43 శాతం ఐఆర్ ఇప్పించండి


Wed,September 12, 2018 01:40 AM

Telangana Govt Employees Association Meets CS S.K.Joshi Over Interim Relief For Employees

-సీఎస్ జోషికి ఉద్యోగ సంఘాల జేఏసీ వినతి
-ఆంధ్రాకు కేటాయించిన తెలంగాణవారిని తిరిగి రప్పించాలని విజ్ఞప్తి
-కొంతమంది అధికారుల తీరుతోనే పీఆర్సీ రాలేదని మీడియా ఎదుట జేఏసీ ఆవేదన

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉద్యోగులకు ఐఆర్ 43, పీఆర్సీ 63 శాతం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కోరింది. జేఏసీ నేతలు 14 డిమాండ్లతోకూడిన వినతిపత్రాన్ని మంగళవారం సచివాలయంలో సీఎస్‌కు అందజేశారు. అంతకుముందు టీఎన్జీవో భవన్‌లో ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్రస్థాయి నాయకత్వం సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. సీఎస్‌ను కలిసిన అనంతరం సచివాలయంలో ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడారు. ఆగస్టు 15 నుంచి పీఆర్సీ వస్తుందని సీఎం కేసీఆర్ చెప్పడంతో ఉద్యోగులంతా సంబురాలు చేసుకున్నారని, కానీ కొందరు ఉద్యోగుల తీరు వల్లే పీఆర్సీ రావడంలేదని, ఐఆర్ ప్రకటించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే సీఎస్‌ను కలిశామని, సీఎంతో చర్చించి పరిష్కరిస్తారనే నమ్మకం ఉన్నదని చెప్పారు.

గతంలో ఆంధ్రా ఉద్యోగులతో సమానంగా జీతాలు ఉండాలని తెలంగాణ ఉద్యోగుల జీతాలు తగ్గించడంతో నష్టం జరిగిందని, ప్రభుత్వం పీఆర్సీ నివేదిక తెప్పించుకొని 2018 జూలై 1వ తేదీ నుంచి అమలుచేయాలని కోరారు. ఏకసభ్య కమిషన్‌తో నివేదిక ఆలస్యమవుతుందని, త్వరగా పీఆర్సీ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్.. త్రిసభ్య కమిటీని వేసి, నివేదిక ఇవ్వడానికి మూడునెలల గడువు ఇచ్చారని తెలిపారు. డ్యూ డేట్ నుంచి ఐఆర్ ప్రకటించాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాకు కేటాయించిన తెలంగాణ వారిని తిరిగి తీసుకురావాలని కోరారు. పండిత ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలు ఇవ్వాలని, ఉద్యోగులకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు రావాల్సి ఉన్నదన్నా రు. ఐఆర్‌పై ఎన్నికలకు ముందే నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం ఉన్నదన్నారు. ఎన్నికల షెడ్యూల్ రాలేదని, రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నదని, తెలంగాణకు సీఎం ఉన్నాడని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చినట్టే వేతనాలు ఇవ్వాలని ఆయన కోరారు. సీఎస్‌ను కలిసినవారిలో టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, హైదరాబాద్ అధ్యక్షుడు కృష్ణయాదవ్, ఇంటర్ జేఏసీ నాయకులు మధుసూదన్‌రెడ్డి, టీఎన్జీవో సంఘం కార్యదర్శి రేచల్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ తదితరులు ఉన్నారు.

1628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles