నేటినుంచి బడిగంట

Wed,June 12, 2019 03:03 AM

-స్కూళ్ల మొత్తం పనిదినాలు 232
-సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు
-డిసెంబర్ 22 నుంచి 28 వరకు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు
-వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు
-వచ్చే ఏడాది ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు
-2019-20 విద్యాక్యాలండర్ విడుదల

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు బుధవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. 2019-20 విద్యాసంవత్సరంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు తరగతులు నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వరకు వేసవి సెలవులు ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్ మంగళవారం కొత్త విద్యాక్యాలండర్ విడుదలచేశారు. దీని ప్రకారం మొత్తం 232 పనిదినాలున్నాయి. ఈ ఏడాది స్కూళ్లు జూన్1నుంచి పునఃప్రారంభం కావా ల్సి ఉన్నా.. ఎండల నేపథ్యంలో వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. దీనివల్ల కొత్త విద్యాసంవత్సరంలో 12 పనిదినాలు పెంచారు.

దసరా సెలవులు 16 రోజులు

ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు ఉంటాయి. మిషనరీ స్కూళ్లకు ప్రత్యేకంగా డిసెంబర్ 22 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ఉంటాయి. స్టేట్ సిలబస్ స్కూళ్లకు అక్టోబర్ 21 నుంచి 26 వరకు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 నుంచి 16 వరకు సమ్మేటివ్-2 నిర్వహించనున్నారు. ఫార్మేటివ్-1 పరీక్షలను జూలై 31 నుంచి, ఫార్మేటివ్-2 సెప్టెంబర్ 27 నుంచి, ఫార్మేటివ్-3 30 నుంచి, ఫార్మేటివ్-4 పదోతరగతి వారికి జనవరి 31 నుంచి, 1-9 వారికి ఫిబ్రవరి 29 నుంచి నిర్వహించనున్నారు.

స్కూల్ వేళల్లో మార్పులు లేవు

కొత్త విద్యాక్యాలండర్‌లో పాఠశాలల వేళల్లో మార్పులు చేయలేదు. ఉన్నత పాఠశాలల్లో పనివేళలు.. ఉదయం 9.30 నుంచి సాయం త్రం 4.45 గంటల వరకు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉదయం 9 సాయం త్రం 4.15 గంటలవరకు. జంటనగరాల్లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4 వరకు. ప్రాథమిక పాఠశాలలు (1-5) ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు. జంటనగరాల్లో ఉదయం 8.45 నుంచి సాయంత్రం 3.45 వరకు. ఉన్నత పాఠశాలల్లో కొనసాగే ప్రాథమిక పాఠశాలల తరగతులు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 వరకు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు కొనసాగుతాయి.

ఏడాదిలో రెండుసార్లు హెల్త్ చెకప్

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఏడాదిలో రెండుసార్లు వైద్యపరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. క్యుమిలేటివ్ రికార్డులను కూడా సరిగా నిర్వహించాలని, ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని విద్యాక్యాలండర్‌లో పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం తరగతులవారీగా విద్యార్థులను గుర్తించి, వారిలో అభ్యాసన పురోగతిని అంచనావేయాలి. రోజువారీగా విద్యార్థుల హాజరు, పురోగతిపై దృష్టిసారించాలి. ప్రతి స్కూల్లో రోజూ 90% విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాల నిర్వహణ కమిటీలో ప్రధానోపాధ్యాయులు భాగస్వాములు కావాలి. తరుచుగా స్కూల్‌కు రాని విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులను సంప్రదించి, ఆ విద్యార్థి రోజూ స్కూల్‌కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కమిషనర్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

4273
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles