ఎస్సీల అభివృద్ధికి 14,375 కోట్లు


Tue,February 13, 2018 02:52 AM

Telangana on right path in SC development says Jagadish Reddy

-ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం దేశానికే ఆదర్శం
-50 రోజుల్లో పూర్తిస్థాయి నిధుల ఖర్చుకు ప్రణాళికలు
-పారదర్శకంగా అభివృద్ధి నిధి పద్దు ఖర్చులు
-ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి వెల్లడి

హైదాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు దళితుల ప్రగతి నినాదాలకే పరిమితమైందని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పాలనలో వారి ఆర్థిక ప్రగతికి బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం కల్పించారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధిశాఖమంత్రి జీ జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో మంత్రి అధ్యక్షతన ఎస్సీ కులాల ప్రత్యేక అభివృద్ధినిధి చట్టం అమలుపై ఎస్సీ అభివృద్ధి, ఇతర అనుబంధశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ దళితుల అభివృద్ధికోసం తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా మొదటిసారి ఎస్సీ అభివృద్ధి నిధి చట్టాన్ని అమల్లోకి తీసుకుచ్చిందని, ఈ చట్టం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. చట్టం అమల్లోకి వచ్చిన మొదటి ఏడాదే పెద్దఎత్తున నిధులు కేటాయించినట్టు తెలిపారు. 16.32 శాతం జనాభా నిష్పత్తి ప్రకారం ప్రభుత్వం 2017-18 ఆర్థిక సంవత్సరానికి రూ.14,375 కోట్లు కేటాయించిందని, అందులో ఇప్పటివరకు రూ.6,689 కోట్లు ఖర్చుచేసినట్టు మంత్రి వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి పూర్తిస్థాయిలో నిధులు ఖర్చుచేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు.
JAGADEESHREDDY
మొత్తం 197 సంక్షేమ పథకాలతోపాటు 219 ఉపసంక్షేమ పథకాలతో దళితుల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ స్టడీసర్కిల్ హైదరాబాద్‌లో మాత్రమే ఉందని, తెలంగాణ వచ్చాక అన్ని జిల్లాకేంద్రాల్లో ఏర్పాటు చేసుకున్నామన్నారు. దళితుల అభివృద్ధి కోసం ఖర్చుపెట్టే ప్రతిపైసా పారదర్శకంగా ఉండేలా చూడటంతోపాటు లబ్ధిదారుల వివరాలను ప్రజాప్రతినిధులకు అందించామని చెప్పారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రత్యేకనిధి చట్టం దేశంలో ప్రత్యేక చర్చకు తెరలేపిందని, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రత్యేక అభివృద్ధినిధి చట్టం ద్వారా లబ్ధిపొందినవారి వివరాలు ఎప్పటికప్పుడు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. సమావేశంలో ఆర్థికశాఖ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రసాద్, పాఠశాల విద్య డైరెక్టర్ కిషన్, ఎస్సీ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్ జగన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలే కాంగ్రెస్‌ను ఎన్‌కౌంటర్ చేస్తారు


ప్రజలే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎన్‌కౌంటర్ చేస్తారని, ఆ పార్టీ నాయకులను మోరీలో వేస్తారని మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఎన్‌కౌంటర్ చేయాలంటూ కాంగ్రెస్ నాయకులు పేర్కొనడాన్ని విలేకరులు ప్రస్తావించగా ఎన్నికల్లో అధికారపార్టీని ఎదుర్కోలేకే దిగజారుడు విమర్శలు చేస్తున్నారని, ప్రజలే వారికి బుద్ధిచెపుతారని అన్నారు. నకిరేకల్, సూర్యాపేటలో ఒక్క రాజకీయకేసు కూడా లేదని స్పష్టంచేశారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గాల్లో హత్యలు ఎందుకు జరుగడం లేదని, ఒక్క నల్లగొండలోనే ఎందుకు జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మొన్న హత్య జరిగిన స్థలంలోనే 20 ఏండ్ల క్రితం మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహను కాంగ్రెస్‌నాయకులు హత్య చే యించారని ఆరోపించారు. అన్నా, తమ్ముడు అన్నవాళ్లే తన భర్తను చంపారంటూ శ్రీనివాస్ భార్య ఏడ్చిందని, ఆమె మొదట ఇచ్చిన ఫిర్యాదును చూసినా ఇదే విషయం తెలుస్తుందని చెప్పారు. శ్రీనివాస్‌కు అపాయం ఉన్నట్టు ఎవరికైనా ఫిర్యాదుఇచ్చారా? అని మంత్రి ప్రశ్నించారు.కాంగ్రెస్ నాయకులు లేవడంతోనే అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. జిల్లా చరిత్రలో కాంగ్రెస్‌పార్టీ వల్లే రాజకీయహత్యలు జరిగాయని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత మూడేండ్లుగా ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారని చెప్పారు.

1315
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS