ఖబడ్దార్‌..!

Sat,December 7, 2019 02:56 AM

- అరాచక శక్తులకు సింహస్వప్నంలా తెలంగాణ పోలీసులు
- నాడు నయీం, వికారుద్దీన్‌.. నేడు దిశ హంతకులు
- పేకాటక్లబ్బులు.. డ్రగ్స్‌ ముఠాలు ఏవైనా తరలిపోవాల్సిందే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో అరాచక శక్తులకు చోటులేదని పోలీసులు మరోసారి నిరూపించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, దానికి ఎవరూ అతీతులుకారని, ప్రజలకు శాంతిభద్రతలు కల్పించడమే తమ పరమావధి అని తెలంగాణ పోలీసులు దేశానికి చాటిచెప్పారు. ప్రజలకు కీడు తలపెట్టాలని ఆలోచించే వారెవరిపైనైనా ఉక్కుపాదం మోపుతామని వారు స్పష్టంచేశారు. శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ పోలీసులు నలుగురు మృగాళ్లను మట్టుబెట్టడంతో ఇప్పుడు యావత్‌ దేశం మన రాష్ట్రంవైపే చూస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటి నుంచి తెలంగాణలో శాంతిభద్రతల రక్షణకు సీఎం కేసీఆర్‌ అత్యధిక ప్రాధాన్యమిస్తున్నా రు. దీనిలో భాగంగా పోలీసులకు సకల సౌకర్యాలు కల్పించడంతోపాటు రాష్ట్రంలో రౌడీయిజం, అన్యాయాలు, అక్రమాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ తావుండకూడదని సుస్పష్టమైన ఆదేశాలిచ్చారు.

తప్పుచేసినవారు ఎవరైనా ఉపేక్షించవద్దని సాక్షాత్తూ శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్‌ స్పష్టతనివ్వడంతో తెలంగాణ పోలీసులు అసాంఘికశక్తుల భరతం పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో భూదందాలు, సెటిల్మెంట్లు, కిడ్నాప్‌లు, హత్యలు తదితర అరాచకాలతో హడలెత్తించిన నయీం మొదలుకొని.. జైలు నుంచే విద్రోహ చర్యలకు పాల్పడిన కరడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్‌ లాంటి ఎంతోమంది దుర్మార్గుల పీచమణిచి హైదరాబాద్‌లో ప్రశాంతత నెలకొల్పారు. హైదరాబాద్‌ సహా తెలంగాణలో ఒక్క పేకాట క్లబ్బు కూడా ఉండకూడదన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసులు వాటిపై కూడా ఉక్కుపాదం మోపారు. ఈ విషయంలో ఎన్ని ఒత్తిడులొచ్చినప్పటికీ పోలీసులు వెనక్కు తగ్గకపోవడంతో ఆ క్లబ్బులన్నీ మూటాముల్లె సర్దుకొని పక్క రాష్ర్టాలకు తరలిపోయాయి. ఇదేవిధంగా డ్రగ్స్‌ సరఫరాదారుల భరతంపట్టిన తెలంగాణ పోలీసులు.. మరోవైపు విత్తనాలు, తినుబండారాలను కల్తీచేసేవారిపై తెలంగాణ పోలీసులు పీడీయాక్టు కింద కేసులు నమోదుచేయడంతో వారి ఆగడాలకు కూడా అడ్డుకట్టపడింది.

1300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles