ఆర్టీసీ కొత్త చార్జీలు నేటి నుంచే

Tue,December 3, 2019 05:00 AM

- మూడేండ్ల తర్వాత చార్జీల పెంపు
- ఆరేండ్ల తర్వాత బస్‌పాసుల ధరల్లో పెరుగుదల
- ఆర్థిక నష్టాల కారణంగానే పెంచుతున్నామన్న యాజమాన్యం
- ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి
- కిలోమీటర్‌కు 20 పైసల పెంపు
- బస్సులను బట్టి పెరిగిన కనీస చార్జీలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కొత్త బస్‌చార్జీలు మంగళవారం నుంచి అమలులోకి వస్తున్నాయి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున పెంచడానికి ప్రభుత్వం అనుమతించడంతో రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (ఆర్టీసీ) యాజమాన్యం.. బస్సులవారీగా పెంచిన చార్జీలను ప్రకటించింది. పల్లెవెలుగు, ఆర్డినరీ, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల వంటి అన్ని రకాల బస్సుల్లో చార్జీలను పెంచినట్లు సోమవారం సర్క్యులర్‌ విడుదలచేసింది. కనీస చార్జీల్లో మార్పుచేయడంతోపాటు పెరిగిన చార్జీలకు అనుగుణంగా బస్‌పాసుల చార్జీల్లోనూ మార్పుచేసినట్లు పేర్కొన్నది. విద్యార్థుల బస్‌పాస్‌ చార్జీలను చివరిసారి 2013లో సవరించారు. తిరిగి ఆరేండ్ల తర్వాత ఇప్పుడే మార్పుచేశారు. బస్‌చార్జీలను కూడా చివరిసారి 2016లో సవరించారు. మళ్లీ మూడేండ్ల తర్వాత వాటిని పెంచు తూ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ ప్రయాణికులకోసం ఇచ్చే కాంబో టికెట్ల చార్జీలను పెంచినట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. టోల్‌ప్లాజా టారిఫ్‌, ప్యాసింజర్‌ సెస్‌, ఎమినిటీస్‌, ఏసీ సర్వీసులపై జీఎస్టీ తదితర చార్జీలు అదనమని పేర్కొన్నది. కొత్త చార్జీల పట్టికలను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అన్ని యూ నిట్ల అధికారులకు సూచించింది.
RTC1
సోమవారం నాడు ప్రయాణం ప్రారంభించి దూర ప్రాంతాలకు ప్రయాణించేవారికి.. టికెట్లు ముందుగా బుక్‌చేసుకున్నవారికి పాతచార్జీలే వర్తిస్తాయని స్పష్టంచేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తిరిగే మెట్రో, లగ్జరీ, సిటీ శీతల్‌ రకం సర్వీసుల చార్జీల్లో ప్రస్తుతానికి పాత చార్జీలే అమలులో ఉంటాయని.. సవరించిన తర్వాత వాటిని ప్రకటిస్తామని వెల్లడించింది. ఆర్టీసీని నష్టాల నుంచి కాపాడేందుకు తీసుకొంటున్న చర్యల్లో భాగంగా చార్జీలు పెంచుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీనికి అనుగుణంగానే సంస్థపై పడుతున్న భారం, ఆక్యుపెన్సీ రేషియో, ప్రయాణికులకు అందించాల్సిన సేవలను దృష్టిలో ఉంచుకొని, నిబంధనలకు లోబడి చార్జీలు పెంచుతున్నామని.. ఈ పెంపు అనివార్యమైనందున ప్రయాణికులు మంచిమనసుతో సహకరించాలని
RTC2
ఆర్టీసీ విజ్ఞప్తిచేసింది. రోజురోజుకూ పెరుగుతున్న నష్టాలు, ఆర్థికభారం వల్లనే చార్జీల పెంపు అనివార్యమైందని ఆర్టీసీ యాజమాన్యం విడుదలచేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. దీని ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్‌ రాబడి రూ.4,233.05 కోట్లు ఉండగా, వ్యయం రూ.4,982.33 కోట్లుగా ఉన్నది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రాబడి రూ.4,570.37 కోట్లు కాగా, వ్యయం రూ.5,319.27 కోట్లుగా ఉన్నది. అంటే రూ.748.90 నష్టం చవిచూసింది. 2018 అక్టోబర్‌లో కార్మికులకు 16 శాతం మధ్యంతర భృతి ఇవ్వడం వల్ల రూ.133.07 కోట్ల భారం పడింది. తరుచూ పెరుగుతున్న ఇంధనధరలు సంస్థకు అదనపు భారంగా తయారయ్యాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాబడి రూ.4,882.72 కోట్లు ఉండగా, వ్యయం రూ.5,811.39 కోట్లుగా ఉన్నది. అంటే రూ.928.67 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు-2019 నాటికి సంస్థ రూ.303.39 కోట్ల నష్టం చవిచూసింది. ఇలాగే కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ.1200 కోట్ల నష్టం వచ్చే అవకాశమున్నది.
RTC3

పల్లె వెలుగులో కిలోమీటర్‌కు 83 పైసలు

ఆర్టీసీ తాజా నిర్ణయంతో ప్రతి కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున చార్జీలు పెరిగాయి. బస్సురకాన్ని బట్టి ఆర్టీసీ వేర్వేరుగా చార్జీలను వసూలు చేస్తున్నది. పాత చార్జీలను పరిశీలిస్తే.. కనిష్ఠంగా పల్లెవెలుగు బస్సులో కిలోమీటర్‌కు 63 పైసలు ఉండగా, ప్రస్తుతం 83 పైసలకు చేరింది. గరిష్ఠంగా వెన్నెల ఏసీ స్లీపర్‌ బస్సుల్లో కిలోమీటర్‌కు 253 పైసలు ఉండగా, తాజాపెంపుతో అది 273పైసలకు చేరింది.

పెరిగిన కనీస చార్జీలు

ఇప్పటివరకు పల్లెవెలుగు, సెమీ ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రతి ఐదు కిలోమీటర్ల ప్రాతిపదికన కనీస చార్జీ రూ.6 గా ఉండేది. ఇప్పుడు ఈ కనీసచార్జీని రూ.10 కి పెంచారు. ప్రతి రెండు కిలోమీటర్ల ప్రాతిపదికన సిటీలో కొనసాగుతున్న కనీస చార్జీలను ఆర్డినరీలో రూ.10 కి పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కనీసధర (రూ.10)లో మార్పుచేయలేదు. మెట్రో డీలక్స్‌ కనీసచార్జీ రూ.10 నుంచి రూ.15కు పెరిగింది. పండుగలు, జాతరల సందర్భాల్లో నడిపే ప్రత్యేక సర్వీసులకు సాధారణ చార్జీల కంటే 1.5 రెట్లు మించకుండా చూసుకోనున్నారు.

3313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles