వాతావరణ మార్పులను తట్టుకునేందుకు తెలంగాణ విధానాలే మేలు


Tue,January 22, 2019 02:13 AM

Telangana schemes are good for climate change

- నీటి ఎద్దడిని, వేడిన తట్టుకునే రకాలు రూపొందించడంపై నిపుణుల దృష్టి
- సాగునీటి కల్పన.. మేలైన పంటలబీమా.. సాగుసబ్సిడీ
- వీటితోనే రైతులకు పూర్తి భరోసా
- వ్యవసాయ నిపుణుల సూచన

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వేగంగా విస్తరిస్తున్న పర్యావరణ మార్పులు దేశవ్యాప్తంగా వ్యవసాయంపై పెనుమార్పులు చూపనున్నాయి. బొగ్గుపులుసు వాయువు, సరాసరి భూ ఉష్ణోగ్రతల పెరుగుదలతో చీడ, పీడలు ఉధృతంకానున్నాయి. వీటి ప్రభావంతో దేశంలో ప్రధాన ఆహారధాన్యపు పంటలైన వరి, గోధుమలతోపాటు ప్రస్తుతం సాగులో ఉన్న వాణిజ్య రకాల దిగుబడి తగ్గిపోతుంది. ఇలాంటి వాతావరణ మార్పులతో తలెత్తే సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయంగా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే తృణధాన్యాలు, అపరాల వంటి పంటల వైపు మొగ్గు చూపటం కీలకమని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు చెప్తున్నారు. ప్రత్యేకించి అధిక వేడిని తట్టుకొని సాగయ్యే పంటరకాలను రూపొందించాలని సూచిస్తున్నారు. పర్యావరణ మార్పులను దీటుగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను దేశమంతటా విస్తరించాలని అభిప్రాయపడుతున్నారు. దేశంలో వర్షాధార సాగు విస్తీర్ణం ఎక్కువ కాబట్టి పర్యావరణ మార్పుల ప్రభావం ఎక్కువగానే ఉండనుంది. అనావృష్టి, అతివృష్టిలతో పంట దిగుబడులు తగ్గిపోతాయి. కత్తెరపురుగు లాంటి నూతన చీడపీడలు పంటలపై దాడిచేసి నష్టపరుస్తాయి. ఫలితంగా రైతులు తమ ఆదాయాలను 25% నుంచి 28% వరకు కోల్పోయే ప్రమాదముందని గణాంకాలు పేర్కొంటున్నాయి. జీడీపీలో ప్రస్తుతం వ్యవసాయరంగం వాటా 15% వరకు ఉంది. కేవలం పర్యావరణ మార్పులతోనే 1.5% నుంచి 2.5% వరకు ఇందులో కోతపడే అవకాశముందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించాలంటే మారుతున్న వర్షపాతాలు, విస్తరణనుబట్టి పంటలు విత్తటం, పురుగులు, తెగుళ్ల సమర్థ నివారణపై నిపుణులు ఎప్పటికప్పుడు సిఫార్సులు చేయాలని రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ పిడిగెం సైదయ్య చెప్పారు.

పర్యావరణ మార్పులు ప్రధానంగా వర్షపాతంలో హెచ్చుతగ్గులు, అకాలవర్షాలు, వర్షాభావానికి కారణమవుతున్నాయి కాబట్టి తెలంగాణ తరహాలో సాగునీటి కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. ఇది పర్యావరణ మార్పులకు రక్షణగా, బీమాగా పనిచేస్తుంది అని తెలిపారు. నీటి ఎద్దడి, కొత్తగా వచ్చిపడే చీడ, పీడలతో పంటలు నష్టపోయే ప్రమాదముంది కాబట్టి మేలైన పంటలబీమా రూపొందించి, అమలుపరుచాలి. రైతులకు పర్యావరణ మార్పులను దీటుగా ఎదుర్కొనేందుకు సాగుసబ్సిడీ అందించాలి. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పేరుతో అందిస్తున్న పంటపెట్టుబడి సాయాన్ని అన్ని రాష్ర్టాల్లో అందిస్తే రైతుకు ఆర్థిక భరోసా ఉంటుంది అని చెప్పారు. అపరాలు నత్రజని సాంద్రతను, కర్బనాన్ని అధికంగా అందిస్తాయి. అందువల్ల వీటి సాగువిస్తీర్ణం పెంపునకు ప్రణాళికలు రూపొందించాలి. రాగులు, కొర్రలు, ఇతర తృణధాన్యాలు వేడిని సమర్ధంగా తట్టుకుంటాయి. ఈ పంటలలో సైతం నూతన రకాలను రూపొందించి, సాగుకు పరిచయం చేయాలి. తక్కువ నీటితో ఎక్కువ పంటలను రక్షించుకునేందుకు బిందు, తుంపర్ల సాగుకు ప్రాధాన్యమివ్వాలి. అత్యంత అనుకూల వాతావరణం ఉన్న ప్రాంతాలలో పంటకాలనీలను ప్రోత్సహిస్తే పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి. వాతావరణంలో మార్పులను ఆయా పంటలు తట్టుకుంటాయి అని సూచించారు.

సాగునీటి కల్పనతో పర్యావరణ మార్పులకు చెక్

దక్షిణ భారతదేశంలో ఉష్ణవాతావరణం ఉండటం, పంటల సాగు వర్షాధారం కావడంతో రాష్ట్రంపై కూడ కొంత మేరకు పర్యావరణ మార్పుల ప్రభావం ఉంటుందని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సీ పార్థసారథి చెప్పారు. ప్రస్తుత పంటల రకాలు అధిక దిగుబడినిచ్చేవి మాత్రమేనని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలను, నీటి ఎద్దడిని తట్టుకునే రకాలను రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సాగునీటి కల్పనతో రాష్ట్రంలో సాగులో పర్యావరణ మార్పులకు చెక్ పెట్టగలిగామని వెల్లడించారు. బిందు, తుంపర సేద్యాలకు అధికంగా సబ్సిడీతో రైతులకు పరికరాలు అందిస్తున్నామని చెప్పారు. పర్యావరణ మార్పులకు ప్రధాన కారణమైన కార్బన్‌డైఆక్సైడ్‌ను నిరోధించి పంటల దిగుబడి పెంపొందించేందుకు హరిత గృహాల (గ్రీన్‌హౌజ్) సాగుతో మార్గం సులభమైందని తెలిపారు. సమగ్ర వ్యూహాలతో రాష్ట్రంలో వ్యవసాయంపై పర్యావరణ మార్పుల ప్రభావం పడకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

1176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles