పరిష్కారం దిశగా విభజన సమస్యలు!


Sat,May 25, 2019 02:32 AM

Telangana nd AP is a friendly government

-మారిన రాజకీయ పరిణామాలతో పరిస్థితి అనుకూలం
-ఏపీలో స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వం
-కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత బీజేపీ ఎంపీలదే

హైదరాబాద్, నమస్తే తెలంగాణ:సాధారణ ఎన్నికల తరువాత మారిన రాజకీయ పరిణామాలతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి సానుకూల వాతావరణం ఏర్పడినట్టయింది. ఏపీలో కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం తెలంగాణతో స్నేహపూర్వక వైఖరిని కొనసాగించే అవకాశం ఉన్నది. దీంతో రెండురాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు పరిష్కారమవుతాయనే అశాభావం సర్వత్రా వ్యక్తమవుతున్నది. రాష్ట్ర విభజన తరువాత 2014లో ఏపీ సీఎం పదవి చేపట్టిన చంద్రబాబునాయుడు.. తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంతో శత్రుపూరిత వైఖరి అవలంబించారు. ఏ ఒక్కసమస్య కూడా పరిష్కారం కాకుండా కొర్రీలు పెట్టారు. ఇరురాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చొరువ చూపినా.. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సమావేశాలు నిర్వహించినా అనేక సమస్యలు అలానే పెండింగ్‌లోనే ఉండిపోయాయి.

ఆస్తులు, భవనాలు.. చివరకు ఉమ్మడి రాష్ట్ర అకౌంట్‌కు కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా తెలంగాణకు తిరిగి ఇవ్వకుండా ఏపీ తనవద్దే ఉంచుకున్నది. ఏపీ రాజధానిని హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చిన తరువాత సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఏపీ శాఖాధిపతుల ప్రధాన కార్యాలయాలు విజయవాడ, గుంటూరుకు తరలివెళ్లాయి. ఆ భవనాలన్నీ హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్నాయి. ఐదేండ్లుగా ఈ భవనాల నిర్వహణను కూడా పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వాటిని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తే ఇక్కడి ప్రజలకు ఉపయోగపడేవి. అవి శిథిలావస్థకు చేరినా ఫర్వాలేదు కానీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేది లేదంటూ చంద్రబాబు సర్కారు భీష్మించుకున్నది.

అలాగే షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని సంస్థల విభజన కూడా జరుగలేదు. అనేక సంస్థల సిబ్బంది, ఆస్తుల విభజన అలాగే ఉండిపోయింది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనకు కూడా చొరువ చూపలేదు. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. తెలంగాణ ప్రభుత్వం మద్దతుతో ప్రత్యేక హోదా సాధించాలని ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వం భావిస్తున్నది. తెలంగాణలో ఏ పార్టీకి చెందిన ఎంపీలయినా ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతుఇచ్చే అవకాశం ఉన్నది. అలాగే తెలంగాణతో పూర్తి స్నేహపూర్వకంగా ఉండాలనుకుంటున్న కొత్త సీఎం జగన్మోహన్‌రెడ్డి విభజన సమస్యల శాశ్వత పరిష్కారానికి ముందుకొచ్చే అవకాశం ఉన్నది. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చే బాధ్యత రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలపై ఉన్నది. అన్నిరకాల సానుకూల వాతావరణం ఉన్న నేపధ్యంలో పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలన్నీ పరిష్కారమవుతాయనే ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతున్నది.

2992
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles