన్య, భాష వర్తమాన స్థితిపై సామల రమేష్‌బాబు మాట్లాడారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ నిర్దేశకత్వంలో అన్నిశాఖల మంత్రులు, అధికారులు, పోలీస్, సివిల్ సైఫ్లె శాఖలు అన్ని సమన్వయంగా పనిచేసి మహాసభలను అద్భుతంగా నిర్వహించారని కొనియాడారు.

1541
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles