18 నుంచి జాగృతి లీడర్‌షిప్ సదస్సు


Fri,January 11, 2019 02:20 AM

Telangana Jagruthi International Youth Leadership Conference 18th

-మూడురోజుల పాటు హైదరాబాద్‌లో నిర్వహణ
-103 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు
-సుస్థిర అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు ఇతివృత్తంగా సదస్సు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ జాగృతి సంస్థ హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మక సదస్సుకు శ్రీకారం చుట్టింది. సుస్థిర అభివృద్ధి, నూతన ఆవిష్కరణల్లో యువతను భాగస్వాములను చేస్తూ తెలంగాణ జాగృతి ఇంటర్నేషనల్ యూత్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ (టీజేఐవైఎల్‌సీ) ఈ నెల 18 నుంచి 20 వరకు జరుగనున్నది. హైటెక్స్ నోవాటెల్‌లో జరిగే ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 103 దేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన 550 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రతినిధుల రిజిస్ట్రేషన్ ఇప్పటికే పూర్తయింది. గాంధేయమార్గంలో సుస్థిర అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు ఇతివృత్తంగా సదస్సు కొనసాగనున్నది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రారంభోపన్యాసం చేస్తారు. 16 దేశాల నుంచి 70 మంది వక్తలు సదస్సులో ప్రసంగిస్తారు. 40 మంది ఇన్నోవేటర్స్ కూడా పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచదేశాలకు నిర్దేశించిన కాలుష్యం, పర్యావరణం, సముద్రంలో ఉన్న జీవరాశిని కాపాడటం, పేదరికం, మానవహక్కులను కాపాడటం, లింగవివక్షను రూపుమాపడం, భౌతిక వనరుల కాపాడటం తదితర 20 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సదస్సులో చర్చించనున్నారు. వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం, వాటిని భవిష్యత్‌తరాలకు అందించడం, నూతన ఆవిష్కరణలపై చర్చిస్తారు. ముగింపు కార్యక్రమంలో అవార్డులు అందజేయనున్నారు. 2008 నవంబర్ 3న ఏర్పాటైన తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున సంస్కృతి, సంప్రదాయాలు, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువత, మహిళలు, రైతుల కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నది. బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడంలో తెలంగాణ జాగృతి సంస్థ కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోని అనేక దేశాల్లోనూ తెలంగాణ జాగృతి కార్యకలాపాలను కొనసాగిస్తున్నది.

సమాజంలో యువతదే కీలక పాత్ర

సమాజ అభివృద్ధిలో యువతది కీలకపా త్ర. యువత కోసం అనేక కార్యక్రమాలు చేసిన తెలంగాణ జాగృతి సంస్థ ఐక్యరాజ్యసమితి సూచించిన సుస్థిర అభివృద్ధి ల క్ష్యాల అంశాలపై చర్చించేందుకు సదస్సును నిర్వహిస్తున్నది. పలు అంశాలపై వివిధ దేశాలకు చెందిన యువత చర్చించడం ద్వారా వాటికి పరిష్కార మార్గాలు, సలహాలు, సూచనలు అందనున్నాయి. రాష్ట్రంతోపాటు వివిధ దేశాల్లో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న జాగృతి సంస్థ ప్రపంచ స్థాయి సదస్సును నిర్వహిస్తున్నది. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సరికొత్త ఉత్సాహన్నిచ్చే అవకాశమున్నది.
- నవీన్ ఆచారి,తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి

1029
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles