కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ సర్కార్ నజర్

Thu,February 1, 2018 09:31 AM

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ఈసారైనా కరుణ చూపుతుందా అని తెలంగాణ ప్రభు త్వం ఎదురుచూస్తున్నది. కేంద్రం నుంచి వివిధ పథకాల కింద రావాల్సిన బకాయిలు, 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రంలో అమలవుతున్న బృహత్తర అభివృద్ధి పథకాలకు కేంద్రం నుంచి నిధులను సాధించడానికిప్రభుత్వం అన్నివిధాలుగా ప్రయత్నాలు చేసింది. కేంద్రం నుంచి ప్రస్తుతం నుంచి పన్నుల వాటాగా నెలకు సుమారు రూ. 1300 కోట్లు వస్తున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ. 14 వేల కోట్లు సమకూరాయి. 2017-18లో ఈ రాబడి రూ.17వేల కోట్ల వరకు ఉండవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అంచనా వేసింది. కానీ, నూతనంగా అమల్లోకి వచ్చిన వస్తుసేవల పన్ను (జీఎస్టీ), పన్ను వసూలు తగ్గడం వంటి ప్రతికూల పరిణామాలతో ఆశించిన మేరకు వాటా రావడం లేదు.


కేంద్ర ప్రాయోజిత పథకాల్లో న్యాయం జరిగేనా?

కేంద్ర ప్రాయోజిత పథకాల్లో నిధుల విడుదల ఈసారి పెరుగుతుందా? సంక్షేమ పథకాలకు, నీటి ప్రాజెక్ట్‌లకు సాయం అందిస్తుందా? ఎయిమ్స్ ఏర్పాటుకు నిధులను మంజూరు చేస్తుందా? అనే విషయాలపై ఉత్కంఠ నెలకొంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణకు కేంద్రం నుంచి కనీస మద్దతు లభించడం లేదని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఫ్లోర్‌లీడర్ జితేందర్‌రెడ్డి ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 41రకాల పథకాలను అమలు చేస్తున్నది. వీటిలో కూడా కొన్నింటిని కుదించి మొత్తం రాష్ర్టాలపైనే భారం వేస్తుందా అన్న అనుమానాలున్నాయి. రాష్ట్రంలో సబ్సిడీ బియ్యం పథకం కింద రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మైనార్టీల సంక్షేమానికి, వారి విద్యావ్యాప్తికి తగిన ఆర్థిక సాయం చేయాలని, సబ్సిడీ బియ్యం, గోధుమల కోటాను పెంచాలని రాష్ట్రం చేసిన విజ్ఞప్తులకు స్పందన లేదు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులను మంజూరు చేయాలని కోరినా ఫలితం లేదు. బుధవారం ప్రవేశపెట్టబోయే వార్షిక బడ్జెట్‌లోనైనా కేంద్రం రాష్ర్టానికి ఎంతవరకు తోడ్పాటునిస్తుంది అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles