యూరియా సరఫరాలో సరికొత్త రికార్డు


Sat,September 14, 2019 03:00 AM

Telangana swings into action after acute urea shortage hits farmers

-రోజుకు 12 వేల టన్నుల తరలింపు
-ఈ నెల ఒకటి నుంచి మొత్తం 1,28,277 టన్నులు
-ఈ ఏడాది ఇప్పటివరకు 7.36 లక్షల టన్నుల సరఫరా
-కేంద్రం నిబంధనలవల్లే క్యూ లైన్లలో రైతులు
-వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రానికి రికార్డుస్థాయిలో రోజుకు సగటున 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా తరలిస్తున్నట్టు వ్యవసా య, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 1 నుంచి రాష్ట్రానికి 1,28,277 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్టు చెప్పారు. గుజరాత్‌లోని క్రిభ్‌కో హజీరా ప్లాంట్ నుంచి 36 గంటల్లో ఆరువేల టన్నులు రాష్ట్రానికి చేరినట్టు చెప్పా రు. గతంలో ఏపీ పోర్టుల నుంచి తెలంగాణ ప్రాంతానికి యూరియా తరలించేందుకు 48 గంటల సమయం పట్టేదని, నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో ఇప్పుడు 24 గంటల్లోగా రేక్ పాయింట్లకు యూరియా చేరుతున్నదని తెలిపారు. రోడ్డుమార్గంలో రికార్డుస్థాయిలో నాలుగురోజుల్లో 5700 టన్నులు తరలించినట్టు చెప్పారు. మరో 18,200 మెట్రిక్ టన్ను ల యూరియా వివిధపోర్టుల నుంచి లోడింగ్‌కు సిద్ధమవుతున్నదని, ఆదివారంనాటికి రాష్ట్రంలోని వివిధ రేక్ పాయింట్లకు చేరుకుంటుందని తెలిపారు.
Telangana-urea2
రాష్ట్రంలోని 31 జిల్లాల్లో సగటున 700 మెట్రిక్ టన్నుల యూరియా ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. రాష్ట్రమంతటా గతేడాది వానకాలం సీజన్‌లో 6.72 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగమైందని, ఈ ఏడాది ఇప్పటివరకు 7.36 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని తెలిపారు. యూరియా కొరతపై విపక్షాలు అసత్యప్రచారం చేస్తున్నాయని, కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఆధార్‌కార్డు, వేలిముద్ర విధానంతో క్యూలో రైతులు నిలబడాల్సి వస్తున్నదని మంత్రి తెలిపారు. రాష్ట్రమంతా ఒకేసారి వర్షాలు కురియడం, గతంకన్నా ఈ ఏడాది సాగువిస్తీర్ణం పెరగడంతో యూరియా డిమాండ్ పెరిగిందన్నారు. రాష్ట్రం లో ఎక్కడా యూరియా కొరత లేదన్నారు. విశాఖ పోర్టును సందర్శించి అక్కడ యూరియా దిగుమతి, సరఫరా పర్యవేక్షించి పోర్టు, రైల్వే అధికారులతో చర్చించామన్నారు. యూరియా సరఫరాకు సహకరిస్తున్న రైల్వే, పోర్టు, రవాణా అధికారులు, కార్మికులకు మంత్రి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

మంచిర్యాలకు 1500 టన్నుల యూరియా

మంచిర్యాల జిల్లాకు శుక్రవారం రైలు వ్యాగన్ల ద్వారా 1500 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. వీటిని జిల్లాలోని 291 పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లకు, ఆగ్రోస్, ప్రైవేటు ఎరువుల దుకాణాలకు సరఫరా చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్, కౌటాల మండలాల్లో పూర్తిస్థాయిలో యూరియా అందుబాటులో ఉన్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు యూరియా బస్తాలను అందజేస్తున్నారు.
Telangana-urea1

1147
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles