హైపవర్‌ కమిటీ వద్దు

Thu,November 14, 2019 04:28 AM

-సమ్మె అంశం లేబర్‌ కమిషనర్‌ వద్ద ఉన్నది
-ఐడీ యాక్ట్‌లో కమిటీ ప్రస్తావన లేదు
-ఎస్మా ప్రకారం ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధం
- హైకోర్టుకు స్పష్టంచేసిన రాష్ట్ర ప్రభుత్వం
-ఆర్టీసీ యాక్ట్‌ కంటే పునర్విభజన చట్టమే అత్యున్నతం
-టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్రం అనుమతి అక్కర్లేదు
-హైకోర్టులో ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు
-విచారణ 18కి వాయిదా.. రూట్ల ప్రైవేటీకరణపై నేడు విచారణ
-ఆర్టీసీ అత్యవసర సర్వీస్‌ జీవోను ఆరునెలలకోసారి పొడిగిస్తున్నారు
-హైకోర్టులో విచారణ నేపథ్యంలో ప్రభుత్వం ముందడుగు వేయలేదు
-విషయంపై ముందుకు వెళ్లేలా లేబర్‌ కమిషనర్‌కు ఆదేశాలివ్వండి
- హైకోర్టు ఆదేశిస్తే నాలుగువారాల్లో రిఫరెన్స్‌పై చర్యలు: ఏజీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:ఆర్టీసీ యాజమాన్యం, కార్మికసంఘాల మధ్య తలెత్తిన పారిశ్రామిక వివాదాన్ని పరిష్కరించేందుకు హైకోర్టు ప్రతిపాదించిన ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల హైపవర్‌ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం విముఖత వ్యక్తంచేసింది. సమ్మె అంశం లేబర్‌ కమిషనర్‌ పరిధిలో ఉన్నందున ప్రస్తుత దశలో హైపవర్‌ కమిటీ ఏర్పాటుకు అంగీకరించలేమని బుధవారం విచారణ సందర్భంగా ప్రభుత్వ సీఎస్‌ ఎస్కే జోషి తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. సదరు అఫిడవిట్‌ను చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనానికి అడ్వకేట్‌ జనరల్‌ బండా శివానందప్రసాద్‌ సమర్పించారు. ఈ సందర్భంగా ఏజీ వాదనలు వినిపిస్తూ ఇండస్ట్రియల్‌ డిస్ప్యూట్స్‌ యాక్ట్‌ (ఐడీ యాక్ట్‌) ప్రకారం వ్యవహరిస్తామని, ఐడీ యాక్ట్‌లో కమిటీల ప్రస్తావన లేదని తెలిపారు. పారిశ్రామిక వివాదాలను పరిష్కరించేందుకు ఐడీ యాక్ట్‌లో అన్నిరకాల పరిష్కార మార్గాలు, వ్యవస్థలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఆర్టీసీ అత్యవసర సర్వీసు

ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని అడ్వకేట్‌ జనరల్‌ బండా శివానందప్రసాద్‌ స్పష్టంచేశారు. ఎసెన్షియల్‌ సర్వీసెస్‌ మెయింటెనెన్స్‌ యాక్ట్‌ (ఎస్మా) సెక్షన్‌ 2 (1) (ఏ) ప్రకారం రోడ్డురవాణా కూడా అత్యవసర సర్వీస్‌గా ఉన్నదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎస్మా ప్రకారం పబ్లిక్‌ యుటిలిటీ సర్వీసులన్నీ అత్యవసర సర్వీసులేనని స్పష్టంచేశారు. ఆర్టీసీని అత్యవసర సర్వీస్‌గా గుర్తిస్తూ 2015లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసిందని పేర్కొన్నారు. సదరు జీవో ఆరునెలల కాలానికి జారీచేశారని, దానిని అలాగే ఆరునెలలకు ఒకసారి ప్రభుత్వం పొడిగిస్తున్నదని తెలిపారు. దీంతోపాటు ఆర్టీసీని అత్యవసర సర్వీసుగా గుర్తిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1998లో జీవో నంబర్‌ 180ని అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి టీఎస్‌ఆర్టీసీ ఏర్పడినందున ఆ జీవో అలాగే కొనసాగుతుందని, ఈ లెక్కన ఆర్టీసీ ఇప్పటికీ అత్యవసర సర్వీసు కిందనే ఉన్నదని తెలిపారు. ఎస్మా ప్రకారం అత్యవసర సేవల్లో ఉన్నవారు సమ్మె చేయరాదని, కనుక ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని వాదించారు. పబ్లిక్‌ యుటిలిటీ సర్వీసులన్నీ ఎస్మా కిందకి వస్తాయని పేర్కొన్నారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. టీఎస్‌ఆర్టీసీకి గుర్తింపులేదని కేంద్రప్రభుత్వం చెప్తున్నదని పేర్కొంటూ.. టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటుకు కేంద్రం అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది. తీసుకుంటే అనుమతులు చూపాలని కోరింది. ఆర్టీసీ యాక్ట్‌ సెక్షన్‌ 3 ప్రకారం టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేకసంస్థగా ఏర్పాటుచేసినప్పుడు ఏపీఎస్‌ఆర్టీసీ జీవోలు టీఎస్‌ఆర్టీసీకి ఎలా వర్తిస్తాయి? ఏపీఎస్‌ఆర్టీసీ ఆస్తుల విభజనను ఎలా కోరుతారు? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఏజీ వాదనలు వినిపిస్తూ.. ఆర్టీసీ యాక్ట్‌ సెక్షన్‌ 3 ప్రకారం టీఎస్‌ఆర్టీసీని ఏర్పాటుచేశామని తెలిపారు. కేంద్రం అనుమతి తీసుకోవాలని చెప్తున్న సెక్షన్‌ 47ఏ టీఎస్‌ఆర్టీసీకి వర్తించదని అన్నారు. కార్పొరేషన్ల విభజనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాలకు ప్రత్యేకమైన ఏపీ పునర్విభజన చట్టం అమలులో ఉన్నదని, తొమ్మిదో షెడ్యూల్‌ సంస్థల్లో ఉన్న ఆర్టీసీ ఆస్తులు, అప్పుల విభజన గురించి పునర్విభజన చట్టంలో ఉన్నదని పేర్కొన్నారు. ఆర్టీసీ చట్టం కేంద్ర చట్టం అయినప్పటికీ.. ఏపీ పునర్విభజన చట్టం ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు ప్రత్యేక చట్టమని తెలిపారు.

కేంద్ర చట్టమైన ఆర్టీసీ యాక్ట్‌ కంటే ఏపీ పునర్విభజన చట్టమే అత్యున్నతమని పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం చేసిందని అడ్వకేట్‌ జనరల్‌ ధర్మాసనానికి గుర్తుచేశారు. ఆర్టికల్‌ 3 కింద చట్టాలు చేయడానికి పార్లమెంట్‌కు అత్యున్నత అధికారాలు దఖలుపడ్డాయని, ఆర్టికల్‌ 3 కింద పార్లమెంట్‌ చేసిన చట్టాలను కోర్టుల్లో ప్రశ్నించజాలరని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఏపీఎస్‌ఆర్టీసీ ఆస్తుల, అప్పుల విభజన జరుగుతుందని, షెడ్యూల్‌ 9 సంస్థలు ప్రాంతాన్ని బట్టి ఉనికిలోకి వస్తాయని వివరించారు. జనాభా నిష్పత్తి ప్రకారం ఆస్తుల, అప్పుల విభజన జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్టీసీ యాక్ట్‌ సెక్షన్‌ 3 ప్రకారం ఏర్పాటు చేసినప్పటికీ టీఎస్‌ఆర్టీసీకి పునర్విభజన చట్టమే వర్తిస్తుందని, ఈ నేపథ్యంలో కేంద్రం అనుమతి అవసరం లేదని తెలిపారు. ఆర్టీసీ విభజన ఏపీ పునర్విభజన చట్టం కింద కవర్‌ అయినందున ఆర్టీసీ యాక్ట్‌ వర్తించదని అంటున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించగా.. అవునని ఏజీ సమాధానం చెప్పారు. ఆర్టీసీపై సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయని ఏజీ స్పష్టంచేశారు. మన దేశం ఫెడరల్‌ స్టేట్‌ అయినందున అంతిమంగా అన్ని అధికారాలు కేంద్రానివే కదా? అని ధర్మాసనం ప్రశ్నించగా.. అందుకే ఆర్టీసీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్కీంకు కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా ఆమోదం తెలుపుతుందని, సదరు ఆమోదం కేవలం లాంఛనం మాత్రమేనని ఏజీ పేర్కొన్నారు. ఆర్టీసీకి సంబంధించి పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 68, 58లలో పేర్కొన్న అంశాలే అంతిమమని స్పష్టంచేశారు. ఐడీ యాక్ట్‌ సెక్షన్‌ 10 (ఏ) పేర్కొంటున్న ఆర్బిట్రేషన్‌ ప్రొసీడింగ్స్‌ అనేది కేవలం సంప్రదింపులకు సంబంధించిన అంశమని, అంతేగానీ తప్పనిసరికాదని స్పష్టంచేశారు. సమ్మె అంశాన్ని పరిష్కరించేది లేబర్‌ కోర్టు మాత్రమేనని.. విషయాన్ని లేబర్‌ కోర్టుకు రిఫర్‌ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

కమిటీల పరిధి పరిమితం

వివాదాల పరిష్కారంలో ఏర్పాటుచేసే కమిటీలకు పరిధి చాలా పరిమితంగా ఉంటుందని ధర్మాసనానికి ఏజీ వివరించారు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 కేసులో సుప్రీంకోర్టు ఇదే అంశాన్ని ధ్రువీకరించిందని పేర్కొన్నారు. అడ్వకేట్‌ల కమిటీ ఏర్పాటును సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టిందని గుర్తుచేశారు. వివాద పరిష్కారానికి ఐడీ యాక్ట్‌లో అన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయని తెలిపారు.

నాలుగువారాల్లో చర్యలు

ఆర్టీసీ సమ్మె అంశం హైకోర్టులో ఉన్నందున ప్రభుత్వం ముందుకు వెళ్లలేదని తెలిపిన ఏజీ.. తదుపరి చర్యల కోసం లేబర్‌ కమిషనర్‌కు ఆదేశాలు జారీచేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత నాలుగువారాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నాలుగువారాల్లో కాంపిటెంట్‌ అథారిటీకి రిఫర్‌చేయాలని, రిఫర్‌చేయని పక్షంలో ఎందుకు రిఫర్‌చేయలేదో వివరణ ఇస్తామని తెలిపారు.

సమ్మెకు వెళ్లిన విధానమే చట్టవిరుద్ధం: ఏఏజీ

ఆర్టీసీ యాజమాన్యం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ జే రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ సమ్మె చట్టబద్ధమా? విరుద్ధమా? అనే అంశం కంటే అసలు సమ్మెకు వెళ్లిన విధానమే చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ దశలో జోక్యంచేసుకున్న ధర్మాసనం.. కాంపిటెంట్‌ అథారిటీ అయిన ఇండస్ట్రియల్‌ ట్రిబ్యునల్‌ లేదా లేబర్‌ కోర్టు ఏమీ తేల్చకుండా చట్టవిరుద్ధమని మీరు ఎలా చెప్తారని ఏఏజీని ప్రశ్నించింది. కార్మికసంఘాల డిమాండ్లు చట్టసమ్మతమా? కాదా? అనే విషయంలోనే సమ్మె చట్టవిరుద్ధమని తెలిసిపోతున్నదని, సమ్మె నోటీసు దశ నుంచి చర్చల ప్రక్రియవరకు కార్మికసంఘాలు చట్టంలోని నిబంధనలను పాటించలేదని పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చిన ఆరువారాల తర్వాత సమ్మెకు వెళ్లాలని, కానీ.. చర్చల ప్రక్రియ ముగిసిన మరుసటిరోజే సమ్మెకు వెళ్లారని, కనీసం 7 రోజుల సమయం ఇవ్వాలన్న నిబంధన ఐడీ యాక్ట్‌లో ఉన్నదని తెలిపారు. ‘సిండికేట్‌ బ్యాంక్‌ వర్సెస్‌ ఉమేశ్‌నాయుడు’ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇదే అంశాన్ని స్పష్టంచేస్తున్నది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఏఏజీ వాదనలు కొనసాగుతుండగా కోర్టు సమయం ముగియడంతో ధర్మాసనం విచారణను ముగించింది. వ్యక్తిగత కారణాలవల్ల అందుబాటులో ఉండటం లేదని కార్మికసంఘాల తరఫు సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకురావడంతో సమ్మె కేసులను ఈ నెల 18వ తేదీకి, రూట్ల ప్రైవేటీకరణపై క్యాబినెట్‌ నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

రూ.47 కోట్లతో సమస్య పరిష్కారం కాదు

రూ.47 కోట్లు ఇచ్చే అంశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్‌లోని అంశాలను ఏజీ ప్రస్తావించారు. రూ.47 కోట్లతో సమస్య పరిష్కారంకాదని, ఆర్టీసీ రూ.2,209 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉన్నదని తెలిపారు. కార్మికసంఘాలు మొండివైఖరితో వ్యవహరిస్తున్నాయని తెలిపారు. శాంతిభద్రతల కోణంలో అత్యంత కీలకమైన అయోధ్య తీర్పు సందర్భంగా శాంతిభద్రతలకు తీవ్ర ఆటంకం కల్పించారని, బతుకమ్మ, దసరా, దీపావళి వంటి ముఖ్యమైన పండుగల సందర్భంగా సమ్మె చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతోపాటు ఆర్టీసీకి మరిన్ని నష్టాలు వచ్చేలా చేశారని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 67% వేతనాలను ప్రభుత్వం పెంచిందని తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి సంఘాలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తాత్కాలిక సిబ్బందితో రవాణా ఏర్పాట్లు చేస్తే వాటిని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని, ప్రజల్లో భయాందోళనలు కలిగించారని తెలిపారు. కార్మికసంఘాలతో సయోధ్యకోసం ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రయత్నించిందని.. ఐఏఎస్‌లతో కమిటీ వేసిందని తెలిపారు. చర్చల ప్రక్రియ కొనసాగుతుండగా సమ్మెకు వెళ్లారని, ఈ సమ్మె చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

3078
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles