పంచాయతీ పోరు మూడు విడుతల్లో !


Sun,December 16, 2018 02:20 AM

Telangana Gram panchayat Elections 3rd or 5th of Next Month

-ఎన్నికలపై ఆర్డినెన్స్ జారీ
-బీసీలకు 34%!
-వచ్చే నెల 3 లేదా 5వ తేదీల్లో తొలివిడుత
-చిన్న జిల్లాల్లో రెండు విడుతలుగా
-ఎన్నికల నిర్వహణపై నిరంతర సమీక్షలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ : పంచాయతీ ఎన్నికలను మూడు విడుతల్లో నిర్వహించనున్నారు. చిన్న జిల్లాల్లో రెండు విడుతల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పోలింగ్‌కేంద్రాల భద్రత, సిబ్బంది నియామకంపై త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.చిన్న జిల్లాల ఏర్పాటుతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సులభతరమైంది. చిన్న జిల్లాల్లో వారం, పది రోజుల వ్యవధిలో రెండు విడుతల్లో ఎన్నికలు పూర్తి చేయనున్నారు. జోగుళాంబ గద్వాల, జనగాం, వనపర్తి, కరీంనగర్, వరంగల్ అర్బన్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రెండు విడుతల్లో ఎన్నికలను పూర్తి చేయనున్నారు. మిగిలిన జిల్లాల్లో మూడు విడుతల్లో స్థానిక ఎన్నికలను నిర్వహిస్తారు. 2013 ఎన్నికల సమయంలో 8,684 పంచాయతీలు, 88,682 వార్డులున్నాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి రావటంతో 4,383 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలతోపాటు కొత్తగా ఏర్పాటైన నగర పంచాయతీలు పోగా.. 12,751 పంచాయతీలు 1,13,380 వార్డులున్నాయి.

వచ్చేనెల 3 లేదా 5వ తేదీల్లో తొలివిడుత

వచ్చేనెల 3 లేదా 5వ తేదీల్లో తొలివిడుత ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. జనవరి 10లోగా పంచాయతీ ఎ న్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో ఆ మేరకు ఏర్పాట్లు సాగుతున్నట్టు సమాచారం. వచ్చేనెల మూడోవా రంలోగా వీటిని పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.

భద్రతా ఏర్పాట్లు ఇలా

ఎన్నికలు జరుగనున్న గ్రామాలను మూడు విభాగాలుగా గుర్తించి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 59,886 మంది సివిల్, 22వేల మంది ఆర్మ్‌డ్ పోలీసులు, 15వేల మంది టీఎస్‌ఎస్పీ, 17,944 మంది హోంగార్డులు, 12,271 మంది కెడెట్ పోలీసుల సేవలు వినియోగించనున్నారు. పోలింగ్ కేంద్రాల విధులతోపాటు అదనంగా మొబైల్ ైస్ట్రెక్ ఫోర్స్, రోడ్ ఓపెనింగ్ పార్టీలు, రూట్ మొబైల్ పార్టీలను సైతం వినియోగించనున్నారు.

బ్యాలెట్ బాక్సులు సిద్ధం

ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్‌బాక్సులు సిద్ధం చేసినట్టు ఈసీ వెల్లడించింది. ప్రస్తుతం 1.01లక్షల బ్యాలెట్ బాక్స్‌లుండగా వాటిలో కొన్ని పనికికి రాకుండా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రతి వార్డుకూ ఒక బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిలోనే వార్డు స్థానానికి, సర్పంచ్‌కు ఓటు వేయాల్సి ఉంటుంది. కొన్ని బాక్స్‌లను రిజర్వులో ఉంచుతారు. అత్యవసర సమయాల్లో వాటిని వినియోగిస్తారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న బ్యాలెట్ బాక్స్‌ల కన్నా అదనంగా 15వేల బ్యాలెట్ బాక్స్‌లు అవసరముండటంతో వాటిని కర్ణాటక నుంచి తెప్పించారు. పోలింగ్ కేంద్రాలన్నీ ప్రభుత్వ పాఠశాలల్లోనే ఏర్పాటు చేయనున్నారు. ఎక్కువ వార్డులున్న చోట అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అంశాలను పరిశీలించాలని విద్యాశాఖ డైరెక్టర్‌కు ఈసీ అధికారులు సూచించారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది సేవలను వినియోగిస్తారు. రెవెన్యూ, అంగన్‌వాడీ, వైద్యశాఖల సిబ్బంది సేవలను సైతం వినియోగించుకోనున్నారు.

పంచాయతీ ఎన్నికల కోసం ఆర్డినెన్స్

రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు త్వరితగతిన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆర్డినెన్స్ జారీచేసింది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అమలుచేసి, కొత్త గ్రామాలను ఏర్పాటుచేసింది. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రక్రియను కూడా పూర్తిచేసింది. పంచాయతీ ఎన్నికలు త్వరగా పూర్తిచేసేందుకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 20.46 శాతం, ఎస్టీలకు ఏజెన్సీ గ్రామాలతోపాటు వందశాతం గిరిజన గ్రామాలు, మైదాన ప్రాంతాల్లో 5.73 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని సమాచారం.

9187
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles