కేసీఆర్‌తో పోలికా?


Thu,April 26, 2018 03:07 AM

Telangana State Successful CM Is KCR

సవాల్‌రెడ్డి : తెలంగాణ ఉద్యమం పొడవునా అడ్డంపడ్డ కొన్ని శక్తులు, ప్రసారమాధ్యమాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తమ ధోరణిని పెద్దగా మార్చుకోలేదు. సరే.. ఎవరికి నచ్చినా నచ్చకున్నా ఉమ్మడి రాష్ట్రం విడిపోయింది. రెండు కొత్తరాష్ర్టాలు ఏర్పడ్డాయి. వాటికి ప్రభుత్వాలు వచ్చాయి. ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. ఆయా రాష్ర్టాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు ప్రాధాన్యాలు నిర్ణయించుకొని పాలన ప్రారంభించుకున్నాయి. ఈ ప్రత్యేక సందర్భంలో ప్రసారమాధ్యమాలుకానీ, దూరదృష్టి కలిగిన నాయకులుగానీ ఆయా రాష్ర్టాలకు అన్ని విధాలుగా చేదోడువాదోడుగా ఉండాలి. తగిన సలహాలిచ్చి ప్రభుత్వాలకు అండగా నిలువాలి. కానీ ఇక్కడ జరిగిందేమిటి? ప్రజలపట్ల, సమాజంపట్ల ఏ బాధ్యతా లేకుండా చిల్లర రాజకీయాలకు ప్రసారమాధ్యమాలు వేదికలయ్యాయి. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని, తెలంగాణ చతికిలబడిపోయి.. ప్రత్యేక రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నాంరా దేవుడా అనుకునే పరిస్థితి ఏర్పడుతుందని కలలుగన్న వాళ్లు ఉన్నారు.
CMKCR
కానీ ఆ భ్రమలు భగ్నం కావడానికి ఎంతోకాలం పట్టలేదు. గత నాలుగేండ్లుగా తెలంగాణ పునర్నిర్మాణ దీక్షను భంగపరిచేందుకు వేయని ఎత్తు లేదు. చేయని ప్రయత్నంలేదు. అయితే ఉద్యమ సమయంలోనే రాటుదేలిన తెలంగాణ.. వాటన్నింటినీ చిత్తుచేసి.. దేశంలోనే అత్యుత్తమ పాలన అందించే రాష్ట్రంగా దేశానికి రోల్‌మోడల్ అనదగ్గ అనేక పథకాలు చేపట్టి ప్రశంసలందుకున్నది. మరోవైపు పక్కరాష్టం చెప్పుకోవడానికి ఇదీ అనే ప్రగతికానీ, పథకంకానీ లేని భావదారిద్య్రంలో.. పాలన అధ్వాన్నం.. రాజకీయం అనాగరికం అనే స్థాయిలో కొట్టుమిట్టాడుతున్నది. రాజధాని ఎక్కడుందో తెలియదు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. వ్యవసాయం కుప్పకూలింది. వైద్యం పడకేసింది. పారిశ్రామికం పత్రికల్లో తప్ప క్షేత్రంలో అద్భుతాలు చేయడంలేదు. విశేషపాలనానుభవం ఉన్న చంద్రబాబు ఆంధ్రను అగ్రగామిగా నిలుపుతాడనుకున్న ఆ ప్రాంత ప్రజల అంచనాలు తల్లకిందులయ్యాయి. అయినా ప్రసారమాధ్యమాలు మాత్రం ఈ వాస్తవాన్ని చూడ నిరాకరిస్తున్నాయి. పైపెచ్చు అక్కడి పాలనావైఫల్యాలను కప్పిపుచ్చేందుకు వారు ఎంచుకున్న అస్త్రం చిన్నగీతను పెద్దగీతను చేయడం.. కేసీఆర్‌తో పోలికపెట్టడంద్వారా చంద్రబాబు హోదాను పెంచడం. కేసీఆర్‌కు చంద్రబాబుకు పోలిక అంటే నక్కకు నాగలోకానికి ముడిపెట్టడమే. కేసీఆర్‌తో చంద్రబాబు ఏ విషయంలోనూ సరిపోలడు. దూరదృష్టిలో, నవకల్పనలో, రాజకీయంలో, పథకరచనలో, ప్రజాఉద్యమాల నిర్మాణంలో, పాలనలో.. ఎక్కడా సాపత్యమే లేదు.

ఎవరి పాలన ఎలా ఉంది?

ప్రజలే కేంద్ర బిందువుగా, వారి సమస్యల శాశ్వత పరిష్కారమే విధానంగా ఇక్కడ పాలన జరుగుతున్నది. కేసీఆర్ నిబ్బరంగా హుందాగా పాలనారథాన్ని నడిపిస్తున్నారు. రాష్ట్రం అంచెలంచలుగా ప్రగతి సాధించి, ఇవాళ దేశంలోనే నంబర్‌వన్‌గా మారింది. సాగునీరు, ఆరోగ్యం, సంక్షేమం, మౌలిక సదుపాయాలు, పారిశ్రామికరంగాల్లో అనేక విజయాలు నమోదయ్యాయి. దేశంలో మరేరాష్ట్రంలోనూ లేనన్ని పథకాలు.. లక్షల సంఖ్యలో లబ్ధిదారులు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. వాస్తవానికి ఏ ప్రభుత్వమైనా ఎన్నికల సంవత్సరంలోనే వాగ్దానాల అమలుమీద దృష్టిపెడుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండునెలలకే వాటి అమలు ప్రారంభించింది. గత నాలుగేండ్ల తెలంగాణ పాలన ఒక విజయగాథ. దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షల మేరకు చేపట్టిన పథకాలు ఒక్కటొక్కటిగా కండ్లముందు సాకారమవుతున్న అపురూపగాథ. ప్రేతకళ సంతరించుకున్న పల్లెలు పచ్చబడ్డ గాథ. కానీ అంధ్రలో పాలన మొత్తం ఫ్ల్లాప్ షో. తెలంగాణ సంక్షోభంనుంచి బయటపడిన చరిత్ర అయితే.. ఆంధ్ర పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన చరిత్ర. ఆంధ్రకు లోటు అనే నినాదంతో బండి లాక్కొస్తున్నారు.

వాస్తవానికి విభజన తర్వాత ఇరురాష్ర్టాల ఏర్పాటుసమయంలోనే ఆంధ్రలో లోటును గుర్తించారు. కేంద్రం ఆ మేరకు లెక్కలు గట్టి, ఐదేండ్లలో సుమారు రూ.24వేల కోట్ల లోటు ఉంటుందని అంచనా వేసి, ఆ మేరకు సర్దుబాటు చేస్తూ వస్తున్నది. ఆ రకంగా ఇరు రాష్ర్టాల ఆదాయాలను దాదాపు సమానంచేసింది. అయినా ఈ విషయాన్ని కప్పిపెట్టి బాబు ఆర్థికలోటు అంటూ గాయికి ఎత్తుకుంటున్నారు. ఏ ఒక్క వాగ్దానం నిలుపుకోలేదు. ఒక రాష్ట్రంగా స్థిరపడేందుకు ఏ చర్యా తీసుకోలేదు. ఓ పాలన లేదు. ఓ పథకం లేదు. దూరదృష్టి లేదు. పాలనలో మానవీయ కోణాలు, ముందుచూపులు లేవు. ఆర్థిక లోటు అనే ఓ పాట తొలి సంవత్సరం చెప్పుకొంటే బాగుంటుంది కానీ నాలుగేండ్ల తర్వాత కూడా అదే చెప్పడం వైఫల్యం కిందికే వస్తుంది. ఈ నాలుగేండ్లలో ఆర్థికంగా బలపడేందుకు రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించేందుకు ఏంచేశారన్న ప్రశ్నకు అక్కడ బదులులేదు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలే ప్రాధాన్యాంశంగా ఉండగా ఏపీలో పాలనలో ఎక్కడా ఓ ప్రయారిటీ అంటూ లేదు.. రాజకీయ ఎత్తుగడలు, మేనేజ్‌మెంట్లు తప్ప! ఏపీ దివాళా తీసింది. ఏ రంగమూ బాగుపడింది లేదు.. ఏ వర్గమూ అభివృద్ధి చెందిందీ లేదు. రాజధాని నగర నిర్మాణం ఎక్కడికి వచ్చిందో ఎవరికీ తెలియదు. పోలవరం ఏమవుతుందో అంతకన్నా తెలియదు. పారిశ్రామికాభివృద్ధి ఓ ప్రహనసం. ఒప్పందాలు లక్షల కోట్లు దాటుతుంటే పరిశ్రమలు డజన్లలో కూడా జాడలేవు. రాజకీయం దిగజారిపోయింది.

నాలుగేండ్లు ప్రత్యేకహోదా మాటెత్తని బాబు హఠాత్తుగా దీక్షలకు దిగుతున్న పరిస్థితి. పుష్కరాల నిర్వహణ ఒక్కటిచాలు ఎవరి పాలనా సామర్థ్యం ఏమిటో చెప్పడానికి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్. ప్రజలే కేంద్రంగా ప్రజలకు కావలిసిన పథకాలు చేపట్టి వాటిని సమర్థంగా అమలుచేస్తున్నారు. ఎక్కడా తొట్రుపాటు లేదు. భంగపాటు అసలేలేదు. కచ్చితంగా ప్రణాళికాబద్ధంగా లక్ష్యంమేరకు పథకాల అమలు జరుగుతున్నది. పథకాల రచన, అమలు, సమీక్షలు అన్నింటా కేసీఆర్ ముద్ర కనిపిస్తున్నది. నాటి సమగ్ర సర్వేనుంచి నిన్నటి భూ రికార్డుల ప్రక్షాళనదాకా ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న తీరు, పాలనను ప్రజలకు చేరువకు చేసేందుకు 21 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి స్థిరపరిచిన తీరు ఇక్కడి పాలనా సామర్థ్యానికి గీటురాయిగా నిలిచాయి. మరి ఏపీలో ఏం జరుగుతున్నది? అంతా కాకిగోల. ఓ పాలన లేదు.. అమలులో స్పష్టత లేదు. ఏ పథకం చూసినా అన్నింటా అవినీతి మకిలి. పాలన పూర్తిగా పడకేసింది. ఫలానా పథకాన్ని అద్భుతంగా అమలుచేశారు అని చెప్పుకోవడానికి ఏదీ లేదు. ఫలానా పథకం దేశానికంతా ఆదర్శం అనిపించుకున్నది అంతకన్నా లేదు.. టీకొట్టు నడిపేవాడు కోటు వేసుకొని పారిశ్రామిక ఒప్పందాలు చేసుకోవడం వంటి ప్రహసనాలు తప్ప! ప్రభుత్వ వైద్యశాలల్లో చీమలు, ఎలుకలు పసికందులను తినేస్తే అడిగే దిక్కు లేదు. హాస్టళ్లలో లైంగిక వేధింపులు ఆత్మహత్యలకు దారితీస్తున్న దయనీయ సంఘటనలు అక్కడి వాస్తవాలు.

విభజన వల్ల నష్టమనే సాకుతో పలు కేంద్ర సంస్థలను వర్సిటీలను కూడా కేంద్రం ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టును జాతీయప్రాజెక్టుగా గుర్తించి నిధులు ఇస్తున్నది. దాన్ని వినియోగించుకోవడం చేతగాక ఆ ప్రాజెక్టును గందరగోళంలో పడేశారు. మరోవైపు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును తన స్వంత నిధులతో నిర్మించుకొని పూర్తి చేయబోతున్నది. ఆంధ్రలో వ్యవసాయం గాలికి వదిలేశారు. సాక్షాత్తూ వ్యవసాయశాఖ మంత్రి సొంత జిల్లాయే నకిలీ విత్తనాల తయారీకి కేంద్రమైంది. తెలంగాణ ధాన్యం ఉత్పత్తుల్లో రికార్డులు సృష్టిస్తుంటే.. ఆంధ్ర మిల్లర్లు ఆ ధాన్యం కొనుగోలుకు తెలంగాణకు వస్తున్నారు. కంది, వేరుశెనగలకు ఇక్కడ ప్రభుత్వం అందించే మద్దతు ధర కోసం ఆంధ్రనుంచి లారీలకు లారీలు రావడంతో రైతులకు కూపన్‌లు ఇచ్చే పరిస్థితి ఆంధ్ర దైన్యానికి అద్దం పడుతున్నది. తెలంగాణలో భారీ వర్షంలో చెప్పుల్లేకుండా రాజధాని వీధుల్లో తిరిగి, ప్రజల కష్టాలు తెలుసుకునే మంత్రులు, ప్రాజెక్టుల దగ్గరే నిద్రలు చేసి, పనులను పరుగులు పెట్టించే మంత్రులు, ఇరవైనాలుగ్గంటలూ రైతుల అవసరాల గురించి తపన పడే మంత్రులు, ఆగమేఘాల మీద ఊరికో డబుల్ బెడ్రూం కాలనీలు నిర్మించుకుంటూ పోతున్న మంత్రులు కనిపిస్తున్నారు. మరి ఆంధ్రలో పరిస్థితి ఏమిటి? తెరమీద ఒక్క మంత్రి అయినా కనిపిస్తున్న దాఖలాలు లేవు. పుష్కరాలు జరుగుతున్నప్పుడు సంబంధింత మంత్రి జాడ వెతుక్కునే పరిస్థితి.

గత పాలకుల కల్పనలు ఇవి..

చంద్రబాబు వ్యవసాయమే దండుగ అని చేతులు దులిపేసుకుంటే.. వైఎస్ కాలంలో సహకార వ్యవసాయం పేరిట చిన్న కమతాలన్నీ లాక్కొని వ్యాపారసంస్థలకు కట్టబెట్టే ఎత్తుగడ వేశారు. అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాల్లో అందుకోసం యత్నాలు కూడా జరిగాయి. అయితే రైతులు తిరుగబడటం, కాంగ్రెస్ అధిష్ఠానం మొట్టికాయలు వేయటంతో అది వెనక్కు పోయింది. అదీ గత పాలకుల కల్పనలు.

మాకూ ఓ కేసీఆర్ కావాలంటున్న ఆంధ్ర ప్రజలు

ఆంధ్రకు ప్రత్యేకహోదా రావాలంటే కేసీఆర్‌లాంటి నాయకుడు కావాలి! ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న అభిప్రాయమిది. హోదా రావాలంటే కేసీఆర్‌లా మడమ తిప్పకుండా పోరాడాలి అన్నవాళ్లు.. హోదాకోసం కేసీఆర్ తరహా పోరాటాలు చేస్తానని ప్రకటించిన వాళ్లూ కోకొల్లలు. ఆ ఒక్క అంశంలోనే కాదు.. తెలంగాణలో ప్రభుత్వం పథకాలు ప్రకటిస్తుంటే ఆంధ్రలో పాలాభిషేకాలు జరుగుతున్నాయి. ఇటు హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రులూ చెప్తున్నారు. 30 ఏండ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నా.. మొదటిసారి కరెంటు కోతలులేని వేసవిని చూస్తున్నా.. ఇక్కడేమో చిన్నచిన్న గదులు. కరెంటు కోతలు. మా దగ్గరేమో బాగా ఉక్కపోత. భరించలేక పోయేవాళ్లం అని తెలంగాణలోని ఆంధ్ర ఉద్యోగులూ చెప్తున్నారు. కేసీచెరువులు బాగుచేశారు.. ప్రాజెక్టులు కడుతున్నారు. 24గంటల కరెంటు ఇస్తున్నారు. లా అండ్ ఆర్డర్ బాగుంది. ఉద్యోగులకు మంచి గౌరవం, ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు.

నవ కల్పనలు..

కేసీఆర్ ఎన్నో పథకాలు, ప్రాజెక్టులు, వినూత్న ఆలోచనలుచేశారు. పాలనావ్యవస్థలో అతిపెద్ద సంస్కరణ తీసుకువచ్చారు. కొత్తగా 21 జిల్లాలు, 29 రెవెన్యూ డివిజన్లు, 120 మండలాలు, 71 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు, 4383 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటుచేయడంతోపాటు వెయ్యి తండాలను గ్రామ పంచాయితీలుగా మార్చారు. ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ క్లస్టర్ ఏర్పాటు, ప్రతి క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తరణాధికారి నియామకం, రైతుకు గిట్టుబాటు కోసం రైతు సమితుల ఏర్పాటు, రైతు సమస్యలు చర్చించుకునేందుకు రైతు వేదికల నిర్మాణం మరొకరినుంచి ఊహించలేం. ఒక సమస్య ముందుకు వస్తే దాని మూలాల్లోకి వెళ్లి శాశ్వత పరిష్కారం చేయడం కేసీఆర్ విధానం. బాబు కేవలం పరాన్నభుక్కు. ఏదీ స్వయంగా ఊహించడం, సృష్టించడం చాతగాదు. గోదావరి నీళ్లు చెంబులో తెచ్చి కృష్ణలో పోసి అదే నదుల అనుసంధానం అని చెప్పుకుతిరిగేవాడు. దేశంలోని రైతుల కష్టసుఖాలు తెలిసిన వాడు కేసీఆర్. వ్యవసాయమే దండుగ అని ప్రకటించింది చంద్రబాబు. కేసీఆర్ 24 గంటల్లో రాష్ట్రంలో సమగ్ర సర్వే గురించి ఆలోచించగలరు.
CMKCR1
రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మంచినీరు ఇవ్వాలని ఆలోచించగలరు. రైతులకు పంట పెట్టుబడి ప్రభుత్వమే అందించే పథకాన్ని రూపొందించగలరు. దానికోసం క్లిష్టమైన భూ రికార్డుల ప్రక్షాళన ఊహించగలరు. గిట్టుబాటు ధర సాధనకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేయగలరు. మరి ఇతరులు ఈ దిశగా ఆలోచించగలరా? బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు భృతి ఆలోచించగలరు. ఆఖరుకు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల పెంపునకు కేసీఆర్ కిట్ వంటి వినూత్న పథకాన్ని రూపొందించగలరు. దేశంలోకెల్లా అతిపెద్ద టెక్స్‌టైల్ పార్కును ఊహించినా.. ఆఖరుకు దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పును ఆశించినా ఆ కల్పన ఒక్క కేసీఆర్‌కే చెల్లు. చంద్రబాబు వంటి వారికి జాతీయ రాజకీయాలంటే చక్రం తిప్పే మేనేజ్‌మెంట్ వ్యవహారం. కేవలం అధికారం ప్రాబల్యం కోసం పాకులాడే వ్యవహారం. కానీ కేసీఆర్‌కు గుణాత్మక మార్పువంటి ప్రజాబాహుళ్య కోణం. దేశం దశ దిశను మా ర్చాలనే ఆరాటం. ప్రజల ఆర్తిని తీర్చాలనే సంకల్పం. వందమంది బాబులు, వేలకొద్దీ వంధిమాగదులు అందులో వెయ్యోవంతుకూడా ఆలోచించలేరు. చివరగా.. వాతలు పెట్టుకున్నంత మాత్రన నక్క పులి కాలేదు. మీడియా ఎంత ఎత్తిపట్టినా.. లాబీలు కోట్లు కుమ్మరించినా బాబు బాబే. కేసీఆర్ కేసీఆరే.. చివరకు నిలిచేది గెలిచేది తెలంగాణే. ఎత్తీఎత్తీ జబ్బలనొప్పి తప్ప మీడియా కలలు నెరవేరే చాన్సే లేదు. పరిణామాలు, విజయాలు దాన్నే ధ్రువపరుస్తున్నాయి.

ఎన్టీఆర్ - కేసీఆర్

పూర్వ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలను కదిలించి చరిత్ర సృష్టించిన నేతలు ఇద్దరే. ఒకరు ఎన్టీఆర్. రెండు కేసీఆర్. అయితే ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేసేనాటికే దశాబ్దాల సినీఅనుభవంతో సాధించిన క్రేజ్ ఉంది. వెన్నుదన్నుగా అతిపెద్ద ఆర్థిక లాబీ ఉంది. సామాజిక బలం ఉంది. మీడియా స్వయంగా మోసింది. ఇన్ని అనుకూలతల మధ్య ఎన్టీఆర్ పయనం సాగింది. కేసీఆర్ దీనికి పూర్తిగా భిన్నం. ఉద్యమం ప్రారంభించేనాటికి రాజకీయ వారసత్వం లేదు. వెన్నుదన్నుగా లాబీలు లేవు. సామాజిక బలం దాదాపు శూన్యం. పైగా మీడియా మద్దతుకు బదులు కత్తిగట్టి ఉంది. తెలుగు ఆత్మగౌరవం పేరుతో ఎన్టీఆర్ ఉద్యమం ఢిల్లీవరకే వెళ్లింది. తెలంగాణ ఆత్మగౌరవం సాంస్కృతిక పునరుజ్జీవమై లండన్‌లోని థేమ్స్‌నది అలల మీద బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయంగా చాటి చెప్పింది. ఇక పాలన విషయానికి వస్తే.. ఎన్టీఆర్ సాధించింది, దేశంమీద చెరగని ముద్ర అంటూ వేసింది ఏదీ లేదు. అందుకే రెండో ఎన్నికల్లోనే పార్టీని గెలిపించలేకపోవడమే కాదు.. తానే స్వయంగా కల్వకుర్తిలో ఓటమి చవిచూశారు. కానీ కేసీఆర్ ఎవరి అండదండ లేకుండా ప్రజలు మెచ్చిన పాలన అందించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఇపుడు దేశానికి ఆదర్శప్రాయంగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా నూటికిపైగా సీట్లు వస్తాయని సర్వేలు చెప్తున్నాయి.

కేసీఆర్-చంద్రబాబు

కేసీఆర్ ఒక స్రష్ట. బాబు కేవలం ఒక భోక్త. కేసీఆర్ స్వయంగా ఒక ఉద్యమాన్ని నిర్మించారు. ప్రజలను సమీకరించారు. పార్టీని ఏర్పాటుచేశారు. కొత్తతరం నాయకులను సృష్టించారు. స్వంతబలం మీద ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.
పాలనలో అనేక వినూత్న పథకాలకు సృష్టికర్త. తెలంగాణకు గొంతులేని కాలంలో తానే స్వయంగా మీడియా పెట్టి గొంతుకను అందించినవాడు. ఒక ఆశయంకోసం పార్టీని పెట్టి ప్రజలను మెప్పించి అధికారంలోకి వచ్చినవాడు.
చంద్రబాబు పరాన్నజీవి, పరాన్నభోక్తుడు. మీడియా సృష్టి. ప్రజలను సమీకరించిన చరిత్రలేదు. చీమలపుట్టలో దూరిన పాములాగ మరొకరి పార్టీలోకి దూరి వెన్నుపోటుతో దాన్ని ఆక్రమించుకున్నాడు. ఎవరితోనైనా ఒక పొత్తు తప్ప ఏనాడూ స్వంతబలంతో అధికారంలోకి వచ్చింది లేదు. కేసీఆర్ తొలి ప్రభుత్వంలోనే ఎన్నో నవకల్పనలు చేశారు. వినూత్న ఆలోచనలతో పథకాల రచించారు.
CMKCR2
చరిత్రలో లేని కొత్త పథకాలు అమలుచేశారు. పాలనలో అడుగడుగునా మానవీయతను రంగరించారు. బాబుకు ఒక కల్పనా శక్తి లేదు. స్వంత ఆలోచనలు లేక కేసీఆర్ పథకాలను కాపీ కొట్టినవాడు. కేసీఆర్ కేవలం నాలుగేండ్ల పాలనలో అనేక విజయాలు సాధించారు. పదేండ్లు పాలన సాగించినా బాబు సాధించిన ఘన విజయాలు, ప్రజాజీవనాన్ని మార్చిన సందర్భాలు లేవు. ఆయన పాలన వైఫల్యాల పుట్ట. రైతు ఆత్మహత్యలకు ఆద్యుడు. రాజకీయాలను డబ్బుమయం చేసిన వ్యాపారి. కేసీఆర్‌ది ఆత్మగౌరవ నినాదం. దాని సాధనకు సాగిన పయనం. బాబు కేవలం అవకాశవాది. కేసీఆర్ ప్రత్యర్థులతో కూడా ప్రశంసలందుకునే నాయకుడు. బాబు ఎవరినీ మెప్పించలేని నాయకుడు. కేసీఆర్ ప్రజాబలంతో పాలన సాగిస్తే బాబు పాలన అంతా మేనేజ్‌మెంట్ బాపతు. ఈ విషయంలో బాబు రికార్డు చాలా పేలవం. కేసీఆర్ ఒక హామీ ఇస్తే దానికి కట్టుబడతారు. ఎన్నికల్లో ఇచ్చిన 42 హామీలకు తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఆమోదముద్ర వేశారు. కేసీఆర్ ఏనాడైనా ఆచరణసాధ్యమైన వాగ్దానాలే చేశారు. 2014 ఎన్నికల్లో రాహుల్‌గాంధీ రెండు లక్షల రుణమాఫీ అంటూ కవ్వించినా తానుమాత్రం లక్ష రూపాయల రుణమాఫీకే కట్టుబడ్డారు. ఆ మేరకు అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించి మాట నిలుపుకొన్నారు. బాబు దీనికి పూర్తిగా విరుద్ధం. అధికారంకోసం నోటికొచ్చిన వాగ్దానాలు చేసి, నిలదీసిన వాళ్లను జైల్లో పెట్టిస్తానన్న చరిత్ర ఉన్నవాడు. అన్ని రకాల వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు రద్దు అన్నారు. ఇంటికో ఉద్యోగం అంటూ ఊదరగొట్టారు. మొత్తం ఆరువందలకు పైగా వాగ్దానాలు చేశారు. వేటినీ సక్రమంగా అమలుచేయలేదు. వ్యవసాయ రుణాలకు పరిమితి పెట్టారు. డ్వాక్రా రుణాలకు గుండం పెట్టారు. ఉద్యోగాల మాటను బంగాళాఖాతంలో కలిపేశారు. కేసీఆర్ సిద్ధాంతవాది అయితే బాబు రాద్ధాంతవాది. ఆంధ్రప్రాంతంలో రైతుల కష్టాలు చూసి నీరిచ్చిన ఉదారవాది కేసీఆర్ అయితే.. సచివాలయం తరలించినా ఆఫీసులు ఇవ్వకుండా కరెంటు, నల్లా బిల్లులు ఎగ్గొట్టిన లేకిబుద్ధి చంద్రబాబుది.

కేసీఆర్ ఒంటరిపోరు సాగించిన వాడు. ప్రతి విజయానికి తానే రోడ్‌మ్యాప్ వేసుకొని అగ్నిపరీక్షలు పెట్టుకుని విజయాలు సాధించాడు. కానీ బాబు మీడియా సృష్టి. కులబలం, లాబీలబలం నడిపిస్తే రాజకీయం చేసేవాడు. కేసీఆర్ ఆలోచనలు, అవగాహనాస్థాయి, ప్రజాసమస్యలమీద స్పందించే తీరు సమకాలీనంగా మరే రాజకీయ నాయకుడికీ లేవు. గొప్ప వక్త. ప్రజలను ఆకట్టుకోవడంలో సాటిలేని నాయకుడు. ఈ విషయంలో బాబు కనుచూపు మేరలో కూడా ఉండడు. భారతం ఎవరు రాశారో, భాగవతం ఎవరు రాశారో కూడా తెలియని విజ్ఞానం ఆయనది. ప్రసంగం తీరు పేలవం. అవగాహనస్థాయి లేదు. ప్రజల కష్టాలు, సుఖాల మీద మానవీయ కోణం లేదు. అవసరం కోసం ఎంతటి స్థాయికైనా వెళ్తాడు. ఏ ఎండకు ఆ గొడుగు తప్ప మరో సిద్ధాంతమే లేదు. బీజేపీతో ఆయన దాగుడుమూతలు అదే విషయాన్ని ధృవపరుస్తున్నది. జాబు రావాలంటే బాబు రావాలి అంటూ.. ఇంటికో ఉద్యోగమని హామీ ఇచ్చి, మొండిచేయి చూపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలే ప్రాధమ్యం కాగా బాబుకు ప్రాధమ్యాలు అంటూ ఏవీ ఉండవు. ఆ రోజున ఆ సమయానికి ఏది కావాలో అదే ఆయన ప్రాధమ్యం. కేసీఆర్ సాహసి. ఏపీ నుంచి ఢిల్లీకి వెళుతున్నా.. తెలంగాణలోనే వస్తా అని సాహసంతో ప్రకటించారు. అలాగే వచ్చారు. ఇంటింటికీ నీళ్లివ్వకపోతే ఓట్లే అడగనని ధైర్యంగా ప్రకటించగలిగారు. బాబు ఇలాంటి ప్రకటనలకు కలలో కూడా సాహసించడు. ఒకవేళ చేసినా అక్కడ ప్రజలూ నమ్మరు. అదీ ఆయన క్రెడిబిలిటీ!

8396
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS