రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు

Wed,October 23, 2019 02:13 AM

-బంగాళాఖాతంలో అల్పపీడనం
-ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వానలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న నైరుతీ బంగాళాఖాతం ప్రాంతంలో మంగళవారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా రానున్న మూడ్రోజులు ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణశాఖ తెలిపింది. మరో 24 గంటల్లో అది మరింత తీవ్రమై ఉత్తర వాయువ్యదిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపునకు పయనించే అవకాశమున్నదన్నారు. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దాని ప్రభావంతో కోస్తా, ఉత్తరాంధ్రతోపాటు రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. బుధ, గురువారాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాలతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిశాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచే రాయలసీమ, ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

గ్రేటర్‌కు వర్షసూచన

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధ, గురువారంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. బీహెచ్‌ఈఎల్ ఫ్యాకర్టీ వద్ద 28.5 మిల్లీ మీటర్లు, మైలార్‌దేవర పల్లిలో 23.0మి.మీ., చార్మినార్ కిలావల్ కమ్యూనిటీ హాల్ 22.5 మి.మీ., సైదాబాద్ వినయ్ నగర్ 21.3మి.మీ., బండ్లగూడ లలిత్‌బాగ్ 20.3మి.మీ., గచ్చిబౌలి రాయదుర్గంలో 16.8మి.మీ., అల్వాల్ వెంకటాపురంలో 16.3మి.మీ., సంతోష్‌నగర్‌లో 16.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా రాజేంద్రనగర్, పటాన్‌చెరు, గండిపేట, బహదూర్‌పుర, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, కుత్బుల్లాపూర్‌లో చిరుజల్లులు కురిశాయి.
Rain1

పిడుగుపాటుకు వ్యక్తి మృతి, ముగ్గురికి గాయాలు

రాయికోడ్: సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని ఖాన్‌జమాల్‌పూర్ శివారులో వ్యవసాయ కూలీ పనులు చేస్తున్న మాటూర్ గ్రామానికి చెందిన ఆశయ్య(40) పిడుగుపాటుతో మృతి చెందారు. మంగళవారం సాయంత్రం వర్షం కురువడంతో చెట్టు కిందకు వెళ్లగా.. పిడుగుపడటంతో ఆశయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

2782
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles