కొండంత అండగా పథకాలు


Thu,December 6, 2018 02:53 AM

Telangana People Full happy For KCR Schemes

-ప్రజా సంక్షేమంపై సర్కారు దృష్టి
-24 గంటల కరంటుతో ప్రజలకు భరోసా
-ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాలు బాధితులకు పింఛన్లు
-కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై హర్షం
-రైతుబంధు, రైతుబీమాకు జేజేలు
-కేసీఆర్ కిట్, ఓవర్సీస్ విద్యాపథకం అమోఘం

ఎక్కల్‌దేవి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్ : ఎన్నికల వేళ ఎవరో వచ్చి.. ఏదోచేస్తామని చెప్పింది విని నమ్మితే మోసపోతాం. గోస పడుతాం. గతంలో ఏం జరిగింది? ఇప్పుడు పరిస్థితేమిటి? అనే అంశాన్ని ఓటు వేసేముందు ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలని తెలంగాణ వాదులు సూచిస్తున్నారు. మన జీవితాలను ప్రభావితంచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో విచక్షణతో వ్యవహరించాలని చెప్తున్నారు. ఓట్ల కోసం మన ముందుకు వస్తున్న పార్టీలు, అవి పరిపాలించిన తీరు, పథకాలను అమలుచేసిన పద్ధతిని గుర్తుకు తెచ్చుకోవాలంటున్నారు. మన కండ్లముందు రెండే పార్టీలు కనబడుతున్నాయనీ.. వాటిలో ఒకటి.. సొంత రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే పరమావధిగా.. ముందుకుసాగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) కాగా, రెండోది.. గత చరిత్ర అంతా ప్రజలను మోసంచేయడమే విధానంగా పరిపాలన సాగించిన కాంగ్రెస్, టీడీపీ లాంటి పార్టీల కూటమి అని గుర్తుచేస్తున్నారు. .

ఇందులో ఏ పార్టీ ప్రజల మనోభీష్టాలకు అనుగుణంగా.. ప్రజల కష్టాల్లో ఆదుకునేలా పథకాలను అమలుచేసింది.. ప్రజల అవసరాలు ఎంతమేర తీరాయి.. ఎందరికి అందాయి అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచిస్తున్నారు. తెలంగాణ ప్రజలను చిమ్మ చీకట్లలో మగ్గిపోయేలా వ్యవహరించిన సీమాంధ్ర ప్రభుత్వాలను నమ్ముదామా? దేశంలోనే మొదటిసారిగా వ్యవసాయానికి కూడా 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్‌ను అందిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముదామా? అనేది తేల్చుకోవడమే అత్యంత కీలకమని తెలంగాణవాదులు చెప్తున్నారు. కల్యాణలక్ష్మి, ఓవర్సీస్ విద్యాపథకం, బీడీ, గీత, నేత కార్మికులు, బోధకాలు, ఎయిడ్స్ బాధితులు, ఒంటరి మహిళలకు పింఛన్లనేవి బహుశా దేశంలోనే ఎక్కడా లేవు. ప్రజల ఆరోగ్యంపై దృష్టిసారించిన ప్రస్తుత ప్రభుత్వం కంటివెలుగు కింద ఇప్పటికే కోటిమందికి పరీక్షలు నిర్వహించి.. కండ్లద్దాలు ఇచ్చి, ఆపరేషన్లు చేయిస్తున్న అంశం మన కండ్లముందే ఉన్నది. రైతుబంధు, రైతుబీమా గురించి ఎంత చెప్పినా.. తక్కువే. ప్రజల ఆత్మాభిమానం నిలబడేలా డబుల్ బెడ్‌రూం ఇండ్ల గృహప్రవేశాలు మన కండ్లముందే జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ మూలకుపోయినా.. ఏ ఇంటి తలుపుతట్టినా.. కండ్లముందే పథకాలు.. రతనాల్లా మెరుస్తున్నాయని గుర్తుచేస్తున్నారు. మన కండ్లముందు కనపడుతున్న నిజాలను నమ్ముదామా.. లేక.. గతంలో ఏమీచేయక.. అవినీతి, అక్రమాలకు పాల్పడి.. తిరిగి ఇప్పుడు ఏమేమో చేస్తామంటూ చెప్తున్న కల్లబొల్లి మాటలను నమ్ముదామా.. ప్రజలు ఆలోచించుకోవాలని తెలంగాణవాదులు సూచిస్తున్నారు.

2119
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles