ఆర్టీసీలో ఆనందహేల

Tue,December 3, 2019 03:55 AM

- సీఎం కేసీఆర్‌ వరాలతో ఉద్యోగుల్లో మిన్నంటిన సంబురాలు
- సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు
- జయజయ నినాదాలు
- సంబురాల్లో పాలుపంచుకొన్న రవాణామంత్రి పువ్వాడ అజయ్‌
- బస్సు నడిపి ఉద్యోగుల్లో భరోసా నింపిన మంత్రి

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ ఉద్యోగుల్లో ఉద్విగ్నవాతావరణం నెలకొన్నది. సంస్థను లాభాలబాట పట్టించే చర్యలతోపాటు ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలతో సంబురాలు మిన్నంటాయి. ప్రతి డిపోలో సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. కేసీఆర్‌ జై అంటూ ముక్తకంఠంతో నినదించారు. మిఠాయిలు పంచుకొంటూ అభినందనలు తెలుపుకున్నారు. జగిత్యాల డిపోలో ఏకంగా పంచామృతంతో ముఖ్యమంత్రి చిత్రపటాన్ని అభిషేకించారు. అటు ఖమ్మం డిపోలో జరిగిన వేడుకల్లో రవాణామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పాలుపంచుకొన్నారు. ఉద్యోగుల్లో చైతన్యం పెంచేందుకు ఇంద్ర బస్సును నడిపించారు. అనంతరం మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులందరూ సమిష్టి బాధ్యతతో విధులు నిర్వర్తించాలన్నారు. భవిష్యత్తు ఉద్యోగులదేనని భరోసా ఇచ్చారు. మంథని ఆర్టీసీ డిపోలో ఉద్యోగులతోకలిసి జెడ్పీ చైర్మన్‌ భార్య పుట్ట శైలజ ఇతర నాయకులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వేములవాడ డిపో బోయినపల్లిలో, మెదక్‌ డిపోలో ఉద్యోగులు సోమవారం సంబురాలు చేసుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు సెప్టెంబర్‌ నెల వేతనాలను సత్వరమే విడుదల చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల డిపోలో డీఎం జగదీశ్వర్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పంచామృతాభిషేకం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలోని ఆర్టీసీ డిపోఎదుట సోమవారం డ్రైవర్లు, కండక్టర్లు,ఇతర ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచుకుంటూ కేసీఆర్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటలోని డిపో ఎదుట సీఎం కేసీఆర్‌ ఫ్లెక్సీకి ఆర్టీసీ కార్మికులు సోమవారం క్షీరాభిషేకం చేశారు.
Puvvada-Ajay-Kumar1

అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి: టీజీవో

అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారని, ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించడం, సమస్యలన్నీ పరిష్కారం చేసేందుకు నిర్ణయం తీసుకోవడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం సోమవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేసింది. ఏండ్ల తరబడి ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ మేరకు టీజీవో అధ్యక్షురాలు వీ మమత, ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు పీ రవీంద్రకుమార్‌, హైదరాబాద్‌ జిల్లాశాఖ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎంబీ కృష్ణయాదవ్‌, టీజీవో అబ్కారీ విభాగం అధ్యక్షుడు రవీందర్‌రావు, లక్ష్మణ్‌గౌడ్‌, టీసీ టీజీవో అధ్యక్షడు బీ వెంకటయ్య, సబిత, శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.
Puvvada-Ajay-Kumar2

జేఏసీ నుంచి వైదొలిగిన సూపర్‌ వైజర్స్‌ సంఘం

ఆర్టీసీలో సమ్మె ముగిసినందున జేఏసీ నుంచి తాము వైదొలుగుతున్నట్టు సూపర్‌వైజర్స్‌ అసోసియేషన్‌ సోమవారం ప్రకటించింది. జేఏసీలో భాగస్వామిగా ఉండి తమ వంతు పోరాటం చేశామని సంఘం అధ్యక్షురాలు సుధ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

1645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles