పలుకుబడుల భాష తెలంగాణ


Fri,September 9, 2016 01:18 AM

Telangana Language Day as kaloji narayana rao birth anniversary

-ఎవని వాడుక భాష వాడు రాయాలె అన్న కాళోజీ
-నేడు తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తె అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నేనెన్నోసార్లు చెప్పిన. భాష రెండు తీర్లు.. ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. పలుకుబడుల భాష గావాలె.. అన్ని రకాల ఆధిపత్యాలపై, అన్యాయాలపై తిరుగుబాటు చేసిన ధిక్కార స్వరం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పలుకులివి. తెలంగాణ ఉద్యమంలో భాష కూడా కీలకమైన ఆయుధం. తెలంగాణది భాషే కాదని ఎక్కిరించిండ్రు నాటి వలసాంధ్రవాదులు. ఇక్కడి సాహితీవేత్తలు తమదైన స్వరాన్ని వినిపించారు. సురవరం, వట్టికోట, దాశరథి తదితర కవులు, రచయితలు తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పారు. స్వరాష్ట్ర సాధనతో తెలంగాణపై కోస్తాంధ్ర పెత్తనానికి కాలం చెల్లింది. కొత్త ప్రభుత్వం తెలంగాణ భాషా సంస్కృతులకు పట్టంగడుతున్నది.

kaloji
ఆ దిశలోనే కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది. పద్మవిభూషణ్ బిరుదు కన్నా ప్రజాకవి అన్న బిరుదే గొప్పదని ప్రకటించిన కాళోజీ ప్రజల భాషనే అనుసరించాలన్నారు. వరంగల్‌లో కాళోజీ ఫౌండేషన్ చాలాకాలంగా ఆయన జయంతిని తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నది. ప్రభుత్వమే అధికారికంగా కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది. కాళోజీ అంటే ధిక్కారం. ఆయన అన్యాయాన్ని సహించలేడు. అది భాష విషయంలోనైనా.. బతుకు విషయంలోనైనా. అందుకే.. అన్ని ఉద్యమాల్లోనూ ముందున్నాడు. ఆర్య సమాజ్, ఆంధ్ర సారస్వత పరిషత్తు, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభ, విశాలాంధ్ర, తెలంగాణ, పౌరహక్కుల ఉద్యమాల్లో ఎక్కడ చూసినా కాళోజీ కనిపిస్తాడు.

తెలంగాణ ఆత్మ


భాష పట్ల వివక్షను కాళోజీ ఏ రోజూ సహించలేదు. పరభాషా వ్యామోహం తగదని హెచ్చరించాడు. విశాలాంధ్ర ఉద్యమాన్ని సమర్థించిన కాళోజీ తరువాత కోస్తాంధ్ర ఆధిపత్యాన్ని తిరస్కరించాడు. వానాకాలంలోనూ చేనులెండిపోతాయని/ మండే వేసవిలో వలె ఎండలు కాస్తుంటాయని ఎవరనుకున్నారు?/ అట్లవునని ఎవరనుకున్నారు? అంటూ తెలంగాణ గొంతుక వినిపించాడు. ఆయన నా గొడవ నిత్యం మండిస్తూనే ఉంటుంది. వరంగల్ ఆయన నివాసమైనప్పటికీ హైదరాబాద్ నగరంతోనూ ఆయనకు విడదీయరాని బంధముంది. భాషా, సాంస్కృతిక రంగాల్లో ఆయన చేసిన విశేష కృషి ఇక్కడినుంచే మొదలయింది.

హైదరాబాద్‌లో వకాలత్ (లా) చదివే రోజుల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆయనకు జూనియర్. 1935లో ఆయన తెలంగాణ వైతాళిక సమితిని ప్రారంభించారు. వెల్దుర్తి మాణిక్యరావు, వెంకట రాజన్న అవధాని, గంటి లక్ష్మీనారాయణలతో కలిసి ఏర్పాటు చేసిన కళా సమితి ఆధ్వర్యంలో కవిత్వం, కథలు ప్రచురించేవారు. వేరు వేరు ప్రాంతాల నుంచి రచయితలను ఆహ్వానించి కవిత్వ పఠనం, కథా పఠనం వంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. నిజాంకాలంలో నగరంలో వెలిసిన అణా గ్రంథమాల, దేశోద్ధారక గ్రంథమాల వంటి ప్రచురణ సంస్థలు కాళోజీ సాహిత్యాన్ని ప్రచురించాయి.

సాహిత్యంలో ప్రజల భాష


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ భాష, సంస్కృతులకు కొత్త జీవమొచ్చింది. తెలంగాణ చైతన్యానికి ప్రతీకగా నిలిచిన కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది ప్రభుత్వం. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే మూడు కవితా సంకలనాలను తీసుకు వచ్చాం. కాళోజీ జయంతి సందర్భంగా మట్టి ముద్ర పేరుతో మరో కవితా సంకలనాన్ని వెలువరించనున్నాం. తెలంగాణ సాహిత్యంలో తెలంగాణ ప్రజల భాష ప్రతిఫలించేలా కృషిచేస్తున్నాం.
- మామిడి హరికృష్ణ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు

తెలంగాణ ప్రామాణిక భాషను రూపొందించాలి


కాళోజీ తెలంగాణ భాషపై కోస్తాంధ్ర భాష ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు. తెలంగాణ పలుకుబడులకు ప్రాధాన్యమిచ్చాడు. ఆత్మకథను తెలంగాణ యాసలోనే రాశాడు. ప్రభుత్వం భాషకు సం బంధించి ఒక విధానాన్ని ప్రకటించక పోవడం బాధాకరం. ఇప్పటికైనా ప్రకటించాలి. తెలంగాణ భాషా నిఘంటు నిర్మాణానికి శాశ్వత ప్రాతిపతికన ఓ కమిటీ ఏర్పాటు చేయాలి. జానపదుల నోళ్లలోని పదాలను, అన్ని వృత్తుల పదాలను, మాండలికాలను సేకరించాలి. తెలంగాణ ప్రామాణిక భాషను రూపొందించుకునే దిశగా సత్వర చర్యలు చేపట్టాలి.
- నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి

5286
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS