మున్సిపోల్స్‌కు పచ్చజెండా

Wed,October 23, 2019 03:14 AM

-131 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలకు మార్గం సుగమం
-జాబితాల్లో తప్పులను పిటిషనర్లు నిరూపించలేదు
-ఎన్నికల ప్రక్రియపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
-ప్రీ ఎలక్షన్ ప్రాసెస్‌కు కనిష్ఠ సమయం లేదని స్పష్టీకరణ
-ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని వెల్లడి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని 131 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. ఎన్నికలకు ముందు ఆయా మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన ప్రీ ఎలక్షన్ ప్రాసెస్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని, ఎన్నికల ప్రక్రియకు సింగిల్ జడ్జి ధర్మాసనం వద్ద మూడునెలలకు పైగా సమయం తీసుకుని ఎనిమిది రోజుల్లో ప్రక్రియను ముగించారని పేర్కొంటూ దాఖలైన రెండు వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం కొట్టేసింది.

ఈ కేసులో ఈ నెల 1న తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం.. మంగళవారం తుది ఉత్తర్వులను వెలువరించింది. మిగిలిన ఎన్నికల ప్రక్రియను చేపట్టవచ్చని తీర్పు రిజర్వు చేస్తున్న సందర్భంగానే ధర్మాసనం స్పష్టంచేసింది. సింగిల్ జడ్జి వద్ద తీసుకున్న 119 రోజులు గరిష్ఠ సమయమని, కనిష్ఠంగా ఎన్నిరోజుల్లో వార్డుల విభజన, ఇతర ప్రక్రియలు చేపట్టాలనే విషయం సింగిల్ జడ్జి ఆదేశాల్లో లేదని తాజా తీర్పులో పేర్కొన్నది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఎన్నికల ప్రక్రియను చేపట్టిందని అదనపు అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు చేసిన వాదనలను ధర్మాసనం సమర్థించింది.

మరోవైపు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జెడ్ (జీ) ప్రకారం ఎన్నికల విషయాల్లో కోర్టుల జోక్యంపై నిషేధం ఉన్న విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. కేవలం ఎన్నికల పిటిషన్లు తప్ప మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ఎన్నికల ప్రక్రియ అంశాలను కోర్టుల్లో సవాల్‌చేయజాలరని రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నదని గుర్తుచేసింది. ఓటర్ల జాబితాల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపులో తప్పులు జరిగినట్లు పిటిషనర్లు ఎక్కడా నిరూపించలేకపోయారని ధర్మాసనం తెలిపింది. ఇవి నిరాధార ఆరోపణలేనని స్పష్టంచేసింది. తమను తప్పుడు క్యాటగిరీలో గుర్తించారని ఏ ఒక్క ఓటరు కోర్టుకు రాలేదన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నది.

ఎన్నికల జాబితాల ఖరారు అంశం గురించి ప్రస్తావిస్తూ.. తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ సెక్షన్ 11 ప్రకారం ఓటర్ల జాబితాల ను రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఎలక్షన్ క్యాలెండర్ ఇచ్చే ముందు ఖరారుచేస్తుందని, ఈమేరకు ఎస్‌ఈసీకి అధికారం ఉందని తెలిపింది. నిబంధనల ప్రకారం అసెంబ్లీ ఎ న్నికలకు సిద్ధంచేసిన ఓటర్ల జాబితాల ఆధారంగానే మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాలను ఎస్‌ఈసీ సిద్ధంచేస్తుందని పేర్కొన్నది. పిటిషనర్లు ఏ ఒక్క ఆరోపణను నిరూపించలేకపోయినందున పిటిషన్లను కొట్టేస్తున్నామని ప్రకటించింది.

ఈ సందర్భంగా సింగిల్ జడ్జి ధర్మాసనం వద్ద పెండింగ్‌లో ఉన్న పలు మున్సిపాలిటీల పిటిషన్ల అంశాన్ని ఏఏజీ జే రామచంద్రరావు ద్విసభ్య ధర్మాసనం ఎదు ట ప్రస్తావించారు. వాటిని అక్కడే ప్రస్తావిం చి.. సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు వ్యవహరించాలని ధర్మాసనం పేర్కొన్నది. వార్డుల విభజన సక్రమంగా లేదని ఆయా మున్సిపాలిటీలకు చెందినవారు గతంలో వేర్వేరు రిట్ పిటిషన్లు దాఖలుచేశారు. నిబంధనల ప్రకారం వార్డుల విభజనలో పొరపాట్లు ఉంటే సరిచేసుకొని, నిర్దేశిత ప్రక్రియ ప్రకారం ముందుకు వెళ్లొచ్చని సింగిల్ జడ్జి ధర్మాసనం గతంలో ఆదేశాలు జారీచేసింది. ద్విసభ్య ధర్మాసనం ఎదుట ఉన్న కేసులలో తీర్పు వెలువడిన నేపథ్యంలో సింగిల్ జడ్జి వద్ద కేసులు త్వరలో విచారణకు రానున్నాయి.

ఎన్నికల నిర్వహణకు 20 రోజులు..

వార్డుల విభజన, ఓటర్ల జాబితాల ప్రకటన, వార్డులవారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు, పోలింగ్‌స్టేషన్ల గుర్తింపు, ఎన్నికల సామగ్రి పంపిణీ, ఎన్నికల సిబ్బంది కేటాయింపు- శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ వంటి అన్ని ప్రక్రియలు పూర్తికాగా, వార్డులవారీ, చైర్‌పర్సన్ల రిజర్వేషన్ల ఖరారు చేయాల్సి ఉన్నదని ప్రభుత్వం గతంలో వాదనల సందర్భంగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణకు తాము కట్టుబడి ఉన్నామని, ఓటర్ల జాబితా ప్రకటనకు ఏడు రోజులు, ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లు, ఉపసంహరణ వంటి ప్రక్రియలకు కలిపి 20రోజులు సమ యం కావాలని ఎస్‌ఈసీ పేర్కొన్నది.

1666
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles