రేపటి తరాలకు తెలంగాణ ఘనకీర్తి


Thu,March 29, 2018 02:37 AM

Telangana solidarity for tomorrows generations

-మన వైభవానికి అద్దంపట్టిన తెలంగాణ తేజోమూర్తులు
-ఆకాశవాణి ప్రసంగపాఠాల పుస్తక సమీక్షలో వక్తలు
sri-lakshmi
తెలుగుయూనివర్సిటీ: రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సాహిత్య, కళారంగాల్లో తెలంగాణ బిడ్డల ఘనతను ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చేపట్టిన తెలంగాణ తేజోమూర్తులు కార్యక్రమం అభినందనీయమని, ఈ కార్యక్రమంలోని ప్రసంగ పాఠాలను ప్రచురించడం ద్వారా తెలంగాణ ఘనకీర్తిని రేపటి తరాలకు పరిచయం చేసే అవకాశం కలిగిందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆకాశవాణిలో ప్రసారమైన తెలంగాణ ప్రముఖుల జీవిత విశేషాలను తెలంగాణ తేజోమూర్తులు పేరుతో పుస్తక సంకలనంగా ప్రచురించారు. ఈ పుస్తక సమీక్ష బుధవారం హైదరాబాద్‌లోని ఆకాశవాణి కార్యాలయంలో జరిగింది. తెలుగు యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకునేందుకు, మన చరిత్ర, కళలు, సంప్రదాయాలను నేటితరం తెలుసుకునేందుకు ఈ సంకలనం దోహదపడుతుందన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు మాట్లాడుతూ.. మన చరిత్ర గొప్పదని, దాంతోపాటు ప్రస్తుతం బలహీన వర్గాల ప్రజల జీవనస్థితిగతులపై, వసతిగృహాల్లో పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని సూచించారు.

నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆకాశవాణి 60 ఏండ్లుగా తెలంగాణ ప్రజలకు దూరంగా ఉండేదనే భావన ఉన్నదని, తేజోమూర్తులు కార్యక్రమం చేపట్టి తెలంగాణ చరిత్రను, కళలను సమాజానికి తెలిసేలా ప్రసారం చేయడం ద్వారా సంస్థ అందరి అభిమానం చూరగొన్నదన్నారు. తద్వారా ఆకాశవాణి అందరిదనే అభిప్రాయం కలిగించిందన్నారు. తేజోమూర్తులు కార్యక్రమం ఆలకిస్తుంటే గత చరిత్రను మళ్లీ దర్శించిన అనుభూతి కలిగించిందని పేర్కొన్నారు. భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ గతంలో జరిగిన కుట్రల మూలంగా తెలంగాణ చరిత్ర మరుగున పడిపోయిందని, విభజన అనంతరం మన చరిత్రను, మన మహనీయులను వెలికితీసుకునే ప్రయత్నం విస్తృతంగా జరుగుతున్నదని చెప్పారు. ఆకాశవాణి సంచాకుడు ఉదయ్‌శంకర్ మాట్లాడుతూ తేజోమూర్తులు కార్యక్రమ ప్రసారం కోసం ఉద్యోగులందరూ విశ్రాంతి లేకుండా కష్టపడి నిబద్ధతతో కృషి చేశారని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. చరిత్ర పరిశోధకుడు జితేంద్రబాబు మాట్లాడుతూ పక్షపాతం లేకుండా ప్రముఖుల గురించి ప్రసారం చేయడం, పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి కవయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి సమన్వయకర్తగా వ్యవహరించారు.

1172
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles