పసందైన పతంగుల పండుగ


Fri,January 11, 2019 02:22 AM

Telangana kite and sweet festival from  january 13th to 15th

-13 నుంచి 15 వరకు స్వీట్స్, కైట్ ఫెస్టివల్
-ప్రపంచ వేడుకకు వేదికగా హైదరాబాద్
-సంస్కృతి, సంప్రదాయాల రక్షణే లక్ష్యం
-హాజరుకానున్న దేశ విదేశీ ప్రతినిధులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ : పతంగుల పండుగకు భాగ్యనగరం ముస్తాబవుతున్నది. నాలుగేండ్ల కిందట హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన కైట్‌ఫెస్టివల్ అంతర్జాతీయఖ్యాతిని గడించింది. ఈ యేడు నిర్వహించే పండుగకు19 దేశాల నుంచి 42 ఇంటర్నేషనల్, 100మంది నేషనల్ కైట్ ఫ్లైయర్స్ రానున్నారు. 10 లక్షల మంది నింగిలో గాలిపటా ల సందడిని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. కైట్ ఫెస్టివల్ నిర్వహణలో హైదరాబాద్ నగరం అహ్మదాబాద్‌తో పోటీ పడుతున్నది. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో నిర్వహించే నాలుగో అంతర్జాయతీయ స్వీట్స్ అండ్ కైట్స్ ఫెస్టివల్‌కు దాదాపు 10లక్షల మంది హాజరవుతారని అంచనా. దానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తున్నారు.

కైట్ ఫెస్టివల్ ప్రత్యేకతలివి

బాలికా విద్యను ప్రోత్సహించాలనే నినాదంతో నిర్వహిస్తున్న కైట్ ఫెస్టివల్‌కు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. భిన్న పరిమాణం, డిజైన్లలో ఉన్న పతంగులను ప్రదర్శిస్తారు. రాత్రి సమయంలో నైట్ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ప్లాస్టిక్, ప్రమాదకరమైన మాంజాల ఊసే లేకుండా ఈ పండుగను నిర్వహిస్తున్నారు. ఫుడ్ కోర్టుల ఏర్పాటుతో పాటు హ్యాండిక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు.

నోరూరించే స్వీట్ ఫెస్టివల్

విభిన్న రకాలైన స్వీట్లను ఆరగించాలనుకునేవారి కోసం స్వీట్స్ ఫెస్టివల్ స్వాగతం పలుకుతున్నది. దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందిన దాదాపు 1200 రకాలకుపైగా స్వీట్లు ఈ ప్రదర్శనలో ఉంచుతారు. గతేడాది నిర్వహించిన స్వీట్ ఫెస్టివల్‌లో వెయ్యి రకాల స్వీట్స్‌ను ప్రదర్శించారు. దాదాపు 15 దేశాల ప్రతినిధులు వారి సంప్రదాయ స్వీట్లతో ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. దాదాపు 8లక్షల మంది పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈసారి స్వీట్ ఫెస్టివల్‌లో భాగంగా 20దేశాల ప్రతినిధులు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాదీ గృహిణులు తయారుచేసిన స్వీట్లతో పాటు ఇథియోపియా, సోమాలియా, ఇరాన్, టర్కీ, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ప్రాచుర్యం పొందిన స్వీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.

kite-festival2

సాంస్కృతిక వైవిధ్యానికి చిరునామా

జనవరి 13, 14, 15 తేదీల్లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్‌కు దాదాపు పది లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతీసంప్రదాయలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఒకవైపు పతంగులు, మరోవైపు నోరూరించే మిఠాయిలు ఉంటాయి. దీంతో పాటు నిరంతర సంగీత విభావరి కూడా ఉంటుంది. చిన్నాపెద్దా అంతా కలిసి మూడు రోజులు సంతోషంగా గడిపే వేడుక ఇది.
-బుర్రా వెంకటేశం,
తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి

1334
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles