స్వచ్ఛ తెలంగాణ


Mon,August 19, 2019 02:26 AM

Telangana Government plans law which will punish spitting and throwing garbage

-21 జిల్లాల్లో 100 శాతం ఓడీఎఫ్
-మిగిలిన జిల్లాల్లో 90 శాతం పైనే పురోగతి
-అక్టోబర్ 2 నాటికి రాష్ట్రమంతా పూర్తి
-కేంద్ర జాబితాలో 94.59 శాతంతో ముందంజ

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: స్వచ్ఛ తెలంగాణ సాకారమవుతున్నది. అక్టోబర్ 2 గాంధీజయంతి నాటికి వందశాతం బహిరంగ మలవిసర్జన రహిత (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ-ఓడీఎఫ్) రాష్ట్రంగా మారనున్నది. ఇప్పటికే 21 జిల్లాలు 100 శాతం ఓడీఎఫ్ సాధించగా.. మిగిలిన జిల్లాలు 90 శాతానికి పైగా సాధించి పురోగతిలో ఉన్నాయి. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్రప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తొలినాళ్లలోనే 90 రోజుల ప్రణాళిక రూపొందించి పాలకవర్గాలకు పరిశుభ్రత లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించి, బహిరంగ మలవిసర్జన లేకుండా చేయాలని రాష్ట్రప్రభుత్వం 2014లోనే నిర్ణయించింది. ఇందుకోసం ఉపాధి హామీ నిధులను వినియోగించుకొనేందుకు కూడా వెసులుబాటు కల్పించింది. గ్రామాలు, పట్టణాలు అనే తేడాలేకుండా ప్రతిఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని నిబంధనలు విధించింది. ఓడీఎఫ్‌పై ఏటేటా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ దానిని సాధిస్తూ వస్తున్నది. 2014 అక్టోబర్ 2 నాటికి 38.7 శాతంగా ఉన్న ఓడీఎఫ్.. 2015-16 వరకు 50.58కి చేరింది. 2016-17లో 64.59శాతం, 2017-18లో 83.93 శాతం వృద్ధి సాధించింది. ప్రస్తుతం కేంద్రస్థాయిలో 94.59 శాతం ఓడీఎఫ్ సాధించిన తెలంగాణ.. వచ్చే రెండునెలల్లో 100 శాతం దిశగా పరుగులు తీస్తున్నది.

అగ్రస్థానంలో ఆరుజిల్లాలు

స్వచ్ఛతదర్పణ్‌లో తెలంగాణ ముందువరుసలో ఉన్నది. ఇప్పటికే జాతీయస్థాయిలో ఆరుజిల్లాలు అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. వరంగల్ అర్బన్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలు జాతీయస్థాయిలో అగ్రస్థానంలో ఉండగా.. మహబూబ్‌నగర్ 23, వనపర్తి 26, ఖమ్మం 69, మేడ్చల్ మల్కాజిగిరి 75, జోగుళాంబ గద్వాల 87, జనగామ 88, మంచిర్యాల జిల్లా 95వ స్థానంలో నిలిచాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం రాష్ట్రంలో 21 జిల్లాలు మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగంలో 100 శాతాన్ని సాధించాయి. వీటిల్లో కొన్ని జిల్లాలు కమ్యూనిటీ సోక్‌ఫిట్స్, కంపోస్ట్ పిట్స్, జియోట్యాగింగ్ చేయడంలో ఒకట్రెండు శాతం వెనుకబడటంతో జాతీయస్థాయిలో 100కు పైగా ర్యాంకుల జాబితాలో ఉన్నాయి. వందశాతం ఓడీఎఫ్ సాధించిన జిల్లాల జాబితాలో జగిత్యాల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం,పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, వనపర్తి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, వినియోగం ప్రతి ఇంటికి ఉన్నట్లు పరిశీలనలో తేలింది.

అక్టోబర్ నాటికి రాష్ట్రమంతా..

వచ్చే అక్టోబర్ నాటికి రాష్ట్రమంతా పరిశుభ్రమైన ప్రాంతంగా చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. 21 జిల్లాల్లో వందశాతం ఓడీఎఫ్ పూర్తికాగా.. హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాలు 90 శాతంపైనే పురోగతిలో ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం గుర్తించిన ఇండ్లన్నింటికీ మరుగుదొడ్లు మంజూరు చేసినట్టు అధికారులు వెల్లడించారు. వీటి నిర్మాణాలన్నీ పూర్తికావచ్చాయని తెలిపారు. కేంద్రం పరిగణనలోకి తీసుకునే ఓడీఎఫ్, పచ్చదనం, పరిశుభ్రత, తాగునీటి అంశాలను వచ్చే 45 రోజుల్లో వందకు వందశాతం పూర్తిచేసి జాతీయస్థాయిలో అన్నింటా ముందుస్థానంలో నిలువాలనే దృఢసంకల్పంతో అధికారులు పనిచేస్తున్నారు. అక్టోబర్ 2 నాటికి గాంధీజీ కలలుగన్న స్వచ్ఛత గ్రామాలు తెలంగాణలో ఆవిష్కరణ కానున్నాయి.

945
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles