బరిగీసిన పల్లెలు

Fri,January 11, 2019 12:39 PM

-తొలివిడుత పంచాయతీ పోరుకు ముగిసిన నామినేషన్ల పరిశీలన
-ఇక ప్రచారపర్వం
-360కి పైగా గ్రామాలు ఏకగ్రీవమయ్యే అవకాశం
-నేటి నుంచి రెండో విడుత నామినేషన్ల స్వీకరణ
-గత ఎన్నికల్లో ఈసీ అనర్హత వేటుకు గురైనవారికి మరో అవకాశం కల్పించిన హైకోర్టు
-కో-ఆపరేటివ్ డైరెక్టర్లూ పోటీ చేయొచ్చన్న ఎన్నికల సంఘం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పంచాయతీ పోరు ఊపందుకుంది. పల్లెల్లో ఎన్నికల కోలాహలం పెరిగింది. తొలివిడుత ఎన్నికలు జరుగనున్న పంచాయతీల్లో గురువారం నామినేషన్ల పరిశీలన పూర్తికాగా.. శుక్రవారం నుంచి రెండో విడుత గ్రామాల్లో నామినేషన్ల ఘట్టానికి తెరలేవనున్నది. దీంతో బుజ్జగింపులు, అభ్యర్థుల ముందస్తు ప్రచారాలు, ఆశావహుల హడావుడితో పల్లెల్లో ఎన్నికల వేడి మరింత పెరిగింది. తొలివిడుతలో 4,479 గ్రామాలకు ఎన్నికలు జరుగుతుండగా సర్పంచ్, వార్డు స్థానాలకు కలిపి మొత్తం 1,25,630 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేసమయంలో అనేక గ్రామాలు ఏకగ్రీవంతో తమ ఐక్యతను చాటుకున్నాయి. 360కి పైగా గ్రామాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలైనట్టు సమాచారం. శుక్రవారం నుంచి రెండో విడుత పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. 4,137 గ్రామాలకు సంబంధించిన ఉదయం 10:30 గంటలకు జిల్లా కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.

నామినేషన్ల పరిశీలన పూర్తి

తొలి విడుతలో నామినేషన్ల పరిశీలన గురువారంతో ముగిసింది. బుధవారం వరకు దాఖలు చేసిన నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. చాలా ఎక్కువ నామినేషన్లు ఉండటంతో గురువారం అర్ధరాత్రి వరకు పరిశీలన ప్రక్రియ కొనసాగింది. చివరి రోజు కావడంతో బుధవారం ఒక్కరోజే సర్పంచ్ స్థానాలకు 19,416 నామినేషన్లు దాఖలు చేశారు. 4,479 గ్రామాలకు సంబంధించి సర్పంచ్, వార్డు స్థానాలకు మొత్తం 1,25,630 నామినేషన్లు దాఖలయ్యాయి. 4,479 సర్పంచ్ స్థానాలకు 27,940 నామినేషన్లు, 39,822 వార్డు స్థానాలకు 97,690 నామినేషన్లు దాఖలయ్యాయి. సగటున సర్పంచ్ స్థానానికి 6.23 మంది, వార్డుస్థానానికి 2.45 మంది పోటీపడుతున్నారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 304 సర్పంచ్ స్థానాలకు 2,231 మంది పోటీ పడుతున్నారు. అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 174 సర్పంచ్ స్థానాలకు 276 నామినేషన్లు దాఖలయ్యాయి. అర్హత సాధించిన నామినేషన్ల జాబితాను గురువారం అర్ధరాత్రి విడుదల చేశారు. అర్హత సాధించిన, తిరస్కరణకు గురైన నామినేషన్లపై శుక్రవారం అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ నెల 13న నామినేషన్ల తుది జాబితాను ప్రకటించి, గుర్తులను కేటాయించనున్నారు. 21న పోలింగ్ జరుగుతుంది.

నేటి నుంచి రెండో విడుత ఎన్నికల ప్రక్రియ

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నుంచి రెండో విడుత ఎన్నికల ఘట్టం ప్రారంభంకానున్నది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు జిల్లాల్లో కలెక్టర్లు నోటిఫికేషన్ జారీచేస్తారు. అనంతరం నిర్దేశించిన గ్రామాల్లో ఈ నెల 13వ తేదీ వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరిస్తారు. 14న పరిశీలించి అర్హత సాధించిన నామినేషన్ల జాబితాను ప్రకటిస్తారు. 15న అభ్యంతరాలను స్వీకరించి, 16న పరిష్కరిస్తారు. 17న ఉపసంహరణలకు అవకాశం కల్పించి, అదేరోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను విడుదలచేస్తారు. 25న పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల సిబ్బంది కేటాయింపుపై రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ జిల్లా కలెక్టర్లకు అత్యవసర ఆదేశాలు ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల కేటాయింపు ఉత్తర్వులను సిబ్బందికి సంక్రాంతిలోపు అందించాలన్నారు. 15న రెండో విడుతలో నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు.

అభివృద్ధి నినాదంతో ఏకగ్రీవం

తొలివిడుతలో 360కిపైగా గ్రామాల్లో సింగిల్ నామినేషన్ దాఖలైనట్టు సమాచారం. అవన్నీ ఏకగ్రీవం కానున్నాయి. ఇందులో కొత్త గ్రామాలు, గిరిజన తండాలే అధికంగా ఉన్నాయి.

కో అపరేటివ్ డైరెక్టర్లు కూడా అర్హులే

పంచాయతీ ఎన్నికల్లో కో-ఆపరేటీవ్ సొసైటీలు, సహకార సంఘాల్లోని సభ్యులు, డైరెక్టర్లు పోటీ చేసేందుకు అర్హులేనని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్ తెలిపారు. ఈ విషయంలో పలు జిల్లాల నుంచి సందేహాలు వ్యక్తం కావడంతో గురువారం అత్యవసర ఆదేశాలు జారీచేశారు.

ఈసీ అనర్హతకు గురైనవారికి హైకోర్టు ఊరట

2013 పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి ఎన్నికల వ్యయంపై లెక్కలు చూపించకుండా కాలయాపన చేస్తున్న అభ్యర్థులు ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం అనర్హత వేటువేసింది. మూడేండ్లపాటు మరే ఎన్నికల్లోనూ పోటీచేయకుండా ఆదేశాలు జారీచేసింది. వీరిలో సర్పంచ్, వార్డుస్థానాల అభ్యర్థులతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు కూడా ఉన్నారు. అయితే దాదాపు 200 మంది అభ్యర్థులు ఎన్నికల సంఘం అందజేసిన నోటీసులు తమకు అందలేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. ఎటువంటి నోటీసులు అందకుండానే ఎన్నికల సంఘం అనర్హతకు గురైన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఆదేశాలు జారీచేసింది. దీంతో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తున్న అభ్యర్థులకు ఉపశమనం లభించింది.

రిజర్వేషన్లపై జోక్యం చేసుకోలేం

పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలై, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల అంశం లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టంచేసింది. కొన్ని గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా వందశాతం లేకపోయినా వాటిని రిజర్వ్ చేయడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది.
Grampanchayat1

3023
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles