సైబర్ సెక్యూరిటీలో మనం సేఫ్


Sun,August 25, 2019 02:20 AM

Telangana preparing army of cyber warriors

-తెలంగాణలోనే మొదటి పాలసీ అమలు
-వచ్చేవన్నీ సైబర్‌యుద్ధాలే
-ప్రతిఒక్కరూ సైబర్‌సెక్యూరిటీపై దృష్టిసారించాలి
-ఐటీ, పరిశ్రమలశాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలో మొదటిసారిగా తెలంగాణలోనే ప్రత్యేక సైబర్‌సెక్యూరిటీ పాలసీని ప్రవేశపెట్టినట్టు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోని పలు సంస్థల వెబ్‌సైట్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని, తెలంగాణలో మాత్రం అలాంటి సైబర్‌దాడులు జరుగకుండా చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ఇసాకా సంస్థ హైదరాబాద్ చాప్టర్ ప్రారంభించి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శనివారం హైటెక్స్‌సిటీలోని సైబర్‌కన్వెన్షన్స్‌లో నిర్వహించిన ఒకరోజు సదస్సుకు జయేశ్‌రంజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్‌లో ప్రపంచయుద్ధమంటూ వస్తే అది సైబర్‌వారేనని, దానిని సమర్థంగా ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధంగా ఉండాలన్నారు. అందుకోసం సైబర్‌దాడులను అరికట్టేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్లు, టూల్స్, అప్లికేషన్లను రూపొందించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.

భారతీయులు సైబర్‌దాడులకు బాధితులుగా ఉండకూడదని ఆకాంక్షించారు. ప్రతిఒక్కరూ సైబర్‌సెక్యూరిటీపై దృష్టిసారించాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. సైబర్‌టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలను రూపొందించే సంస్థలను ప్రోత్సహించాలని కోరారు. సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ వాడకం పెరిగిన నేపథ్యంలో ప్రమాదకర వెబ్‌సైట్లతో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించే వారందరూ సైబర్‌టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని, విద్యార్థి దశనుంచే ప్రత్యేకశిక్షణ ఇవ్వాలన్నారు. జేఎన్టీయూలోని సీఎస్‌ఈ డిపార్ట్‌మెంట్ విద్యార్థులు వారి కోర్సు పూర్తయ్యేలోపు తప్పకుండా సైబర్‌సెక్యూరిటీపై పరిశోధనచేయాలనే నిబంధన ప్రవేశపెట్టామని తెలిపారు.

యూనివర్సిటీ దశలో శిక్షణ పొందిన విద్యార్థులు ఏ సంస్థలో ఉద్యోగంచేసినా సైబర్‌దాడుల సమస్యలను అధిగమిస్తారని చెప్పారు. టీహబ్ వంటి అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్లు హైదరాబాద్‌లో ఉన్నాయని, టెక్నాలజీని అభివృద్ధి చేయడం ద్వారా సైబర్‌దాడులను ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. సైబర్‌సెక్యూరిటీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం మంచి సహకారం అందిస్తున్నదని వివరించారు. ఇసాకా హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ జీసీఎస్ శర్మ మాట్లాడుతూ.. సైబర్‌సెక్యూరిటీ ప్రతిఒక్కరికీ చాలా అవసరమన్నారు. చాలారంగాల్లో ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తున్నదని, అందుకోసమే సైబర్‌సెక్యూరిటీ టెక్నాలజీని అభివృద్ధిచేసేందుకు కృషిచేస్తున్నామని పేర్కొన్నారు.

552
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles