ఐఏఎస్ అధికారి కొడుకే హంతకుడు

Tue,March 21, 2017 02:53 AM

డ్రైవర్ హత్యకేసులో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల నిర్ధారణ

యూసుఫ్‌గూడలో జరిగిన డ్రైవర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఘటనాస్థలంలో లభించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఐఏఎస్ అధికారి కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలు, ఆయా వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు జరుపుతున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రెండురోజులక్రితం జరిగిన హత్య ఘటనలో పోలీసులు ఓ ఐఏఎస్ అధికారి కొడుకును సోమ వారం అదుపులోకి తీసుకున్నారు. తమ వద్ద డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తిని హత్య చేసి, శవాన్ని ముక్కలుగా కోసి తరలించే ప్రయత్నంలో అపార్ట్‌మెంట్‌వాసుల కంటపడి పారిపోయిన నిందితుడిని పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. శవాన్ని తరలించే ఆలోచన వెనుక ఐఏఎస్ అధికారి ప్రమే యం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి ధరావత్ వెంకటేశ్వర్లు, అనిత దంపతులకు ఇద్దరు కొడుకులు. దంపతులిద్దరూ ఆరేండ్ల క్రితమే విడిపోయారు. న్యాయవాది అయిన అనిత కొడుకులిద్దరితో మధురానగర్‌లో నివాసముంటున్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దుబ్బతండాకు చెందిన భూక్యా నాగరాజు, అతని భార్య జమున జీవనోపాధి కోసం నగరానికి వచ్చి యూసుఫ్‌గూడలోని సాయికల్యాణ్ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేశారు.
nagaraju
రెండేండ్లుగా అనిత వద్ద నాగరాజు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమె పెద్ద కొడుకు వెంకట్‌సుక్రీత్‌తో స్నేహం ఏర్పడింది. ఇద్దరూ కలిసి మద్యం సేవించేవారు. ఈనెల 17వ తేదీన రాత్రి ఇద్దరూ కలిసి నాగరాజు పనిచేసిన సాయికల్యాణ్ అపార్ట్‌మెంట్ టెర్రస్‌పైకి మద్యం సేవించేందుకు వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అది పెరిగి పెనుగులాటకు దారితీసింది. ఈ క్రమంలో వెంకట్ నాగరాజును బలంగా తోసేశాడు. నాగరాజు బోర్లాపడి తలకు, ముఖానికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వెంకట్ నాగరాజు మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి పక్కకు లాగేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు రాత్రి 11 గంటలకు ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించేందుకు అపార్ట్‌మెంట్ లిఫ్టు వద్దకు తీసుకొచ్చాడు. అపార్ట్‌మెంట్ వాసులు గోనెసంచిని చూసి అనుమానించి ప్రశ్నించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించడంతో 17న వెంకట్, నాగరాజులు అక్కడికి రావడం, తిరిగి వెళ్లేటప్పుడు వెంకట్ ఒక్కడే ఉండటం, 18న మళ్లీ రావడం అన్నీ రికార్డయ్యాయి. దీంతో చనిపోయింది నాగరాజు అని, హత్య చేసింది వెంకట్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతుడు నాగరాజు బంధువులు సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ హత్యకు కారణం తాత్కాలిక ఆవేశమా, లేక అనైతిక సంబంధంతో పథకం ప్రకారం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. హత్య జరిగిన అనంతరం నిందితుడు ఎవరెవరితో మాట్లాడాడు, ఎక్కడెక్కడ తిరిగిడో ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు. హత్య జరిగిన విషయం తెలిసి, శవాన్ని తరలించాలని కొడుకుకు సలహా ఇచ్చినట్లు ఆధారాలు లభిస్తే ఐఏఎస్ అధికారిని కూడా నిందితునిగా చేర్చే అవకాశాలున్నాయి.
nagaraju2

3230

More News

మరిన్ని వార్తలు...