1,00,116 కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ సాయం పెంపు


Tue,March 20, 2018 04:23 AM

Telangana govt increases Kalyana Lakshmi scheme benefit to Rs 1 lakh

-పేదింటి బిడ్డల పట్ల ముఖ్యమంత్రి అవ్యాజ అనురాగం
-నా హృదయానికి దగ్గరైన పథకం కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్
-అమ్మాయి పెండ్లి భారం కాకూడదు.. అందుకే లక్షా నూటపదహార్లు
-ఆడపిల్లల తల్లులు సంతోషంతో ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు
-ప్రభుత్వ నిర్ణయానికి అందరి హర్షామోదాలు లభిస్తాయని ఆశిస్తున్నా
-అసెంబ్లీలో ప్రకటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్
kalyana-lakshmi
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పేదింటి ఆడపడుచులపట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన అవ్యాజమైన ప్రేమానురాగాలను మరోసారి చాటుకొన్నారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లి కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ప్రభుత్వం ఇప్పటివరకు అందిస్తున్న రూ.75,116 సహాయాన్ని లక్షా నూట పదహారు రూపాయలకు పెంచుతున్నట్టు సోమవారం శాసనసభలో ప్రకటించారు. వ్యక్తిగతంగా తన హృదయానికి ఎంతో దగ్గరైన పథకం కల్యాణలక్ష్మి అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు తీసుకొంటున్న సమయంలో తమకందిన సహాయానికి సంతోషిస్తూ, ఆడపిల్లల తల్లులు ఆనందబాష్పాలతో ప్రభుత్వాన్ని దీవిస్తున్నారని సంతోషం వ్యక్తంచేశారు. ఈ పథకం ఆర్థిక సహాయం పెంపు నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించిన వెంటనే సభ్యులంతా బల్లలు చరిచి హర్షం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన ఆయన మాటల్లోనే.. పేదరికం మనుషుల్ని అనేక రకాలుగా వేధిస్తుంది. పేదరికంతో బాధపడేవారికి కొన్నిసార్లు సంప్రదాయాలు కూడా భారంగా పరిణమిస్తాయి. మన సమాజంలో పెండ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకొన్న అంశం. అందులోనూ ఆడపిల్ల పెండ్లి మరింత భారంగా మారిపోయింది.

ఈ భారం వల్లనే చాలామంది తల్లిదండ్రులు తమ ఇంటి మహాలక్ష్మిగా గౌరవించే ఆడపిల్లను గుండెలమీద కుంపటిగా భావించే మానసికస్థితిలోకి పడిపోతున్నా రు. ఆడపిల్ల కడుపులో ఉండగానే, ఆ పిల్ల పెండ్లికోసం చేయాల్సిన ఖర్చును ఊహించి కొంతమంది భ్రూణహత్యలకు పాల్పడుతున్న అమానుష సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిసార్లు పేదల ఇండ్లల్లో ఆడపిల్లలు పెండ్లి కాకుండానే మిగిలిపోతున్నారు. ఆడపిల్ల పెండ్లి చేయడంకోసం కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. ఆర్థికంగా చితికిపోతున్నాయి. పరిపాలనలో మానవీయ విలువలు అడుగడుగునా ప్రతిబింబించాలని భావించే తెలంగాణ ప్రభుత్వం ఆడపిల్లలు ఎదుర్కొంటున్న కష్టాన్ని, వారి తల్లిదండ్రులు అనుభవిస్తున్న ఆవేదనని తీర్చాలని భావించింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీ కాకున్నా, పేదరికం ప్రభావాలను అధ్యయనంచేసే క్రమంలో పరిస్థితిలోని తీవ్రత మమ్మల్ని కదిలించింది. అందుకే పేద ఆడపిల్లల పెండ్లికి ప్రభుత్వం ఆర్థికంగా అండదండగా నిలువాలని నిర్ణ యించాం. కల్యాణలక్ష్మి అనే శుభప్రదమైన పేరుతో 2014 అక్టోబర్ 2న ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాం.

kalyana-lakshmi2

నా హృదయానికి ఎంతో దగ్గరైన పథకం

ఆడపిల్లల కన్నీరు తుడిచి వారి తలపై కల్యాణాక్షతలు చల్లిన ఈ పథకం తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠను పెం చింది. కల్యాణలక్ష్మి వ్యక్తిగతంగా నా హృదయానికి ఎంతో దగ్గరైన పథకం. అంతకంటే ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలు మెచ్చిన పథకం. ఆడపిల్లల కండ్లల్లో ఆనందం నింపిన పథకం. మొదట ఈ పథకాన్ని కల్యాణలక్షి పేరుతో ఎస్సీ,ఎస్టీలకు, షాదీముబారక్ పేరుతో మైనార్టీ వర్గాల ఆడపిల్లల పెండ్లికి రూ.51,000 అందించే పథకంగా ప్రారంభించాం. ఆ తర్వాత ప్రజలనుంచి వచ్చిన అభ్యర్థన మేరకు సామాజికవర్గంతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ వర్తింపచేశాం.

ఆడపిల్లల తల్లులు దీవిస్తున్నారు

సార్థకమైన ఈ పథకం ప్రయోజనం మరింత పెంచాలన్న ఉద్దేశంతో.. పథకం ద్వారా అందించే మొత్తాన్ని గతేడాది రూ.75,116కు పెంచాం. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 3.60 లక్షల మందికి లబ్ధి చేకూరింది. కల్యాణలక్ష్మి చెక్కులు తీసుకుంటున్న సమయంలో తమకందిన సహాయానికి సంతోషిస్తూ, ఆడపిల్లల తల్లులు ఆనందబాష్పాలతో ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఇతర సామాజిక ప్రయోజనాలను సాధించింది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందడానికి కనీస వయో పరిమితి 18 సంవత్సరాలుగా నిర్ణయించాం.దీంతో పథకం ప్రయోజనాలు పొందడంకోసం బాల్య వివాహాలు చేయకుండా 18 సంవత్సరాలు నిండేవరకు తల్లిదండ్రులు వేచి ఉంటున్నారు. ఈ విధంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం బాల్య వివాహాలను నిరోధించడానికి కూడా ఉపయోగపడుతున్నది. కల్యాణలక్ష్మి సహాయం అందుకున్న వివాహాలకు ప్రభుత్వ గుర్తింపుతోపాటు చట్టబద్ధత లభిస్తున్నది. ఇది ఈ పథకం సాధించిన మరో ప్రయోజనం.

అత్యంత మంగళకరమైన ఈ పథకానికి సంబంధించి మరో శుభవార్తను ఈ రోజు ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద ఆడపిల్ల పెండ్లికోసం అందించే మొత్తాన్ని రూ.75,116 నుంచి రూ. లక్షా నూట పదహార్లకు పెంచుతున్నామని ఎంతో సంతోషంతో ప్రకటిస్తున్నాను. ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి ఆడపిల్లలు, వారి తల్లిదండ్రుల నుంచే కాకుండా, సమాజహితం కోరే వారందరినుంచి హర్షామోదాలు లభిస్తాయని విశ్వసిస్తున్నాను. వారి ఆశీర్వాదమే కొండంత అండగా సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని సవినయంగా తెలియజేస్తున్నాను అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

మండలిలో ప్రకటన చేసిన కడియం శ్రీహరి..

షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలకు ఇచ్చే మొత్తం పెంపునిర్ణయాన్ని శాసనమండలిలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. మండలి సభ్యులు హర్షధ్వానాలతో ఆమోదం తెలిపారు.

3511
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS