పారిశ్రామీకరణ కొత్త పుంతలు

Thu,December 5, 2019 03:14 AM

-త్రీ ఐ విధానంతో ముందుకు..
-పరిశ్రమల భూములు దుర్వినియోగం చేస్తే వెనక్కి తీసుకుంటాం
-రాష్ట్రంలో గ్రీన్, వైట్, బ్లూ, పింక్ రెవల్యూషన్లు
-ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు
-టీఎస్‌ఐపాస్ ఐదు వసంతాల ఉత్సవం
-ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల
-రాయితీలకు రూ.305 కోట్ల చెక్కు అందజేత

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పారిశ్రామీకరణ కొత్తపుంతలు తొక్కాల్సిన అవసరం ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో గ్రీన్, బ్లూ, వైట్, పింక్ విప్లవాలు రానున్నాయని తెలిపారు. టీఎస్‌ఐపాస్ ఐదు వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం మాదాపూర్ శిల్పకళావేదికలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలు, శాఖలవారీగా ఎంపికచేసినవారికి మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. టీఎస్‌ఐపాస్ సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని చెప్పారు. టీఎస్‌ఐపాస్ క్రెడిట్ అంతా ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కరంటు కోసం పారిశ్రామికవేత్తలు సైతం ధర్నాలుచేశారని.. అలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి అన్నిరంగాలకు 24 గంటల విద్యుత్‌ను సరఫరాచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌లు అని సీఎం ఎప్పుడూ చెపుతుంటారని.. ఆ స్ఫూర్తితో రాష్ట్రంలో త్రీ ఐ విధానాన్ని అమలుచేస్తున్నామన్నారు. నవీన ఆవిష్కరణలు (ఇన్నోవేషన్), మౌలిక సదుపాయాలు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్), సమ్మిళిత అభివృద్ధి (ఇంక్లూజివ్ గ్రోత్)తో ముందుకెళుతున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించిన వారికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నామని.. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీల కోసం రూ.305 కోట్ల చెక్కు అందించినట్టు తెలిపారు.

పారిశ్రామిక రాయితీలపై కొందరిలో తప్పుడు అభిప్రాయం ఉన్నదని.. ఒక కంపెనీకి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడమంటే ఒక వ్యక్తికి ఇస్తున్నట్టు కాదని, అందులో పనిచేసే ఉద్యోగులందరికీ ఇస్తున్నట్టేనని చెప్పారు. ఉపాధి కల్పించే వాటిల్లో 70 శాతం ఎమ్మెస్‌ఎంఈ పరిశ్రమలే ఉంటాయని.. భారీ పరిశ్రమలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. ఇందులోభాగంగానే హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. దీనికోసం ఇప్పటికే 10 వేల ఎకరాలు సేకరించామని, మరో 2 వేల ఎకరాలు సేకరించగానే కంపెనీలకు కేటాయింపులు చేస్తామన్నారు. అవినీతి తగ్గితే కాస్ట్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గుతుందని.. టీఎస్‌ఐపాస్ ద్వారా అవినీతి తగ్గిపోయిందని తెలిపారు. టీఎస్‌ఐపాస్ ద్వారా 11 వేలకుపైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, వీటిద్వారా 13 లక్షల మందికి ఉద్యోగాలు, రూ.1.76 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ వివరించారు.

రెండో హరితవిప్లవం సీఎం కేసీఆర్ స్వప్నం

రాష్ట్రంలో రెండోహరిత విప్లవం సీఎం కేసీఆర్ స్వప్నమని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంతో పంట దిగుబడి పెరిగిందన్నారు. కరీంనగర్ జిల్లాలో 2013-14కు 2019-20 నాటికి వరి దిగుబడి ఐదింతలు పెరిగిందని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్‌రంగం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. పంటల దిగుబడి (గ్రీన్ రెవల్యూషన్), పాడి ఉత్పత్తి (వైట్ రెవల్యూషన్), చేపల పెంపకం, ఆక్వా కల్చర్ (బ్లూ రెవల్యూషన్), మాంసం ఉత్పత్తి (పింక్ రెవల్యూషన్) ద్వారా తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో డ్రైపోర్టు, మరో ఎయిర్‌పోర్ట్ రావాల్సి అవసరం ఉన్నదని చెప్పారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ..తాను పాల వ్యాపారం చేశానని.. ఇప్పుడు రెండు వైద్య, 13 ఇంజినీరింగ్ కాలేజీలు, 10 సీబీఎస్‌ఈ స్కూల్స్ ఏర్పాటుచేశానని, కష్టపడితే ఏదైనా సాధ్యమేనని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, పరిశ్రమల కమిషనర్ నదీమ్ అహ్మద్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నరసింహారెడ్డి, సీఐఐ అధ్యక్షుడు రాజు, మాజీ అధ్యక్షుడు రాజన్న, టీఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, సుధాకర్ పైప్స్ అధినేత మీలా జయ్‌దేవ్, ఎలిప్ అధ్యక్షురాలు రమాదేవి, అదనపు సంచాలకులు రాజ్‌కుమార్ వోడ్కర్, సంయుక్త సంచాలకులు రాజేశ్వర్‌రెడ్డి, ప్రశాంత్, ఖలీల్, శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

పర్యావరణహితంగా పారిశ్రామికీకరణ

పారిశ్రామికీకరణ పర్యావరణహితంగా ఉండాలని, కాలుష్యంపై మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ నుంచి పరిశ్రమలను ఔటర్ రింగ్‌రోడ్ అవతలికి తరలించడానికి 13 ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. పరిశ్రమలకు కేటాయించిన భూములను దుర్వినియోగంచేస్తే వెనక్కు తీసుకుంటామని హెచ్చరించిన కేటీఆర్.. ఈ విధంగా రియల్ ఎస్టేట్‌కు మళ్లించిన 1200 ఎకరాలను వెనక్కి తీసుకున్నట్టు చెప్పారు. కేంద్రం ఈవోడీబీ ర్యాంకులు పెట్టడంతో రాష్ట్రాల మధ్య పోటీపెరిగినట్టే.. రాష్ట్రంలోనూ జిల్లాల మధ్య ఈవోడీబీ ర్యాంకులపై పోటీఉండేలా కొత్త విధానాన్ని అమలుచేస్తామని, దీనిపై కలెక్టర్లతో మాట్లాడిన మార్గదర్శకాలను ఖరారు చేయనున్నట్టు తెలిపారు.

733
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles