నాణ్యమైన విద్యపై సర్కారు దృష్టి


Mon,August 26, 2019 01:40 AM

Telangana Government focus on quality education

-కొనసాగుతున్న హాజరు మాసోత్సవం
-సెప్టెంబర్‌లో నాణ్యతపై కార్యక్రమాలు
-పదోతరగతి విద్యార్థులకు సైకోమెట్రిక్ పరీక్షలు
-అధికారులకు వ్యక్తిత్వ వికాస తరగతులు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పాఠశాల విద్యాశాఖలో నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో చేపట్టిన హాజరు మాసోత్సవంతో మంచి ఫలితం కనిపిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలు, ప్రాధాన్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు కూడా ముందుకువస్తున్నారని, ఇది శుభపరిణామంగా భావిస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ప్రతిరోజూ తరగతులకు వస్తే సహజంగానే విద్యాభ్యాసం బాగుంటుందని, ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలలతోపాటు కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో హాజరు పెరిగిందని అన్నారు.

సమగ్ర ప్రణాళికతో నాణ్యత మాసోత్సవాలు

పాఠశాల విద్యలో నాణ్యతకు విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఆదేశాలతో ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సెప్టెంబర్‌లో నాణ్యత మాసోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ కార్యదర్శి తెలిపారు. అధికారులకు వ్యక్తిత్వ వికాస తరగతులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు ఏయే కార్యక్రమాలు నిర్వహించాలనే అంశాలతో సమగ్ర ప్రణాళికలను, మార్గదర్శకాలు జారీ చేశారు. అనంతరం విద్యార్థులే స్వయంగా తాము ఎంతవరకు చదువుకున్నామో, ఎంత నేర్చుకున్నామో తెలుసుకోవడానికి స్వీయ పరీక్ష నిర్వహించుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోనున్నారు.

పదో తరగతి విద్యార్థులకు సైకోమెట్రిక్ పరీక్షలు

అన్ని రకాల పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు వారి భవిష్యత్తు ఏమిటి? అని తెలుసుకునేందుకు ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ సంస్థతో కలిసి సైకోమెట్రిక్ పరీక్షలను నిర్వహించబోతున్నారు. తొలుత రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలోని పదో తరగతి విద్యార్థులకు సైకోమెట్రిక్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల విద్యార్థులకు నిర్వహించే ఆలోచన చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ టీ విజయ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి, నాణ్యమైన విద్య కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు.

1042
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles